విష్ణుమూర్తిని శపించిన బృంద

 

కార్తీక మహా పురాణం ఇరవై మూడవ రోజు

విష్ణుమూర్తిని శపించిన బృంద

Karthika Puranam – 23

జలంధరుడు వీరభద్రుని తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు. చివరికి దేవతల ప్రార్ధనలమీద శివుడు జలంధరునితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతన్ని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణు మాయను ప్రయోగించదానికి బయల్దేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది.

అప్పుడు ముని కారుణ్యం ప్రదర్శిస్తూ, ఆకాశంవంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని బోధించాడు. ఆ రెండు కోతులూ మళ్ళీ ఆకాశానికి ఎగిరి, అతి కొద్దిసేపట్లోనే తెగవేయబడిన జలంధరుని చేతులను, మొండేన్ని, తలను తెచ్చి వారి ముందు ఉంచారు. తన భర్త ఖండితావయవాలను చూసి బృంద ఘోల్లుమని ఏడ్చింది.

అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి, తన భర్తను బతికించవలసిందిగా ప్రార్ధించింది. అందుకా ముని నవ్వుతూ ''శివోపహతులైన వారిని బతికించడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీపట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణవల్ల తప్పక బతికిస్తాను'' అంటూనే అంతర్హితుడయ్యాడు.

అతనలా మాయమైందే తడవుగా జలంధరుని అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు. ఖిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకుని ఆమె ముఖాన్ని పదేపదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్తపట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడల్లో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు తిరిగి బతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేక పోయినా ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతన్ని విష్ణువుగా గుర్తించింది. మగని వేషంలో వచ్చి, తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ''ఓ విష్ణుమూర్తీ! పర స్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడును గాక! నీ మాయతో ఇంతకు పూర్వం కల్పించిన వానరులు ఇద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక! నువ్వు భార్యా వియోగ దుఃఖితుడివై నీ శిష్యుడైన ఆదిశేషునితో కలిసి అడవుల్లో పడి తిరుగుతూ వానర సహాయమే గతియైన వాడివి అగుగాక!'' అని శపించి తనను అభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకుని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికీ బృందనే స్మరించసాగాడు.

నిలువుగా కాలిపోయిన ఆమె చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపించసాగాడు. సిద్ధులు, ఋషులు ఎందరు ఎన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు.

Hindu calendar month Karthika Masam, Karthika Puranam and sacred rituals, Karthika Puranam Epic represents Lord Shiva, Karthika Puranam Epic represents Lord Vishnumurthy