జలంధరునితో యుద్ధం చేసిన మహాశివుడు

 

కార్తీక మహా పురాణం ఇరవై రెండవ రోజు

జలంధరునితో యుద్ధం చేసిన మహాశివుడు

Karthika Puranam – 22

నారద ఉవాచ

''పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి మోగించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలింది. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడిని రాహువు చూశాడు. తత్ఫలితంగా జలంధరుని కిరీటం నేలపై పడింది. రాక్షససేనా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఇది తెలిసిన దేవతలు ఇంద్రుని ముందర ఉంచుకుని రహస్య మార్గాన శివుని సన్నిధికి వెళ్ళి యుద్ధ వార్తల్ని విన్నవించారు.

''ఓ దేవాదిదేవా! ఇన్నాళ్ళుగా వానివల్ల మేం పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలుసు. ఈవేళ వాడు నీమీదికే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్ధం వానిని జయించు తండ్రీ!'' అని ప్రార్ధించారు.

వెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు. విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడు ''కేశవా! గత జగడంలోనే ఆ జలంధరుని అంతం చేయకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండటమేమిటి?'' అనడిగాడు.

అందుకు జవాబుగా విష్ణువు ''పరమేశ్వరా! ఆ జలంధరుడు నీ అంశవల్ల పుట్టినందున లక్ష్మీదేవికి సోదరుడు కావడంచేత యుద్ధంలో నేను చంపలేదు. కనుక, నువ్వే వానిని జయించు'' అని చెప్పాడు. అందుమీదట శివుడు ''ఓ దేవతలారా! వాడు మహా పరాక్రమవంతుడు. ఈ శస్త్ర అస్త్రాల వల్ల కానీ, నా చేత కానీ మరణించేవాడు కాదు. కనుక, మీరందరూ కూడా ఈ అస్త్ర శస్త్రాల్లో మీమీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి'' అని ఆజ్ఞాపించడంతో విష్ణు ఆది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు.

గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమమూ, భీషణజ్వాలాస్యము వేగసంపన్నము, అత్యంత భయంకరము అయిన ''సుదర్శన'' చక్రాన్ని వినిర్మించాడు.

అప్పటికే ఒక కోటి ఏనుగులు, ఒక కోటి గుర్రాలు, ఒక కోటి కాల్బలముతో కైలాసభూములకు చేరిన జలంధరుని దేవతలు, ప్రమదగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో జలంధరుని మార్కొన్నారు.

రెండు తెగల మధ్యనా భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరకాలైన భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ రథాది ధ్వనులతోనూ గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది. పరస్పర ప్రయోగితాలైన శూల, పట్టిస, తోమర, బాణ, గదాది ఆయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది. యుద్ధభూమిలో నేలకూలిన రథ గజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి. ఆ మహాహవంలో ప్రమద బాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవనీ విద్యతో పునర్జీవింప చేయసాగాడు.

ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖంలో మహాశక్తి ఆవిర్భవించి మహా వృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది. మొట్టమొదట రాక్షసులు ఎందరినో తినేసింది. ఆపైన శుక్రుడిని సమీపించి అతన్ని తనలో చేర్చుకుని అంతర్ధానమై పోయింది. చనిపోయిన వారిని తిరిగి బతికించే శుక్రుడు లేకపోవడంవల్ల ప్రమదగణాల విజ్రుంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకలా చెల్లాచెదరైపోసాగింది.

అందుకు కినిసిన శుంభనిశుంభ కాలనేమ్యాది సేనా నాయకులు అగణ శరపరంపరతో శివగణాలను నిరోధింపసాగారు. పంటచేలపై మిడతల దండులాగా తమమీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై, అప్పుడే పూసిన మోదుగచెట్లవలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షససేనలమీదికి విజ్రుంభించారు.

నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకి తలపడ్డారు. నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్య (కుమార) స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది.

నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి గుర్రాలను, జెండాను, ధనుస్సును, సారధిని నాశనం చేశాడు. అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుని వాహనమైన ఎలుకను బాణంతో బాధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకన శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని కొట్టాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలబడ్డారు. దీన్ని గుర్తించి వారిమధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ-భైర-బేతాళ-పిశాచ-యోగినీ గణాలు అన్నీ ఆయన్ను అనుసరించాయి.

గణసహితుడైన వీరభద్రుని విజ్రంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్చదేరిన నందీశ్వర, కుమారస్వాములు ఇద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళందరి విజ్రుంభణతో వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు ''అతి'' అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంతం అంతా నిండిపోయింది. అయిదు బాణాలతో విఘ్నేశ్వరుడిని, తొమ్మిది బాణాలతో నందీశ్వరుని, ఇరవై బాణాలతో వీరభద్రుని కొట్టి మూర్చ పోగొట్టి భీషణ అయిన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుని గుర్రాలను, పతాకాన్ని, గొడుగును నరికేశాడు. మరో మూడు బాణాలు అతని గుండెల్లో గుచ్చుకునేలా నాటాడు. దాంతో మండిపడ్డ జలంధరుడు ''పరిఘ'' అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు.

అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. తర్వాత జలంధరుడు వీరభద్రుని తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు. చివరికి దేవతల ప్రార్ధనలమీద శివుడు జలంధరునితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతన్ని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణు మాయను ప్రయోగించదానికి బయల్దేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది.

recite chapters of Karthika Puranam, Karthika Puranam stories and hindu rituals, Auspicious Karthika Masam and Sacred Karthika Puranam, Punya with Karthika Purana