భారతీయ ధర్మంలో ఆధ్యాత్మికత అసలు రూపం!

 

భారతీయ ధర్మంలో ఆధ్యాత్మికత అసలు రూపం!

మన పూర్వులు మన కోసం నిర్మించిన మానసిక వికాసమనే మహోన్నత భవంతికి, భారతీయ ధర్మం ఆధారంగా ప్రయాణం ఆరంభించేందుకు ముందు ఒక విషయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఈ అంశం ఆధారంగానే భారతీయ ధర్మంపై, జీవనవిధానంపై అనేక విమర్శలు చెలరేగుతాయి. ఈ అంశం ఆధారంగానే భారతీయధర్మంపై అనేక అపోహలు నెలకొన్నాయి. ఈ అంశాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవటం వల్లనే ఒక రకంగా మనం కూడా మన ధర్మాన్ని చిన్న చూపు చూస్తున్నాం. చాలామంది భారతీయ ధర్మం మీదా, ఆచారవ్యవహారాల మీదా, అలవాట్ల మీద, చివరికి ఆహార నియమాల మీద కూడా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. పోనీ వారందరూ విదేశీయులా అంటే కానే కాదు. వారందరూ స్వచ్ఛమైన భారతావనిలో, అచ్చమైన హిందువులుగా పుట్టి అష్టవంకర్లు తిరిగిపోయే పాశ్చాత్య సంస్కృతే గొప్పదని మెచ్చుకునేవారు.

ఇక్కడ అందరూ గమనించవలసిందేమిటంటే ప్రతి దేశంలోనూ ఉన్న సంస్కృతి, కట్టుబాట్లు, ఆచారాలు అనేవి ఆయా దేశాల ఆర్థిక, సామాజిక, కాల, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటుచేసినవి. విదేశాలలో దేవుడిని స్మరిస్తూ వైన్ తాగుతారు, దేవుడి ముందు అదే నైవేద్యంగా పెడతారు. వారి శీతల వాతావరణానికి అదొక ఉపశమనం అవుతుంది. భారతీయ ఉష్ణమండల దేశానికి ఇక్కడి పూర్వులు ఏర్పరిచినవే సమంజసమైనవి. 


భారతీయ ధర్మానికి పట్టుగొమ్మ వంటిది ఆధ్యాత్మికభావన! 'ఆధ్యాత్మికం' అనగానే అన్నీ వదిలేసి ముక్కు మూసుకుని తపస్సు చేయడం కాదు. వైరాగ్యం అనగానే పసులన్నీ మానేసి, అన్నింటినీ త్యజించి ఓ మూల కూర్చోవటం కాదు. 'విజయం' సాధించటం అంటే మానసిక ప్రపంచంపై నియంత్రణ సాధించేందుకు బాహ్యప్రపంచాన్ని విస్మరించటం కాదు. అలా చేసేది ఆధ్యాత్మిక సాధనలో విఫలం అయ్యి విరక్తితో తిరిగేవారు. నిజమైన ఆధ్యాత్మిక సాధన చేసేవారు అన్నిరకాలుగా వారి కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేరుస్తారు.

భారతీయ ధర్మకర్తలు ప్రపంచస్వరూపాన్ని, మానవనైజాన్ని ఎంతో లోతుగా విశ్లేషించారు. నిజం చెప్పాలంటే, మానవ స్వభావాన్ని, విశ్వపకృతిని ఇంత సంపూర్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకొని, విశ్లేషించి, వివరించటం, ప్రపంచంలో ఏ ఇతర తత్త్వంలోనూ, ఏ మతంలోనూ కనబడదు. దీనికి ప్రధానకారణం మన ఋషులు అహాన్ని జయించినవారు, వ్యక్తిగత స్వార్థాన్ని విసర్జించినవారు, ఖ్యాతి కోసం ఆరాటపడినవారుగా తమ పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండాలని ఆశించినవారు కాదు. వారు కోరింది మానవాభ్యుదయం. వారు ఆశించింది మానవుడు సుఖశాంతులతో, ఉన్నతమైన ఆలోచనలతో, విశిష్టమైన వ్యక్తిత్వంతో జీవనం సాగించటం. ఇందుకోసం వారు మార్గాలు అన్వేషించారు. సూత్రాలు నిర్దేశించారు. 

అందుకే, వేదాలు ఏ ఒక్క వ్యక్తి కర్తృత్వానికీ లొంగవు. అవి అపౌరుషేయాలు. దాంతో ఏ మానవుడూ వేదజ్ఞానానికి 'క్రెడిట్' తీసుకునే అవకాశం లేదు. ఎందరో ఋషులు వేదవిజ్ఞానాన్ని క్రోడీకరించి అందించారు. కానీ వారంతా విజ్ఞానాన్ని దర్శించిన 'ద్రష్ట'లు తప్ప స్వయంగా సృష్టించి, ఆలోచించి అందించినామని 'గొప్ప'లు చెప్పుకోలేదు. అలాగే, 'వ్యాసుడు' ఒక వ్యక్తో, ఒక సామూహిక శక్తో తెలియక, ఈ నాటికీ వాదవివాదాలు చెలరేగుతున్నాయి. 'అంటే నేనింత పని చేశాను. అందరూ నన్ను గుర్తించి పొగడాలి' అన్న ఆలోచన మన పూర్వికులకు అసలే లేదు. కానీ వారు, సమాజాభ్యున్నతి కోసం తాము చేయవలసింది నిష్కామంగా చేశారు. ఇదీ భారతీయ ధర్మంలో ఆధ్యాత్మికం అసలు రూపు.

◆నిశ్శబ్ద.