పెళ్లిలో జీలకర్ర బెల్లం ఎందుకు...
పెళ్లిలో జీలకర్ర బెల్లం ఎందుకు?
ఇప్పుడంటే పెళ్లి చూపుల అయిపోగానే అమ్మాయి, అబ్బాయి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు. ఇలాంటి తొందర ఒకోసారి బెడిసికొడుతుందని తెలిసినా, కాలాన్ని బట్టి ఊరుకోక తప్పడం లేదు. కానీ ఒకప్పుడు పెళ్లి చూపులు ముగిసిన తరువాత పెళ్లిరోజు వరకూ కూడా అమ్మాయి, అబ్బాయి కలుసుకోకుండా చూసేవారు. ఇక పెళ్లికూతురుని చేసిన తరువాత, పీటల మీద కూర్చునేదాకా ఆమెని చూడకూడదంటారు.
వివాహ సమయంలో పెళ్లికూతురు, పెళ్లికూతుర్ల మధ్య ఒక తెరని ఉంచుతారు. వధూవరులు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర, బెల్లం ఉంచిన తరువాతే వారి మధ్య ఉన్న తెరని తొలగిస్తారు. అప్పుడు కూడా ఒకరి భృకుటిని మరొకరు చూడాలని చెబుతారు. వధూవరుల స్పర్శ, చూపు... రెండూ కూడా శుభ్రప్రదంగా ఉండేందుకే ఈ నియమం పెట్టినట్లు తోస్తుంది.
జీలకర్ర, బెల్లం రెండింటికీ వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. బెల్లం ఎలాంటి అవశేషమూ మిగల్చకుండా కరిగిపోతుంది. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పూ లేకుండానే, తనని అంటిపెట్టుకుని ఉన్న పదార్థానికి సద్గుణాలను అందిస్తుంది. వివాహబంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే, ఎవరి అస్తితత్వాన్ని వారు నిలుపుకోవాలనీ... తనలోని సద్గుణాలని ఎదుటివారికి అందించాలనీ ఈ రెండు పదార్థాల కలయికా మనకి చెబుతుంది.
జీలకర్ర, బెల్లం కలయికలో మరో అర్థం కూడా తోస్తుంది. ఈ రెండూ పూర్తి భిన్నమైన పదార్థాలు. కానీ రెండింటినీ కలిపి పుచ్చుకుంటే ఎన్నోరకాల సమస్యలు తీరిపోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. ఒంటికి చలవచేయడం దగ్గర్నుంచీ, రక్తహీనతని తగ్గించడం వరకూ జీలకర్ర, బెల్లం చాలా సమస్యలని పరిష్కరిస్తాయి. భార్యా, భర్తా కూడా వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగినవారైనప్పటికీ... ఎటువంటి సమస్యనైనా కలిసి ఎదుర్కోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది.
జీలకర్ర, బెల్లం రెండింటి కలయిక వల్ల శక్తి ఉద్భవిస్తుందనీ కొందరు నమ్ముతారు. వధూవరులు ఇద్దరూ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర, బెల్లం పెట్టి ఉంచడంతో, వారిద్దరూ మధ్యా ఒక విద్యుత్ వలయం ఏర్పడుతుందని చెబుతారు. జీలకర్ర, బెల్లాన్ని పెట్టి ఉంచగానే ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూసుకోవాలని చెబుతూ తెరని తొలగిస్తారు. ఇలా ఒకరినొకరు చూసుకునే ఘట్టాన్ని సమీక్షణం అంటారు.
జీలకర్ర, బెల్లం పెట్టే చోటే సహస్రార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇక భృకుటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. అంటే ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలనీ మేల్కొలిపే ప్రయత్నం జరుగుతుందన్న మాట! ఇలా ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిల్చిపోతుందట.
జీలకర్ర, బెల్లం పెట్టే ఆచారం తెలుగు పెళ్లిళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మన దగ్గర పెళ్లి ముహూర్తం అంటే జీలకర్ర, బెల్లం పెట్టే సమయమే! అందుకే ‘’ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః/ ధ్రువంత ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతాం ధ్రువమ్" వంటి మంగళప్రదమైన మంత్రాలను ఈ సందర్భంలో చదువుతారు.
జీలకర్రకి ముసలితనం రాకుండా చేసే ప్రభావం ఉందంటారు. ఇక బెల్లమేమో అమృతంతో సమానం అన్న అర్థం ఉంది. ఈ రెండూ కలిస్తే ఇంకేముంది! కలకాలం నిత్యయవ్వనంతో ఉండమని పూర్వీకుల దీవెనగా భావించవచ్చు.
- నిర్జర.