రామసేతు నిజమేనేమో!

 

రామసేతు నిజమేనేమో!

 

 

భక్తులు దృష్టిలో రాముడు దేవుడు. చాలామంది చరిత్రకారుల దృష్టిలో ఆయన ఒక రాజు. అందుకే రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు, సంఘటనల్లో కొంతవరకు వాస్తవం ఉందని మన నమ్మకం. వాటిలో ఒకటి రామసేతుబంధనం. రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం గురించి కనిపిస్తుంది. నలుడనే వానరుని నేతృత్వంగా కోటిమంది వానరులు అయిదే అయిదు రోజుల్లో లంకకు వారధిని నిర్మించారని రామాయణంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వారధి రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి నుంచి శ్రీలంక దగ్గర ఉన్న మన్నార్‌ తీరం వరకూ నిర్మించినట్లు తెలుస్తోంది. అందుకనే చరిత్రలో రామేశ్వరాన్ని ‘సేతుబంధ రామేశ్వరం’ అని పిలిచేవారు. రామాయణం గడిచిపోయినా కూడా, శతాబ్దాల తరబడి, ఈ వారధి నడవడానికి అనువుగానే ఉండేది. 10వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన అరబ్‌ యాత్రికులు సైతం ఇక్కడ ఒక వారధి ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. 1480లో ఒక పెను తుఫాను రావడంతో ఈ వంతెన ధ్వంసమైంది. ఆ తరువాత రామసేతు గురించి చరిత్రకారులు మర్చిపోయారు.

 

 

2002లో నాసా అంతరిక్షం నుంచి తీసిన ఒక చిత్రంలో రామసేతు స్పష్టంగా కనిపించడంతో ఈ వంతెన గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఈ వారధి గురించి శాస్త్రీయ కారణాలను వెతికే ప్రయత్నం చేశారు. రామసేతు దగ్గర కనిపంచే రాళ్లు లావాతో ఏర్పడే ప్యూమిస్‌ రాళ్లని, అందుకే అవి నీటిలో తేలుతున్నాయనీ వాదించారు. కానీ ప్యూమిస్‌ రాళ్లు కొద్దిసేపు మాత్రమే నీటిలో తేలతాయనీ... ఇవి రాముని మహిమతోనే వేల ఏళ్లు నీటిపై తేలుతున్నాయన్నది భక్తుల వాదన. పైగా ఈ రాళ్లను కార్బన్ డేటింగ్‌తో పరీక్షించినప్పుడు అవి రామాయణ కాలానివే అని తేలింది. దాంతో నాసా కూడా ఈ వివాదంతో తనకేమీ సంబంధం లేదంటూ తప్పుకొంది.

 

 

శ్రీలంక ప్రభుత్వం కూడా ఇది రాముడు నిర్మించిన వారధే అని ప్రచారం చేస్తోంది. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ వారధి ఇప్పటికీ చాలావరకు సముద్రం మీద తేలుతూ కనిపిస్తుంటుంది. అది రాముని స్పర్శ సోకిన నిర్మాణమే అన్న నమ్మకాన్ని కలిగిస్తుంటుంది. అందుకనే గత ప్రభుత్వం ఈ వారధని తవ్వి శ్రీలంకకు దారి నిర్మించే ప్రయత్నం చేసినప్పుడు.... ఆస్తికులంతా ఏకమై ఆ ప్రయత్నాన్ని అడ్డుకొన్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీలంకలోని కొందరు ఈ వారధి రావణాసురుడు నిర్మించినదని నమ్ముతారు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు భారతదేశంలోకి ప్రవేశించేలా ఈ వారధిని నిర్మించాడట. రావణాసురుడు కోరుకున్నప్పుడల్లా ఈ వారధి పైకి తేలుతుందనీ, అవసరం లేనప్పుడు అది నీటి అడుగున ఉండిపోతుందనీ వారు నమ్ముతారు.


నిజం ఆ రాముడికే ఎరుక!

 

- నిర్జర