Read more!

హరి పరీక్షను స్వీకరించిన బాబా

 

 

శ్రీ సాయిసచ్చరిత్రము నలుబదితొమ్మిదవ అధ్యాయము - 1భాగం

హరి పరీక్షను స్వీకరించిన బాబా


 

హరికానోబా అను పెద్దమనిషి బొంబాయిలో తన స్నేహితులు, బంధువుల వల్ల బాబా లీలల గురించి అనేకం వినెను. కానీ నమ్మలేదు. కారణం సంశయస్వభావం కావటం. బాబాను స్వయంగా చూసి పరీక్షించవలెనని అతని కోరిక. కొంతమంది మిత్రులతో కలిసి ఆయన షిరిడీకి వచ్చెను. ఆయన తలపై జలతారు పాగా పెట్టుకుని వుండెవాడు. పాదాలకు కొత్త చెప్పులు వేసుకొని వచ్చాడు. బాబాను దూరం నుంచి చూసి సాష్టంగ నమస్కారం చేయాలనుకొనెను. కానీ, కొత్త చెప్పులు ఎక్కడ వుంచాలో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు దగ్గర ఒక మూలన పెట్టిబాబా దర్శనానికి వెళ్లాడు. బాబాకు భక్తిపూర్వకంగా నమస్కారం చేసి ఊది, ప్రసాదం బాబ చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాడు. మూలకు పోయి చూసే సరికి చెప్పులు కనిపించలేదు. చెప్పులకోసం వెదికాడు. కానీ కనిపించలేదు. చాలా చికాకు పడుతూ తన బసకు చేరుకున్నాడు.

 

 

అతడు స్నానం చేసి, పూజ విధులు నిర్వర్తించి, నైవేద్యము సమర్పించి భోజనానికి కూర్చున్నాడు. కానీ అతని మనసు చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము, చేతులు కడుగుకోవడానికి బయటకు వచ్చాడు. అప్పుడు ఒక మరాఠి కుర్రవాడు తనవైపే వచ్చుట గమనించాడు. ఆ కుర్రవాడి చేతిలో ఒక కర్ర, ఆ కర్రకు చివరన కొత్త చెప్పులు వేలాడుతూ కనిపించాయి. వారిని చూసి ఆ బాలుడు హరికా బేటా, జరీకా ఫేటా అని అరిచెను. అలా బాబా తనను అరవమని చెప్పాడని కూడా పలికెను. ఈ చెప్పులు చూసి ఎవరైనా ఇవి తమవని అడిగితే వారిని 3 విషయాలు సరిచూసుకోమని బాబా చెప్పారని ఆ బాలుడు వారికి చెప్పాడు. అడిగిన వారి పేరు హరి అని, అతని తండ్రి పేరు కానోబా అని, అతని తలపై జరీపాగా వున్నదీ చూసుకోమని బాబా ఆ బాలుడికి చెప్పి పంపెను. ఆ మాటలు విని హరికానోబా ఆశ్చర్యపోయెను. బాలుడికి తన పేరు హరి అని, తన తండ్రి పేరు కానోబా అని చెప్పి, తన తలపై గల జరీపాగాను చూపించాడు. ఆ బాలుడు సంతృప్తి చెంది చెప్పులు ఇచ్చి వెళ్లిపోయాడు.

 

ఇది హరికానోబాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. జరీపాగా అందరికీ కనిపించును, కానీ తన పేరు, తన తండ్రి పేరు బాబాకు ఎట్ల తెలిసెనో అని అతను ఆలోచనలో పడెను. తను మొదటి సారి షిరిడీకి వచ్చాడు, అదీ బాబాను పరీక్షంచడానికి. ఈ సంఘటనతో బాబా సత్పురుషుడని గ్రహించాడు హరికానోబా. తాను బాబాను పరీక్షంచుటకు వచ్చెను, అది నెరవేరినందుకు ఆనందముగా ఇంటికి వెళ్లాడు.  బాబాను పరీక్షించడానికి వచ్చిన మరో ఇద్దరి కథలు ఈ అధ్యాయం రెండవ భాగంలో....