సూర్యాయ విశ్వ చక్షుషే

 



సూర్యాయ విశ్వ   చక్షుషే

 

 

తైత్తరియోపనిషత్ సూర్యుని విశ్వ చక్షువు (ప్రపంచానికి కళ్ళవంటివాడు) అన్నది. నిజమేకదా! సూర్యుని ప్రకాశం లేనిదే, జగత్తు తమోమయం .  సూర్యోదయం లేనినాడు, ప్రపంచం అంధకార  బంధురం. అందుకే సూర్యుడే, జగతికి నేత్రములవంటివాడనటం,  యెంతో యుక్తి యుక్తం. అంతే కాదు. సూర్యుని ఒక గ్రహంగా కాక,  ప్రత్యక్ష దైవంగా కొలిచే సంప్రదాయం అనూచానంగా వస్తున్నది. సూర్య గమనంతో ముడివడివున్న్న ప్రధాన ఘట్టాలను, దేశా వ్యాప్తంగా, శుభపర్వాలుగా జరుపుకోవటం మన సంస్కృతిలో భగంగా అల్లుకుపోయింది. వాటిలో ప్రశస్తమైనది - రథ సప్తమి. 

 

     మాఘమాసం లో  శుద్ధ సప్తమి - రధసప్తమి పర్వదినం హిందువులకు అత్యంత పవిత్రమైన శుభదినం. కర్మసాక్షిగానూ,  సాక్షాత్తూ భగవంతునికి  ప్రతిరూపంగానూ సూర్యభగవానుణ్ణి కొలవటం మన ఆచారం. భవిష్య పురాణంలో, రధసప్తమి మహత్యాన్ని  సాక్షాత్తూ వాసుదేవుడే వివరించి చెప్పాడు.  దీనిలో బ్రాహ్మ పర్వము, మధ్య పర్వము, ప్రతిసర్గ పర్వము, ఉత్తర  పర్వము అని నాల్గు పర్వాలున్నాయి.  బ్రాహ్మపర్వములో   42వ అధ్యయం నుంచీ, 140వ అధ్యయం వరకూ సూర్యోపాసన  గురించి అనేకానేక   విశేషాలున్నాయి.  సూర్యనారాయణుని   నిత్యార్చన మొదలు సూర్య రధం, సూర్య గమనాదులు,  అతని గుణాలూ, వివిధ ఋతువుల్లో అతని వివిధ వర్ణనలు,ఆ రధ సారధి, అశ్వాలూ,  చత్రం, ధ్వజం, రధ సప్తమి వ్రత విధానం,  శతానీకుని సూర్య స్తుతి, సూర్య నారాయణ స్తోత్రం, ద్వాదశాదిత్యుల వివరాలు,  ఇలాంటి యెన్నొ వివరణలు ఇందులో వున్నాయి. భవిష్యోత్తర పురాణంలోనూ, సూర్యోపాసన  గురించిన అనేకానేక వివరాలున్నాయి.

 

 

          రధసప్తమికే సూర్య జయంతి, సౌర సప్తమి, భాస్కర సప్తమి, మాఘ సప్తమి, మన్వాది అనే పేర్లున్నాయి. కర్మసాక్షి , ప్రత్యక్ష భగవానుడు అయిన శ్రీ సూర్యనారాయణుని పుట్టిన రోజుగా దీనిని జరుపుకుంటాము. కశ్యపునికి, అదితికి జన్మించిన వాడు సూర్యుడు. ఈయనకు వివస్వంతుడు అనే నామాంతరము ఉంది. ఈ రోజు నుంచి వరుస అయిదు రోజులు సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి లను భీష్మ పంచకం అంటారు. భారత యుద్ధంలో అర్జునుని శరాఘాతానికి కుప్పకూలిన భీష్మ పితామహుడు అప్పటికి ఇంకా దక్షిణాయనం అవటం వలన ఉత్తరాయణ పుణ్యకాలం రావటం కోసం అంపశయ్య మీద ఎదురుచూసి ఈ అయిదు రోజులలో రోజుకొక్కటి చొప్పున పంచ ప్రాణాలు వదిలేసాడని పురాణ గాధ. అందుకే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలే ఆచారం కూడా ఉంది.

 

       రధ సప్తమి నాడు సూర్యోదయాన్నే ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నుంచుని తలపై ఏడు జిల్లేడు ఆకులు ( అర్క పత్రం) , ఏడు రేగు ఆకులు లేదా రేగి పళ్ళు ఉంచుకొని స్నానము చేస్తారు. ( సూర్యునికి అర్కః అన్న పేరు ఉన్నది. అందుకే అర్క పత్రము ప్రీతి అంటారు ) . స్నానము చేస్తూ " యత్యత్ జన్మ కురుమే పాపం మయా సప్తమ జన్మాసు, తన్మే రోగంచ, శోకంచ, మా కరేహంచు సప్తమీ..... " అని పఠిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఏడు జన్మల పాపాలను ( ఈ జన్మలో చేసినవి, జన్మాంతరంలోనివి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి, మానసికంగా చేసినవి, వాచికంగా చేసినవి, శారీరకంగా చేసినవి. ) ,  సూర్యుడు ఏడు రకాల రోగాలను తొలగిస్తాడని భావిస్తారు.  రధసప్తమి నాడు సూర్యుడు సప్తాశ్వములను పూన్చిన బంగారు రధం మీద రధసారధి అరుణుడు (ఇతనికే అనూరుడు అనగా ఊరువులు లేనివాడు అని కూడా పేరు ఉన్నది )   నడుపుతుండగా,
 దక్షి ణా యనం నుంచి ఉత్తారాయణానికి మరలి  (వుత్తర దిశ వైపు తన రధాన్ని మళ్ళిస్తాడని)  వెళ్తాడని  భావిస్తారు. సూర్యునికి ఎదురుగా ఆవు పేడ పిడకలతో దాలిలో ఇత్తడి గిన్నెలో ఆవు పాలను పొంగిస్తారు. ఆవు పాలను పొంగించుతారు. పొంగిన తరువాత బియ్యం, బెల్లం కలిపి పరమాన్నంగా చేస్తారు. చిక్కుడు ఆకులలో ప్రసాదంగా తీసుకొంటారు.

 

 

        రధసప్తమి అనేది సూర్యుని ఆరాధించే పండుగ. అనాదిగా మానవునికి ప్రకృతిశక్తులను ఆరాధించే ఆచారం ఉంది. ముఖ్యంగా, సూర్యుడు తూర్పున ఉదయించనిదే, జగత్తు మేలుకోదు. తిమిరాన్నితొలగించి, కాంతిమార్గంచూపే అగ్నిగోళంసూర్యుడు. తూర్పుకొండలనుంచీతొంగిచూసినప్పటినుంచీ,అతనికాంతిలో క్రమ  క్రమంగా మారే కాంతిని కూడా అతి జాగ్రత్తగా  గమనించి, జానపదులు కూడా, తమకు కనిపించే ఫల పుష్పాల వర్ణాలలో వర్ణించటం చూస్తే,  సూర్యునితో అనాదిగా మనిషికున్న అవినాభావ  సంబంధం అవగతమౌతుంది.   లోకంలోని ప్రతి ప్రాణిని మేలుకొలిపి ప్రాణాధారం అయిన కాంతిని ఇచ్చే సూర్యునికి  జానపదులానాడే పాడిన  మేలుకొలుపు ఇది.
        శ్రీ సూర్య నారాయణా! మేలుకో హరి సూర్యనారాయణా మేలుకో !
పొడుస్తూ బాలుడూ పొన్న పూవూ ఛాయ
పొన్నపూవూ మీద పొగడపూవూ ఛాయ...   శ్రీ సూర్య !!
          ఉదయిస్తు బాలుడూ వుల్లి  పూవూ ఛాయ
         వుల్లి పూవూ మీద ఉగ్రంపు పొడి ఛాయ !! శ్రీ సూర్య !!
 ఘడియెక్కి  బాలుడూ  కంబ పూవూ ఛాయ
కంబపూవూ మీదా కాకారి పూఛాయ  !! శ్రీ సూర్య !!
     ఝామెక్కి  భానుడూ  జాజి  పూవూ ఛాయ..
     జాజిపూవూమీద సంపంగి పూచాయ...!! శ్రీ సూర్య !!
 మధ్యాహ్న బాలుడూ మల్లెపూవూ ఛాయ
 మల్లెపూవూ మీదా మంకెన్న  పొడి ఛాయ !!.   శ్రీ సూర్య !!
        మూడు ఝాముల బాలుడూ ములగపువ్వు ఛాయ
       ములగపువ్వూ మీద ముత్యంపు పొడి ఛాయ !! శ్రీ సూర్య !!
 అస్తమాన బాలుడూ ఆవపూవూ ఛాయ
 ఆవపూవూ మీద అద్దంపు పొడి ఛాయ !! శ్రీ సూర్య !!
       వాలుతూ భానుడూ వంగపూవూ ఛాయ
       వంగపూవూ మీద వజ్రంపు పొడి ఛాయ   !! శ్రీ సూర్య !!
  గ్రుంకుచూ బాలుడూ గుమ్మడి పూవూ ఛాయ
  గుమ్మడి పూవూ మీద   కుంకంపు పొడి ఛాయ  !! శ్రీ సూర్య !!
       ఖగోళశాస్త్రం ప్రకారం చూస్తే సూర్యుని సంచారానికి కూడా సంబంధం ఉందని చెప్పవచ్చును. సూర్యుని రధానికి గుర్రాలు ఏడు. ఇవి ఇంద్రధనుస్సు లోని రంగులుగా, లేదా వారం లోని ఏడు రోజులుగా భావించవచ్చును. సూర్యుని రధచక్రాలకు గల ఆకులు పన్నెండు. వీటిని ఒక సంవత్సరం లోని పన్నెండు నెలలుగా లేదా పన్నెండు రాశులుగా భావించవచ్చును. సూర్యోదయానికి ముందు కన్పించే అరుణ వర్ణాన్నే సూర్యుని రధసారధి అరుణుడు అంటారు. ఇతనికే అనూరుడు (ఊరువులు లేనివాడు) అనే పేరు ఉంది .

 

     సూర్యుడు ఒక్కో రాశి లోనూ లేదా ఒక్కో నెలలోను ముప్పై డిగ్రీలు చొప్పున మూడు వందల అరవై డిగ్రీలు పూర్తి చేయడానికి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై అయిదు రోజులు పడుతుంది. అది భూమి సూర్యుని చుట్టూ ఒకసారి భ్రమణం చేయడానికి పట్టే సమయంగా గుర్తించవచ్చును. యీసమయం నుంచే  ఋతువులలో మార్పులు వస్తాయి. నెమ్మదిగా ఎండలు మొదలవుతాయి. అందుకే రైతులు మరల తమ పొలం పనులలో నిమగ్నమయేందుకు సిధ్ధమవుతారు.
     విజ్ఞానశాస్త్ర ప్రకారం చూస్తే సూర్యోదయ కాలంలో సూర్యుని ఎదురుగా నుంచుని స్నానం చేయడం వలన సౌరశక్తి లోని అతినీల లోహిత కిరణాలు మన శరీరంలో విటమిన్ "డి" సంశ్లేషితమవుతుంది. లేత సూర్యకిరణాలలో సూర్య నమస్కారాలు చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం అదే.

 

    జిల్లేడు, రేగు ఆకులకు సూర్యుని నుండి కాంతిని ఎక్కువగా గ్రహించే లక్షణం కలిగిఉంటాయి. వాటిని మన తలపై ఉంచుకొని స్నానం చెయటం వలన అవి గ్రహించిన సౌరశక్తి లోని కాస్మిక్ కిరణాలు మన శిరస్సు ద్వారా స్వీకరించే అవకాశం  వుంది.
     ఆవు పేడ పిడక లతో మంట మండించటం , ఆవు పాలతో పాలు పొంగించటం అనేది సూక్ష్మ క్రిమి రహితంగా చేయడానికి. ఆవుపేడలో, పాలలో సూక్ష్మజీవి నాశకాలు   వుంటాయన్నది శాస్త్రసమ్మతం. ఈ విధంగా ఆలోచిస్తే మన పూర్వీకులు ప్రవేశపెట్టిన చాలా ఆచారాలు, పూజా పునస్కారాల వెనుక శాస్త్రీయ దృక్పధం కనిపిస్తుంది. మామూలుగా చేయం కనుక దేముడు, పూజలు అని ఒక కారణాన్ని చూపించారేమో!. ఇంకా సూర్యునికి  సంబంధించిన యెన్నెన్నో ఆసక్తిదాయకమైన విశేషాలు మన పురాణాలలో అనేకం ఉన్నాయి.  అసలు ప్రతిరోజూ   సూర్యుని ముందు నిలబడి ఆదిత్య హృదయం చదవటం, సూర్య నమస్కారాలు చేయటం వల్ల, అనేక వ్యాధులు కూడా దూరమౌతాయని పురాణాలు చెబుతూనే వున్నాయి. కఫమూ, దగ్గూ, చర్మ రోగాల వంటివే కాక భయంకరమైన కుష్టు వ్యాధి కూడా మటుమయమౌతుందట! ఇలా రోగాలే కాక, శతృ బాధను  కూడా నివారిస్తాడా సూర్యనారాయణుడు.

 

        తమోఘ్నాయ  హిమఘ్నాయ శతృఘ్నాయామితాత్మనే
        కృతఘ్నఘ్నయ దేవాయ జ్యోతిషాం పతయే నమ : 
  అని కదా    వాల్మీకి రామాయణంలోని  ఆదిత్య హృదయం చెబుతున్నది! (అంధకారమూ, శీతమూ,  శత్రువులూ కృతఘ్నులూ -ఇటువంటి  వాటిని నాశనం చేసే ఓ విశాలాత్మన్! జ్యోతులన్నింటికీ  శాసకుడా!  నీకు నమస్కారము!)
       మన అనేక  పురాణాల్లో, సూర్యోపాసన విధానం గురించిన వివరాలెన్నో లభిస్తున్నాయి. భవిష్య పురాణంలో మాంధాత రాజు సూర్య వ్రతాన్ని గురించి తమ కులగురువు వశిష్టులవారిని  అడిగినప్పుడు, వారీ వివరాలు చేప్పారట! మాఘ మాస సూర్య (ఆది) వారం నాడు,  'వరుణాయ నమ :  '  అనుకుంటూ సూర్యారాధన చేయాలి. ఫాల్గుణ మాసం  లో 'సూర్యాయ  నమ : '  అనుకుంటూ సూర్యుణ్ణి పూజించాలట! చైత్ర  మాసం లో 'భానవే నమ : ,' వైశాఖ మాసం లో 'తపనాయ  నమ : ', జ్యేష్ట మాసం లో 'ఇంద్రాయ నమ : ', ఆషాఢ మాసం లో 'రవయే నమ : ', శ్రావణ మాసం లో 'గభష్తయే నమ : ', భాద్ర పద మాసం లో 'యమాయ నమ : ', అశ్వయుజ మాసం  లో 'హిరణ్య రేతసే నమ : ', కార్తిక మాసం లో 'దివాకరాయ నమ : ', మార్గ శిర మాసం లో 'మిత్రాయ నమ : ', పౌష్య మాసం లో 'విష్ణవే నమ : '  ..యీ విధంగా వివిధ మాసాలలో,  వివిధ నామాలూ, వివిధ నైవేద్యాలతో సూర్య వ్రతం చేసిన తరువాత,  వుద్యాపన కూడా చేయవలసి వుంటుంది.
         కృష్ణుని కుమారుడు  -  సాంబుడు కుష్టు రోగగ్రస్తుడైనపుడు,  సాక్షాత్తూ, వాసుదేవుడే  సూర్యోపసన చేయమన్నాడట! పైగా, సూర్య భగవానుడు అతనికి స్వప్న దర్శనమిచ్చి,  తన ఏకవిం శతి నామావళిని వినిపించి,  పారాయణం చేయమన్నాడట కూడా!               భాస్కరో  భగవాన్ సూర్య : , చిత్రభానుర్విభావసుహు,
              యమ : సహస్రాంశుమాలీ, యమునా ప్రీతిదాయక  : ,
              దివాకరో జగన్నాధ : ,   సప్తాశ్వస్య ప్రభాకర : ,
              లొక చక్షు : స్వయంభూస్చ చాయరతి ప్రదాయక : ,
              తిమిరారిర్దినధవో, లోకత్రయ ప్రకాశక : ,
             భక్త బంధు : దయాసింధు :  కర్మసాక్షీ పరాత్పర : ,
             ఏకవింశతి  నామాని, యహ్ పఠేదుదితే మయి,
              తస్య శాంతిం  ప్రయచ్చామి,   సత్యం సత్యం వదామ్యహం..  
                                          (కపిల సంహిత - ఆరవ అధ్యాయము)
సౌర పురాణం లో మను మహారాజు కృత సూర్య స్తుతి ఇది..
           నమో నమో వరేణ్యాయ, వరదాయాంశు మాలినే,
           జ్యోతిర్మయ నమస్తుభ్యం, అనంతాయాజితాయ తే,
           త్రిలోక చక్షుషే తుభ్యం, త్రిగుణాయామృతాయచ,
           నమో ధర్మాయ హంసాయ, జగజ్జనన హేతవే,
           నర నారీ శరీరాయ,   నమో మీడుష్టమాతయే
           ప్రజ్ఞానాఖిలేశాయ, సప్తాశ్వాయ త్రిమూర్తయే,
           నమో వ్యాహృతి రూపాయ,  త్రిలక్షాయాసుగామినే,
           హర్యశ్వాయ నమస్తుభ్యం, నమో హరిత బాహవే,
           ఏకలక్ష, విలక్షాయ, బహులక్షాయ దండినే,
           ఏక సంస్థ, ద్విసంస్థాయ, బహుసంస్థాయతే నమ :  ,
           శక్తిత్రయాయ శుక్లాయ, రవయే పరమేష్టినే,
            త్వం శివస్త్వం, హరిర్దేవ, త్వం బ్రహ్మాత్వం దివస్పతిహి,
            త్మమోంకారో, వషట్కార :,  స్వధా స్వాహా త్వమేవహి,
            త్వామృతే పరమాత్మానాం, నతత్పశ్యామి దైవతం....
       'అసంఖ్యాక కిరణములతో సంశోభితమయ్యే ఓ అంశుమాలిన్! వరములు ప్రదానం
  చేయటం లో, నువ్వే సర్వ సమర్థునివి. హే జ్యోతిస్వరూపా! నీ స్వరూపం అంతము లేనిది. నీ  నామములు అనంతములు.  త్రిలోక చక్షువు నీవే! త్రిగుణాత్మకమైన నీ రూపము, అమృతమయము.  జగత్సృష్టికర్తవు నీవే! ధర్మస్వరూపా! హంస అని కూడా పిలువబడే నీవు, సప్తాశ్వ యుతమైన రథముపై త్రిలోకాలలోనూ సంచరిస్తూ ఉంటావు! ఓ జ్ఞానభాండారమా! అఖిలేశునిగానూ, శివస్వరూపునిగానూ, సతత గతిశీలునిగానూ, వినతులందుకునే భగవన్! ఏకలక్ష, విలక్ష, బహులక్ష, ఏకసంస్థ, ద్విసంస్థ, బహుసంస్థాది నామాలన్నీ నీ పర్యాయ పదాలే! పరమేష్టి సం జ్ఞ తో సుశోభితుడవైన హే భగవన్! నీలో బ్రహ్మ,విష్ణు, మహేస్వరుల మూడు శక్తులూ నెలకొని వున్నాయి.  ఓం కార, వషట్కార, స్వాహా, స్వధా స్వరూపమైన నీవే పరమాత్మవు. సదా నిన్నే నేను శరణు వేడుతాను. '

 

             దక్షిణ భారత దేశంలో. పల్లవ రాజుల కాలంలో, మయూర మహాకవి విరచిత సూర్య శతకంలో, ప్రభా వర్ణనం (1-43) అశ్వ వర్ణనం (44-49) అనూరు వర్ణనం (50-61) రథ వర్ణనం (62-72) మండల వర్ణనం (73-80)రవి వర్ణనం (81-100)అన్న విభాగాలున్నాయి.ఇందులోని వర్ణనలు, అత్యంత సుందరాలు. కల్పనాచమత్కృతి అమోఘం. అర్థవంతం కూడా! ఆ చిత్రభానుని కిరణాలను వివిధ రీతుల వర్ణిస్తూ  ' అవి కిరణాలు కావు.  ఆ   పద్మ బాంధవుని పవిత్ర పాదాలు. ఆ కిరణలు శుభములకు ఆవిష్కరణలు. ప్రకృతికి  అలంకారాలు. చాలా శక్తిమంతాలు. భక్తి భరితాలు.  వీటి స్వభావం చాలా చిత్రంగా వుంటుంది. ఇవి అతి సుకుమారమైనవి.  అతి కఠినమైనవీ కూడా! పద్మాల హృదయాలలో చేరి ఆనందం అందించి చక్కిలిగిలి పెడతాయి. పర్వత పాషాణ చిత్రాలలో ప్రవేశించి, చైతన్యాన్ని అందిస్తాయి.' ఇలా మొదలై పోను పోనూ అభివ్యక్తిలో చిక్కదనం ఇనుమడిస్తూ ఇనుమడిస్తూ, సూర్యునికీ శ్రీమన్నారాయాణునికీ అభేదం సూచించేంతవరకూ వెళ్ళటం-నిజంగా అద్భుతం.   సూర్యుడెలా వున్నాడు? ప్రకృతికి బంగారు భూషణం వలె, పద్మరాగ మణి వలె, ఆకాశమనే నీలి కలువపై పసుపు వన్నె పుప్పొడివలె, కాల పన్నగ శిరముపై - మహారత్నము వలె, విశ్వసుందరి కంఠాన మెరుస్తున్న శుభకర మంగళసూత్రము వలె కాంతులు ప్రతిఫలింపగా, మంగళకరముగా సూర్యమండలం కనిపిస్తున్నదనటం - మయూరకవి అపూర్వ కల్పనాచాతురికి పరాకాష్ట! ఇంతేనా? 'ఆదిత్య దీప్తి అఖిల ప్రపంచానికి రక్షణ కవచం. రవిమండలం- మహాయోగీశ్వరులకు  ముక్తి మార్గం చూపించే అఖండ దీప్తి. కడుపులో పెనుమంటలు పెట్టుకుని, లోకం కోసం ప్రాణికోటికి చాలినంత వరకే కాంతిని వారి వుపయోగం కోసం ప్రసారం చేసె ఆదిత్యుని యేమని కీర్తించగలం? మహాత్ముల మనస్సులే అంతగదా! అంటాడు.

 

ఆయన నడకలో చంచలుడైనా, లోకోపకారిగా అచంచలుడే! భూమికి వర్షమూ, హర్షమూ ప్రసాదించే ఆయన గ్రహపతి. సూర్య రధ సారధి అనూరుడూ, శ్రీమన్నారాయణుడి  రధ సారధి  గరుడుడూ- ఇద్దరూ వినతా సూనులే! పైగా అనూరుడు గరుడుడికి అగ్రజుడు కూడా! శ్రీమన్నారాయణునివలెనే   సూర్యుడూ తన రధారూఢుడై, నిరంతరమూ లోకాలలో సంచరిస్తూ, వెలుగును ప్రసాదిస్తూ  వుంటాడు.   ఒక ద్వీపంలో ఆయన వెలుగు మండుటెండవుతుంది. అదే వెలుగు మరో ద్వీపంలో, పండెవెన్నెల కాస్తుంది. అన్ని వెలుగులూ ఆయనవే! దేశకాలాలకు ఆయన అధిపతి. ఆయన ఒక్కడే అన్ని దేశాలకూ, ద్వీపాలకూ అన్నిలోకాలకూ అధిపతి !!! ' అంటూ సూర్య సార్వ భౌమత్వాన్ని ప్రతిపాదించిన మయూరుడు, ఫల శృతిలో, యీ తన శతకాన్ని భక్తి శ్రద్ధలతో పాఠం చేసిన వారు సర్వ పాపాలనుంచీ  విముక్తులవటమే కాక, వారికి ఆరోగ్యం, సత్కవిత్వం, అతులనీయమైన బలం, విద్య, ఐశ్వర్యం, సంపదలూ- అన్నీ సూర్య ప్రసాదాలుగా లభిస్తాయని ఘంటాపథంగా చెబుతున్నాడు. అంత విశ్వాసమున్నదన్నమాట తన రచనమీద మయూరునికి!  


      సూర్యారాధన, ప్రపంచవ్యాప్తంగా, విభిన్న నామాలతో అనాది కాలం నుంచీ  జరుగుతూనే వుందన్నది అక్షర సత్యం. సూర్య ఆత్మా జగత్ స్తస్థు షస్చ  ...ఋగ్ వేదం సూర్యుణ్ణె  జగదాత్మ అంటున్నది.  పూషన్, భగ్, మిత్ర, అర్యమన్, విస్వత్..ఇవన్నీ ఆ భాస్కరుని  నామాలే! రామాయణ, మహాభారతాల్లో, సూర్య సంబంధమైన వివరణలనేకం  ఉన్నాయి. సూర్యొపాసన గురించిన అనేక ప్రమాణాలూ పురాణల్లో చాలా దొరుకుతాయి.  విస్ణు పురాణం సూర్యుని రథ విస్తారమే, నూరు వేల యోజనాలంటున్నది.    దీనికి రెండింతలు దీనీ  ఈషా దండము. దీని ఇరుసు (ధుర) ఒకటిన్నర కోటీ, యేడు లక్షల యోజనాల పొడుగట!  దీనికే యీ రథ చక్రమున్నది. ఆ అక్షయ రూపమైన సంవత్సరాత్మక చక్రములో సంపూర్ణ కాలచక్రమున్నది.  గాయత్రి,  బృహతి,  వుష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అన్న యేడూ సూర్య రధాశ్వాలు. మత్స్య, భవిష్య, విష్ణుధర్మోత్తర, అగ్నిపురాణదులలో సూర్య మూర్తికి సంబంధించిన అనేక విశేషాలు లభ్యాలు. భారతీయ  శిల్ప కళల్లో, సూర్యుని రూపాలు ప్రాచీన కాలం నుంచే కనిపిస్తున్నాయి.

 

భారతదేశంలో లభ్యమైన ప్రాచీన సూర్య ప్రతిమలలో, కొన్ని రధారూఢునిగా, కొన్ని నిలుచుని ఉన్న భంగిమలోనూ వున్నాయి.  రధారూఢుడైన సూర్య ప్రతిమలలో, ఒకే చక్రమున్న రధం పై, ఒకటినుండీ యేడు అశ్వాలు నడుపుతున్న  విధానం కనిపిస్తుంది. విచిత్రంగా కొన్ని వుత్తరభారత ప్రతిమలు, చక్కటి పాదరక్షలూ, పైజామా, పెద్ద చొక్కా, కిరీటంతో కనిపిస్తుండగా, కొన్నింటిలో, భుజలక్రింద, రెండు రెక్కలూ ఉండటం గమనార్హం. ప్రాచీన దక్షిణభారత సూర్యుడు , కమలాలవంటి పాదాలూ,  ధోతీ,  ఆచ్చాదనలేని  విశాలమైన వక్షస్థలంతో  దర్శనమిస్తున్నాడు.  క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో  శుంగ కాలంలో నిర్మితమై,   ఒక స్థంభం పైన,  నాలుగు అశ్వాలు పూన్చిన రధంపై ఆరూఢుడైన సూర్యుని  విగ్రహం బుద్ధగయలోని పురాతత్వ సంగ్రహాలయంలో వుంది. ఒరిస్సలోని ఖందగిరి లోని అనంత గుహలో లభించిన సూర్య ప్రతిమ కూడా, ఇలాగే  నాలుగు గుర్రాలు పూంచిన రధంపైనున్న మూర్తిదే! కుషాణ కాలం (క్రీ.శక్.2,3 శతాబ్దాలు) నాటి చాలా సూర్య ప్రతిమలు,  మథుర ప్రాంతాలలో  లభించాయి. ఇవి, ఒక విధమైన యెర్రటి రాయి తో తయారైనవి.  నాలుగు గుర్రాలు లాగుతున్న  ఒకే చక్రమున్న రధంపై  ఆసీనుడైన సూర్య ప్రతిమలూ కొన్ని వీటిలో వున్నాయి. క్రీ . శ. 325 నుండి, ఆరవ శతాబ్దం మధ్య కాలంలో యెన్నో దేవాలయాల నిర్మాణమూ జరిగింది. ఈ కాలం నాటి విశిష్ట ప్రతిమొకటి ఆఫ్ఘనిస్తాన్ లోని ఖైర్ ఖనేహ్ లో దొరికింది. ఈ పాలరాతి ప్రతిమ, అరుణుడు  నడుపుతున్న , నాలుగు అశ్వాలు  పూన్చిన  రధం పైనున్న భాస్కరునిది. వుత్తర గుప్త యుగానికి చెందిన మరో సూర్య మూర్తి కి ఇరువైపులా దండ,పింగళులున్నారు. ఇదీనాడు లండన్ లోని సంగ్రహాలయంలో వుంది. పూర్వ మధ్య యుగంలో కాశ్మీర దేశంలో సూర్యోపాసన చాలా ప్రచారంలో  వుండేది. లలితాదిత్యుడనే రాజు చాలా  పెద్ద సూర్య దేవాలయాన్ని కట్టించాడు అప్పట్లో, అది ఇప్పుడు శిధిలావస్థలో ఉంది.

 

   మధ్య యుగం నాటి వుత్తర భారత దేశం, సూర్యారాధనకు పెద్ద పీట వేసింది. ప్రతిహార వంశానికి చెందిన చాలామంది శాసకులు, సూర్య భక్తులే! యెన్నో దేవాలయాలను  వాళ్ళు కట్టించారు. రాజస్థాన్ లోని ఓషియా అన్న చోట,  పదవ శతాబ్దానికి చెందిన ఒక సూర్య దేవాలయం ఉంది,  కానీ,  అందులో సూర్య ప్రతిమ లేదు. ఇదే కాలంలో, మట్టితో చేసిన యెన్నో సూర్య ప్రతిమలూ దొరికాయి.  ప్రతిహార వంశం తరువాత,  రాజస్తాన్  లో చౌహాన్ వంశం అధికారం లోకి రాగా, అటు వుత్తర ప్రదేశం లో, గాహడ్ వంశస్తులు, పరిపాలన  చేశారు. వీరి కాలం నాటీఇ సూర్య ప్రతిమలు, అజ్మేర్ ఢిల్లీ సంగ్రహాలయాలలో వున్నాయి. గుజరాత్ లో, చాళుక్య వంశ  కాలంలో, మోఢేరా అన్న చోట, నిర్మితమైన సూర్య దేవాలయం ఇప్పుడు, శిధిలావస్థలో వుంది. బడౌదా కు సమీపంలొని కాయంద్రా అన్నచోట, సూర్యమందిరం తాలూకు తోరణ  ద్వారం, తొమ్మిది-పది శతాబ్దాల నాటిదట!
        మధ్య ప్రదేశ్  లో చందోల్ శాసకుల నాటీ  సమయంలో, ఖజురహోలో సూర్య మందిర నిర్మాణం జరిగింది. ఇక్కడున్న ఇతర దేవాలయాల పైనా, ఆసీన ముద్రలో సూర్య ప్రతిమలు కాన వస్తాయి. మధ్య ప్రదేశ్ లోనే భేటా ఘాట్ అన్న ప్రదేశం లో  గౌరీ శంకర ప్రతిమలతో పాటూ, 11,12 శతాబ్దాలకు చెందిన రధారూఢుడైన సూర్యుని ప్రతిమ వుంది. ఈశాన్య భారతంలో పాల్ శాసకులు  బౌద్ధ మతానుయాయులైనా,  ఆనాటి సూర్య ప్రతిమలెన్నో   పాట్నా, కోల్కత్తా, గవుహతి సంగ్రహాలయాల్లొ భద్రపరుపబడ్డాయి.  అదే కాలం నాటి మరికొన్ని సూర్య ప్రతిమలు, లండన్, ఫిలడెల్ఫియా, శాన్ ఫ్రాన్సిస్కో శిల్ప సంగ్రహాలయాలలో వున్నాయి. 

     బెంగాల్ లో పాల్ శాసకుల తరువాత, సేన్ శాసకులు వచ్చారు. ఆనాటి చక్కటి సూర్య ప్రతిమలు ఈనాడు, డిల్లీ సంగ్రహాల యంలో వున్నాయి.  ఒరిస్సలో మధ్య యుగంలో గంగ శాసకుల పరిపాలన  కూడా, సూర్యోపాసనను ప్రోత్సహించింది.  నరసింహ వర్మ అన్న రాజు పదమూడవ సతాబ్దిలో, కుష్టు రోగం నుంచీ విముక్తి కై, సూర్య దేవాలయాన్ని నిర్మించాడంటారు.  మన భారత దేశంలో సూర్యునికి గల దేవాలయాలలో ప్రముఖమయినది ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం. గుజరాత్ నందున్న మోదెరాలో కూడా ఒక సూర్య దేవాలయం ఉంది.  ఇక దక్షిణ భారత దేశంలో. పల్లవ రాజుల కాలంలో,  మయూరుడు సూర్య శతకాన్నే వ్రాశాడు.  (ఈ వివరాలు ముందు ప్రస్తావించటం జరిగింది.) అనేక దేవాలయాల నిర్మాణమూ జరిగింది. చోళ రాజుల కాలంలోనూ, సూర్యుని చాలా పాషాణ, దారు శిల్పాలు దొరికాయి. ఇక కర్ణాటక లో మధ్య యుగం నాటి  బేలూరు,  హళేబీడు  మందిరాలలో, అనేక సూర్య ప్రతిమలు లభ్యాలు. హోయసల రాజుల  కాలం నాటి సూర్య ప్రతిమలలో, దక్షిణ భారత శిల్ప కళా వైభవం సుస్పష్టం.  మన రాష్ట్రంలో శ్రీకాకుళం లోని అరసవిల్లి సూర్యదేవాలయం కూడా ప్రసిద్ధి  చెందినదే!  పెద్దాపురం వద్ద ఉన్న పాండవుల మెట్ట మీద ఉన్న సూర్యదేవాలయం  ప్రముఖమయినది . పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడ లో కూడా సూర్యదేవాలయం ఉంది.

 

       కేవలం భారత దేశం లోనే కాదు.  గ్రీక్ దేశం  లోనూ, మన సూర్యోపాసనను పోలిన భావధార కనిపిస్తుంది. అక్కడి అపోలో,  డయానా  కథల్లో కూడా, మన వుషాదేవి సూర్యుని చుట్టూ తిరుగుతున్న కథలవలెనే చాలా పోలికలు కనిపిస్తాయి. రెండు దేశాల వివాహ పద్ధతులలోనూ, సూర్య మంత్రాలను వుచ్చరించటం చూస్తే యీ వాస్తవం అవగతమౌతుంది. మెక్సికో దేశంలొనూ,   విశ్వ సృజనకు మూలం సూర్యుడనే నమ్ముతారు.  చైనా యాత్రికుడు హుయాన్సాంగ్, అరబ్ రచయిత అల్ ఇద్రిసీ, అబూఇషాక్, అల్ ఇస్తర్బీ వంటి వారి రచనల్లోనూ,  భారతదేశంలో ఆయా కాలాలలో, వారు చూచిన సూర్య దేవాలయల ప్రస్తావన వుండటం చూస్తే, భారతదేశనికీ, సూర్యోపాసనకూ వున్న అనుబంధం అతి ప్రాచీనమైనదేకాక,  అతి పవితమైనదనికూడా అవగతమౌతున్నది.
    అందుకే సూర్యునికున్న పేర్లలో  ఒకటైన, 'మిత్రుడు'  అన్న పదం, యుగ యుగాలనుంచీ భూమండలంతో సూర్యునికున్న మైత్రీబంధానికి ప్రతీకగా, అర్థవంతమైనదిగా, సార్థకతతో కూడినదిగానూ  కూడా  అభివర్ణించవచ్చును.


...డా. శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని