చండీ యాగం ఎందుకు చేస్తారు..
చండీ యాగం ఎందుకు చేస్తారు?
యాగం అంటే అదో పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయప్రయాసలకి ఓర్చయినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీయాగం!
ఎవరీ చండి?
చండి అంటే ‘తీవ్రమైన’ అన్న అర్థం వస్తుంది. అందుకనే సానుకూలమైన, ప్రతికూలమైన మాటలు రెండింటికీ ఈ పదాన్ని వాడతారు. చండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది.
పూజలు
చండీదేవినీ, ఆమె తేజోరూపమైన చాముండీదేవినీ కొలిచేందుకు దేశంలో చాలా ఆలయాలే ఉన్నాయి. హరిద్వార్లో ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లుగా చెబుతున్న ఆలయం దగ్గర నుంచీ, మైసూరు పాలకులు నిర్మించిన ఆలయం వరకూ ఈ తల్లిని కొలుచుకునేందుకు ప్రత్యేకమైన క్షేత్రాలు ఉన్నాయి. ఆంతేకాదు! గ్రామదేవతగా, కులదేవతగా కూడా చండీదేవికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇక సప్తమాతృకలలో ఒకరుగా, 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా... తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం.
చండీయాగం
మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే ఏడువందల శ్లోకాల స్తుతిని దుర్గాసప్తశతి అంటారు. దీనికే చండీసప్తశతి అని కూడా పేరు. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గాసప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. యాగంలో ఎన్నిసార్లు దుర్గాసప్తశతిని వల్లెవేస్తూ, అందులోని నామాలతో హోమం చేస్తారో... దానిని బట్టి శత చండీయాగం, సహస్ర చండీయాగం, ఆయుత (పదివేలు) చండీయాగం అని పిలుస్తారు.
విశేషఫలం
పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలనీ, ఆపదలు తొలగిపోవాలనీ, శత్రువులపై విజయం సాధించాలనీ.... చండీయాగం చేసేవారు. రాచరికాలు పోయినా, చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు.
- నిర్జర.