Greatness of Stone

 

రాయి ఎందుకు గొప్పది?

Greatness of Stone

 

''రాయి స్థిరమైంది'' అంటూ ధార్మిక గ్రంధాల్లోని మంత్రాలు రాతి గొప్పతనాన్ని వర్ణించాయి. శిల స్థిరమైంది, శాశ్వతమైంది కనుకనే వాటితో శిల్పాలు రూపొందిస్తారు. దేవుడి ప్రతిమలు, ఇతర విగ్రహాలు ఎక్కువగా శిలలతో చెక్కినవే. రాయి తక్కువ ఖర్చుతో కూడుకున్నది, కలకాలం ఉంటుంది కనుక లోహాలతో కంటే శిలలతోనే శిల్పాలు విస్తారంగా తయారయ్యాయి.

 శిలలతో విగ్రహాలు రూపొందించడమే కాదు, స్తంభాలు, ఆలయాలు సైతం నిర్మించారు. రాతితో బహు సుందరమైన నిర్మాణాలు మలచారు. పర్వతాల్లో అక్కడక్కడా దర్శనమిచ్చే సహజమైన గుహల సంగతి అలా ఉంచితే కొండలను తొలచి చక్కటి గుహాలయాలు రూపొందించారు. ఆ గుహాలయాల్లో దేవుళ్ళు, జంతువుల ప్రతిమలను తీర్చిదిద్దారు.

  ప్రముఖ ఆలయాల్లో ఎక్కువశాతం కొండలమీద కొలువుతీరి ఉన్నాయి. అందుకు రెండు కారణాలున్నాయి. మొదటిది కొండ శిలపై నిర్మితమైంది సుదీర్ఘకాలంపాటు శాశ్వతంగా ఉంటుంది. రెండో కారణం మనం ఆరాధించే దేవుని ఉన్నతంగా భావిస్తాం కనుక కొండమీద ఆలయాలు కట్టారు. అది మహోత్కృష్టతకు చిహ్నం. కొండలపై వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతకుమించి ప్రశాంతత ఉంటుంది. కొండ ఎక్కి దిగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అధిక బరువుతో బాధపడేవారికి సత్వర ప్రయోజనం ఉంటుంది. అందువల్ల కొండమీది ఆలయాన్ని దర్శించుకోవడంవల్ల ఆధ్యాత్మిక చింతన పెరగడం, పుణ్యం రావడమే గాక వ్యాయామం చేసినట్లవుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు రావు.

 మనలో చాలామందికి రాళ్ళ విలువ తెలీదు. పనికిమాలినవి, నిరుపయోగమైనవి అనుకుంటాం. ఎవరయినా మనసు లేనట్లు ప్రవర్తిస్తే, ''రాతి మనిషి, చలనం లేదు'', ''రాతి మనసు, కరగదు..'' అనేస్తాం. ఇదంతా తెలివిలేనితనమే. నిజానికి రాళ్ళు చాలా విలువైనవి. అసలు రాళ్ళు లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి. ఎంత దారుణంగా, దుర్భరంగా ఉంటుంది కదూ! నిజమే, లోకంలో ఏదీ వ్యర్ధమైంది కాదు. ప్రతిదీ పనికొస్తుంది. దేన్ని, ఎప్పుడు, ఎలా వాడుకోవాలో తెలిస్తే చాలు, అన్నీ విలువైనవే, కావాల్సినవే. అమూల్యమైన నవ రత్నాలు కూడా ఒక విధమైన రాళ్ళే. అయస్కాంతం కూడా ఒక శిలే. కంకర్రాళ్ళు, గ్రానైట్, మార్బుల్ - ఇలా అనేక రాళ్ళతో అందమైన ఇళ్ళు కట్టుకుంటున్నాం. కుంకుమ రాళ్ళు, సున్నపు రాళ్ళు లాంటి ఎన్నో రాళ్ళను మనం నిత్య జీవితంలో ఉపయోగించుకుంటున్నాం. అయస్కాంత శిలలో ఇనుమును ఆకర్షించే శక్తి ఉన్నట్లే ఇతర రాళ్ళలో కూడా వేరొక శక్తి (latent force) నిక్షిప్తమై ఉంటుంది.

  చెకుముకి రాయిలో నిప్పు దాగి ఉంది. చెకుముకి రాళ్ళను ముక్కలుగా చేసి విద్యుత్ సంపర్కం కలిగిస్తే అవి కదులుతాయి. చెకుముకి రాతిని silica అంటారు. వీటిని నిర్దిష్టమైన ముక్కలుగా చేసి విద్యుత్ సంపర్కం కలిగిస్తే చలనం కలుగుతుంది. రాళ్ళ ఆకృతిని బట్టి చలనం ఆధారపడి ఉంటుంది. ఇలా రాళ్ళలో చలనం కలిగించడాన్ని quartz technology అంటారు. ఈ క్వార్ట్జ్ కు విద్యుత్ సంపర్కం కలిగిస్తే క్షణానికి 30 వేల కంటే ఎక్కువసార్లు చలిస్తుంది.

 ఒకటా, రెండా... రాళ్ళవల్ల బోల్డన్ని ఉపయోగాలు... రోడ్లు వేయాలంటే, ఇళ్ళు, భవనాలు కట్టాలంటే, మరెన్నో, ఇంకెన్నో పనుల్లో రాళ్ళు లేనిదే పని జరగదు. మహా శిల్పి చేతిలో, శిలలు మైనం ముద్దల్లా సాగి, మహా శిల్పాలుగా తయారౌతాయి. తరతరాలు మురిసిపోయేలా శాశ్వతత్వాన్ని సంతరించుకుంటాయి. గోల్కొండ, చార్మినారు, తాజ్ మహల్ లాంటి కళాఖండాలు సగర్వంగా నిలబడతాయి.

 

rock importance, stone importance, sculpture with stones, types of stones, rock multiple purpose, temples on hills, statue with stone