Read more!

భగవద్గీతలో ఏ అధ్యాయం పారాయణ చేస్తే ఏ ఫలితం ఉంటుంది?

 

భగవద్గీతలో ఏ అధ్యాయం పారాయణ చేస్తే ఏ ఫలితం ఉంటుంది?

భగవద్గీత ఒక గొప్ప గ్రంథం. హిందూ ధర్మంలో ఈ గ్రంథానికి చాలా గొప్ప స్థానం ఉంది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కృష్ణుడు అర్జునుడికి చేసిన కర్తవ్య బోధనే భగవద్గీతగా పిలవబడుతోంది. ఇది కేవలం కృష్ణార్జునుల మధ్య సాగిన సారాంశంగా కాకుండా మొత్తం మనుష్య ప్రపంచానికి ఉద్దేశించి చెప్పబడిన గ్రంథంగా భావిస్తారు. ఈ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలలో ఒకోదాంట్లో ఒకోరకమైన విషయాన్ని ప్రస్తావించారు. వాటిని పారాయణం చేయడం వల్ల  కొన్ని ఫలాలు కలుగుతాయని మనవాళ్ళు చెపుతారు. ఇవి అందులో ఉండే విషయాలను అర్థం చేసుకోవడం వల్ల కలిగేవి కావు. నియమంతో పారాయణ చేస్తే దానివల్ల పాపాలు పోయి పుణ్యం కలగడంవల్ల కలుగుతాయి. అందులో విషయాన్ని పూర్తిగా గ్రహించినవారు, వాటిని జీవితంలో ఆచరించేవారికి కలిగే ఫలాలు అవి. 

 వాటి  గురించి వివరంగా చూస్తే:- 

 అర్జునవిషాదయోగం - దీన్ని చదవడంవల్ల మానవుడికి పూర్వ జన్మస్మృతి కలుగుతుంది. అతని అసలైన వ్యక్తిత్వం, అతని ప్రవర్తన అతనికి పూర్తిగా అర్థమవుతాయి. దానివల్ల మనిషి తన జన్మ లక్ష్యం ఏమిటి అనేది అర్థం చేరుకుని ఆ మార్గంలో వెళ్లగలుగుతాడు.

సాంఖ్యయోగం - దీవి వల్ల ఆత్మస్వరూపం గోచరిస్తుంది. ఆత్మస్వరూపం అనేది ఓ గొప్ప రహస్యం. అయితే తెలుసుకుంటే అది అందరికీ అర్థమవుతుంది. దాని అర్థం చేసుకునే శక్తిని మేల్కొలపడమే ఇందులో రహస్యం.

కర్మయోగం - దీన్ని ఎవరైనా పారాయణం చేస్తే, ఆత్మహత్య వగైరాల వల్ల చనిపోయి, ప్రేతత్వం పోకుండా ఉండే జీవులక్కడ ఉంటే వారికి ప్రేతత్వం నశిస్తుంది. ప్రేతత్వం అంటే మనిషిలో తృప్తి లేకుండా అశాంతితో ఉండటం.

జ్ఞానయోగం - కర్మసన్యాసయోగం - ఈ అధ్యాయాలు వింటే చెట్లు, పశువులు, పక్షులు గూడ పాపం నశించి, ఉత్తమగతిని పొందుతాయి.

ఆత్మసంయమయోగం – దీన్ని పారాయణ చేస్తే సమస్త దానాల ఫలితం కలిగి విష్ణుసాయుజ్యం కలుగుతుంది.

విజ్ఞానయోగం - ఈ అధ్యాయాన్ని వింటే జన్మరాహిత్యం కలుగుతుంది.

అక్షరపరబ్రహ్మయోగం – ఈ అధ్యాయం వింటే స్థావరత్వం, బ్రహ్మరాక్షసత్వం తొలగిపోతాయి.

రాజవిద్యా రాజగుహ్యయోగం - దీన్ని చదివితే ఇతరుల దగ్గర ఏదైనా వస్తువు తీసుకున్నందువల్ల మనకు వారినుంచి సంక్రమించిన పాపం నశిస్తుంది.

విభూతియోగం - ఆశ్రమధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏపుణ్యం కలుగుతుందో అది లభిస్తుంది. జ్ఞానం బాగా ఏర్పడుతుంది.

విశ్వరూప సందర్శనయోగం - దీన్ని పారాయణం చేయడంవల్ల చనిపోయిన వారు కూడా తిరిగి జీవిస్తారు.

భక్తియోగం - దీనివల్ల ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుతుంది. చనిపోయిన వారు కూడా దీనివల్ల బ్రతుకుతారు.

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం- దీన్ని పారాయణం చేస్తే చండాలత్వం నశిస్తుంది.

గుణత్రయ విభాగయోగం - దీనివల్ల స్త్రీ హత్యాపాతకం, వ్యభిచారదోషం నశిస్తాయి.

పురుషోత్తమ ప్రాప్తియోగం - ఇది భోజనానికి ముందు చదవతగింది. దీనివల్ల ఆహారశుద్ధి కలుగుతుంది. మోక్షం సిద్ధిస్తుంది.

దైవాసుర సంపద్విభాగయోగం - దీనివల్ల బలపరాక్రమాలు, నుఖం లభిస్తాయి. 

శ్రద్ధాత్రయవిభాగయోగం- దీనివల్ల ఎన్నో తీవ్రమైన వ్యాధులు నశిస్తాయి.

మోక్ష సన్యాస యోగం - దీనివల్ల సమస్త యజ్ఞాచరణఫలం కలుగుతుంది. ఉద్యోగం లభిస్తుంది.

ఈ విధంగా భగవద్గీతలో అధ్యాయాలు పారాయణ చేయడం వల్ల ఫలితాలు కలుగుతాయి. అయితే కొన్ని అధ్యాయాలు చదివితే చనిపోయిన వారు కూడా తిరిగి బ్రతుకుతారని చెప్పినమాట నిజమేనా అనే సందేహం చాలామందికి వస్తుంది. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఒకటుంది. భూమి మీద పాపపు భారం పెరిగేకొద్దీ మనిషికి దక్కాల్సిన ఫలితం దూరంగా వెళుతుంది. మనసా వాచా కర్మణా భగవద్గీత పారాయణ చేసేవారు ఎంతమంది ఉన్నారో తెలియదు. కనీసం ఈ ఫలాలు లభిస్తాయి అని ఆశించి అయినా చేస్తారేమో కానీ ఏమీ ఆశించకుండా చేసేవారు ఉన్నారో లేదో తెలియదు. ఆశించకుండా చేసేపనిలోనే ఫలితం దక్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి.

                                          ◆నిశ్శబ్ద.