రామబాణాన్ని నిర్వీర్యం చేసిన ఆంజనేయుడు

 

 

రామబాణాన్ని నిర్వీర్యం చేసిన ఆంజనేయుడు

రామ-రావణ యుద్ధం ముగిసి రామునికి పట్టాభిషేకం అయిన తరువాత రాముడు సభామందిరంలో కొలువుదీరి ఉన్న సమయంలో రాజమహర్షి విశ్వామిత్రుడు సభలోకి ప్రవేశించడం చూసిన వారందరూ లేచి నిలబడి ఋషికి నమస్కరించారు. అందరూ లేచి నిలబడి నమస్కరించినా ఆంజనేయుడు మాత్రం రామనామ భక్తీపారవశ్యంలో మునిగిపోయాడు. అది గమనించిన విశ్వామిత్రుడు ఇది అతడి అవిధేయతగా భావించిన అతని నిర్లక్ష్యానికి తగిన దండన విధించమని రాముని ఆజ్ఞాపించాడు. విశ్వామిత్రుని ఆజ్ఞను ధిక్కరించలేక శ్రీరాముడు ముని మాటను పాటించడానికి సమాయత్తమయ్యాడు. అయితే... అసమాన పరాక్రముడు రాముడు ఎన్ని బాణాలు వేసినా మారుతిని ఏమీ చెయ్యలేక వెనుతిరిగిపోయాయి బాణాలన్నీ. చివరకు బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి సిద్ధపడ్డ రాముడ్ని చూస్తూన్న నారదుడు, రాముడ్ని ఆపి బ్రహ్మాస్తం చేత శిక్షించేంత తప్పు ఏదీ ఆంజనేయుడు చేయలేదని, కేవలం రామనామ జపంలో లీనమై ఉండడం చేత మహర్షి రాకను గమనించలేదు తప్ప, అది అతడి నిర్లక్ష్యమో... అవిధేయతో కాదని, రామబాణాలు హనుమంతుడ్ని ఏమీ చెయ్యలేక వెనుతిరగడానికి కారణం కూడా రామస్మరణేనని విశ్వామిత్రునకి నచ్చచెప్పాడు. దాంతో విశ్వామిత్రుడు శాంతించాడు. రామనామం జపిస్తూ వుంటే ఆ నామం మనకు 'రక్షణ కవచం'లా ఉంటుందనే విషయాన్ని ఆంజనేయుడు లోకానికి చాటాడు.