సద్గురు శివానందమూర్తికి అక్షర నివాళి
సద్గురు శివానందమూర్తికి అక్షర నివాళి
దైవాంశ సంభూతులుగా ఆయన శిష్యులు భావించే శ్రీశైవ పీఠాధిపతి, మహామహోపాధ్యాయ, పరమపూజ్యులైన శ్రీ శ్రీ శ్రీ సద్గురు కందుకూరి శివానందమూర్తి బుధవారం తెల్లవారుఝామున కైలాసప్రాప్తి చెందడం ఆయన శిష్యులకు పెద్ద శరాఘాతమైంది. కొద్దిరోజుల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భారత ప్రధాని నరేంద్రమోడీ అంతటి వ్యక్తి కూడా సద్గురు శివానందమూర్తి కోలుకోవాలంటూ ట్విట్ చేశారంటే శివానందమూర్తి ఎంతటి సద్గురువో అర్థం చేసుకోవచ్చు.
సద్గురు కందుకూరి శివానందమూర్తి దక్షిణామూర్తి స్వరూపులు. ‘సద్గురు’ అనే మాటకు పరిపూర్ణమైన అర్థంగా నిలిచే గురుదేవుడాయన. ఆయన ఆధ్యాత్మిక జ్ఞానమూర్తి మాత్రమే కాదు.. ఒక మానవతామూర్తి. లెక్కకు మిక్కిలి శిష్యులు, అభిమానులు వున్న ఆయన విశాఖపట్నం సమీపంలోని భీమిలిలో వున్న ఆనందవనం ఆశ్రమాన్ని స్థాపించారు. అలాగే ఆయన వరంగల్‌లోని ఆశ్రమంలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు వరంగల్ ఆశ్రమం ఆవరణలోనే జరగనున్నాయి.
సద్గురు కందుకూరి శివానందమూర్తి తల్లిదండ్రుల పేర్లు సర్వమంగళ, వీరబసవరాజు వీరు పరమ శివభక్తులు. వీరు దాదాపు రెండు వందలకు పైగా శివాలయాలు నిర్మించారు. శివానందమూర్తి బాల్యం నుంచి ఆధ్యాత్మిక విషయాలపట్ల, ముఖ్యంగా యోగశాస్త్రం అంటే మిక్కిలి ఆసక్తి కనపరచేవారు. అటు ఉద్యోగ ధర్మం, ఇటు పేదల సహాయానికి, ధర్మబోధనకు ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ అధికారిగా స్వచ్ఛంద పదవీవిరమణ అనంతరం సాంస్కతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సేవా రంగాలలో బహుముఖీన సేవలందించటానికి పూనుకున్నారు. సద్గురు కందుకూరి శివానందమూర్తి ప్రచార పటాటోపాలు కోరుకోని అసలైన సద్గురువు. ఆయన కదిలివస్తుంటే వేయి వెన్నెలల చల్లదనం వ్యాపిస్తుందని, ఆయన కన్నుల్లో కరుణ రస సాగరాలు ఉన్నాయనిపిస్తుందని, గురువుగారి అనుగ్రహ భాషణలు మనసుల్లో ఆధ్యాత్మిక అనుభూతుల మల్లెల్ని పూయిస్తాయని ఆయన శిష్యులు చెబుతారు.
ఈ ప్రపంచంలో స్వార్థమే రాజ్యమేలుతోంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా స్వార్థం పెరిగిపోయింది. అయితే పరహితమే పరమ సంకల్పంగా మార్చుకున్న ఆధునిక తథాగతుడు సద్గురు శివానందమూర్తి. సద్గురు శివానందమూర్తి నిన్నటి సాంస్కృతిక స్వర్ణ స్మృతుల వ్యాఖ్యాత. ఆధునిక యుగంలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న ప్రవక్త. ఆయన నిలువెత్తు జాతీయాదర్శం. ఆయన నిరాడంబరతకు నిదర్శనం. గత కాలపు సౌరభాలకు, మన యుగపు మంచితనానికి రేపటి జాతి ఘనతకు సతార్కిక సేతువు నిర్మిస్తున్న అద్భుత స్రష్ట గురువుగారు. మంత్రవేత్త, తత్త్వవేత్త, శాస్త్రవేత్త, సాహితీవేత్తల సమ్మేళనమే సద్గురు శివానందమూర్తి అని ఆయన శిష్యులు అంటారు.
మహోన్నత భారతీయ సంస్కతిని కాపాడటానికి తనవంతు కృషిచేయడం, ఆర్ష ధర్మ సంరక్షకులుగా కర్తవ్యం నిర్వర్తించడం, కవిపండిత పోషణ, కళాకారులకు, గ్రంథ ప్రచురణకు ఆర్థిక సహాయం అందించటం ప్రాచ్య, పాశ్చాత్య దేశ పర్యటనలలో మన ప్రాచీన సంస్కతీ వైభవాన్ని ఎలుగెత్తి చాటడం ఆయన నిత్యకృత్యాలు. ఆయన భారతీయ సాంస్కృతిక ప్రతినిధిగా దేశమంతటా పర్యటించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యటించారు. రెండు వందలకుపైగా యజ్ఞాలు నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయలను వివరిస్తూ అనేక పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఎన్నో గ్రంథాలను ముద్రించారు. మాటల్లో వర్ణించడానికి కుదరని విధంగా ఎంతో ఔన్నత్యాన్ని ప్రదర్శించిన సద్గురు కందుకూరి శివానందమూర్తికి ‘తెలుగువన్’ అక్షర నివాళులు సమర్పిస్తోంది.
-అంతర్యామి