అయోధ్యాపురిలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే.!
యూపీలోని అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కోసం విగ్రహం ఎంపిక ఖరారైంది. దేశంలోని ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. మొత్తం మూడు విగ్రహాల నుంచి ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఎక్స్ హ్యాండిల్‌పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమాచారాన్ని అందించారు. రాముడు ఎక్కడ ఉంటాడో హనుమంతుడు ఉంటాడని ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. మన దేశపు ప్రఖ్యాత శిల్పి, మన గర్వించదగిన శ్రీ అరుణ్ యోగిరాజ్ చేత తయారు చేయబడిన శ్రీరాముని విగ్రహం అయోధ్యలో ప్రతిష్టించబడుతుంది. రాముడు, హనుమంతుని మధ్య అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ.
అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్ లోని గండీక నదితోపాటు కర్నాటక, రాజస్థాన్, ఒరిస్సా నుంచి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించిన సంగతి తెలిసిందే. ఈ రాళ్లన్నింటిని పరీక్షించి కేవలం రాజస్థాన్, కర్నాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనుకూలమని గుర్తించారు. కర్నాటకలో లభించిన శ్యామశిల, రాజస్థాన్ లోని మక్రానాకు చెందిన మార్బులో రాక్ లను సెలక్ట్ చేశారు. మక్రానా రాయి ఎంతో విశిష్టమైంది. అలాగే కర్నాటకలోని శ్యామశిల, శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. ఈ రాళ్లు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. సుదీర్ఘ జీవితకాలాన్ని కూడా కలిగి ఉంటాయి.
ఇక ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పికుమారుడు అరుణ్ యోగిరాజ్ ఎంబిఏ పూర్తి చేశారు. యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. అరుణ్ యోగిరాజ్ 2008లో ఉద్యోగం మానేసి, శిల్పకారునిగా మారారు. అరుణ్ యోగిరాజ్..మహారాజా జయచామరాజేంద్ర వడయార్ తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేసారు. కేదార్ నాథ్ లో స్థాపించిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని వీళ్లే రూపొందించారు. అలాగే మైసూరులో మహారాజా శ్రీక్రుష్ణరాజ వడయార్, స్వామి రామక్రుష్ణ పరమహంస పాలరాతి విగ్రహం తీర్చిదిద్దారు. ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినదే కావడం విశేషం.