రక్షించే గణపతికి లక్ష నమస్కారాలు (Prayer of Ganapati)
రక్షించే గణపతికి లక్ష నమస్కారాలు
(Prayer of Ganapati)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే!!
ఏ పని మొదలుపెట్టాలన్నా మొదట పై శ్లోకంతో గణపతిని ప్రార్దిస్తాం. వినాయకుని స్తుతించే ఈ శ్లోకం నోటికి రానివారు దాదాపుగా ఉండరు.
విష్ణుమూర్తిని పీతాంబరధరుడని చెప్పినట్లు గణపతిని శుక్లాంబరధరుడిగా చెప్పుకుంటాము. నీలమేఘశరీరుడు విష్ణువైతే గణపతి శ్వేతవర్ణుడు. అంతేకాదు, ఉపనిషత్తులు గణపతిని ‘త్వం వాజ్మయ త్వం విన్మయః’ అంటూ వాజ్మయ స్వరూపునిగా వర్ణించాయి.
గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాము పమశ్రవస్తమమ్
జ్యేష్టరాజం బ్రహ్మణాం
బ్రాహ్మణస్పత ఆనం
శృణ్వన్నూతిభి స్సీద సాధనమ్
మహాగణాధిపతయే నమః
ఈ శ్లోకానికి ''ఓ గణపతీ! నువ్వు దేవగణములకు అధిపతివి కనుక నిన్ను స్తుతించి, ఆహానిస్తున్నాము. నీవు కవులలో కవివి. సాటిలేని కీర్తి గడించిన వాడివి. అందరికంటే చాలా ముఖ్యమైనవాడివి. వేదములకు అధిపతివి. మా ఈ ప్రార్ధనలను ఆలకించి మమ్ము వెంటనే రక్షింతువు గాక. గణాధిపతివగు నీకు నమస్కారము...'' అని అర్ధం.
గణానాం పతి: గణపతి:
గణములకు అనగా సమూహములకు అధిపతి గణపతి.
సమూహమంటే ఏది? సమ్యగూహ్యతే ఏకత్రేతి – సహుహః ఒక దిక్కున అనేకమంది కూడి ఉంటే, డాన్ని సమూహం అంటారు. సమూహాన్ని ‘నివహ’మని కూడా అంటారు. తన సంబంధమైన వాటికి ఏకత్వాన్ని కలిగించేది – నివహము. కనుక ఇక్కడ సమూహములను (తన సంబంధమైన వారిని, దేవాదులను) పాలించు పరమాత్మ ‘గమపతి’, అనగా సర్వవిధ గుణములకు సదా స్ఫూర్తుల నొసగే పరమాత్మయే గణపతి.
ఒక కార్యమును ఆరంభించేటప్పుడు ముందుగా గణాధిపతి పూజ చేయిస్తారు. ఒక ఆకులో పసుపును ముద్దగా చేసి, లింగాకారంలో ఉంచి అందు గణపతిని అధిష్టానం చేస్తాం. ఇలా అధిష్టానం
చేయబడిన గణపతినే ‘గణానాం త్వా’ అనే మంత్రంతో ఆరాధిస్తాం. ‘బింబే స్మిన్ సన్నిధింకురు, స్థిరోభవ, వరదోభవ’ ఈ బింబమును వాసమేర్పరచు కుని, స్థిరముగా ఉండి. మాకు వరములను అనుగ్రహించుమని ప్రార్దిస్తాం. తత్ఫలితంగా తలపెట్టిన కార్యము నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అధిష్టానానికి ముందు ఆకులలో ఉన్నది కల్పిత వస్తువే. (పసుపు ముద్ద) అధిష్టానమునకు తరువాత ఆ కల్పిత వస్తువునందు ఆ దేవతా శక్తి ఆవహింపబడుతున్నది.
వినాయక విగ్రహమును తెచ్చి ఉనత్తాసనము పై ఉంచినప్పుడు ఆ వస్తువు కల్పిత వస్తువే. గణాధిపతి పూజ చేసి, గణపతిని అధిష్టానం చేసినప్పుడే ఆ విగ్రహమునందు స్పూర్తి ఏర్పడుతుంది. మనం ఉద్వాసన చెప్పునంత వరకు సత్త స్థిరంగా ఉంటుందని భారతీయుల నమ్మకం.
కనుక కల్పిత వస్తువు తాలూకు ప్రభువు తదధిష్టాన దేవతే అనవచ్చు. ఆ ప్రభువే బ్రహ్మ. అట్లే శివ, విష్ణు, శక్తి మొదలైన ఏ దేవతలైనను బ్రహ్మరూపముగా ఆరాధిస్తారు. ఏ వస్తువునందు ఏ దేవతను అధిష్టానము చేస్తామో ఆ వస్తువునందు ఆ దేవతా శక్తి స్థిరముగా ఉంటుంది. తిరుపతి క్షేత్రమున ఉన్న విగ్రహమునందు వేంకటేశ్వరుని అధిష్టానము చేసినందువలననే, తదధిష్టాన దేవతాశక్తి ఇప్పటికీ స్థిరంగా ఉంది కనుకనే నేటికిని లక్షలమంది ఆయనను ఆరాధించి ధన్యులవుతున్నారు.
అలాగే గణపతిని ఆరాధించునపుడు విఘ్నవినాశకత్వ, సిద్ధి, బుద్ధి అనే శక్తులను అధిష్టానం చేస్తారు.
మనల్ని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటూ రక్షించే గణపతికి లక్ష నమస్కారాలు సమర్పిద్దాం.