నవరాత్రులు 9వ రోజు: మాధవేశ్వరీ దేవి మందిరం, ప్రయాగ

 

 

నవరాత్రులు 9వ రోజు: మాధవేశ్వరీ దేవి మందిరం, ప్రయాగ

 

 

గంగ, యమున, సరస్వతి నదుల కూడలి ప్రదేశం ప్రయాగ.  ఈ నదుల సంగమాన్ని త్రివేణీ సంగమం అని అంటారు.  ఈ సంగమంలో స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు.  కాశీ తీర్ధయాత్ర చేసినవారు, ప్రయాగ లో త్రివేణీ సంగమ స్నానం తప్పక ఆచరిస్తారు.  ఇక్కడ వెలిసిన మాధవేశ్వరీదేవి ఆలయాన్ని దర్శిస్తారు.  అలాగే ఈ యాత్ర చేసినవారు గంగా తీర్ధం ఈ త్రివేణీ సంగమంనుంచి మాత్రమే ఇంటికి తీసుకు వెళ్ళాలి.  ప్రయాగనే అలహాబాద్ అని కూడా అంటారు.  పౌరాణికంగానేకాక చారిత్రకంగాకూడా పేరు చెందిన ప్రదేశం ఇది.

 

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ మాధవేశ్వరీ దేవిని  ఇక్కడి వారు అలోపీ దేవిగా వ్యవహరిస్తారు.  ఈ దేవిని అలోపీదేవిగా పిలవటానిక ఇక్కడ ప్రచారంలో వున్న కధ....ఒకప్పుడు ఇదంతా దట్టమైన అరణ్య ప్రదేశం.  ఈ ప్రాంతంవారు ఆడపిల్లకి పెళ్ళిచేసి డోలీలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపిస్తారు.  అలా ఒక పెళ్ళి కూతురుని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారు.  పెళ్ళికూతురు అమ్మవారిని ప్రార్ధించగా, ఆవిడ పెళ్ళికూతురుని మాయంచేసి, ఆ దొంగలబారినుండి రక్షించిందట.  అప్పటినుంచి ఆ దేవిని అలోపీదేవిగా వ్యవహరిస్తున్నారు.  అలోపీ అంటే మాయమవటం అని అర్ధం.  అప్పటినుంచీ అక్కడివారు పెళ్ళిళ్ళకి ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యం మొదలు పెడతారు.

 

 

ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళిన పార్వతీదేవి అవమానం భరించలేక ఆత్మాహుతి చేసుకోవటం, ఆవిడని ఎత్తుకుని శంకరుడు ఉగ్రతాండవం చేయటం, ఆయనని శాంతింపచేయటానికి విష్ణుమూర్తి పార్వతీ దేవి శరీరాన్ని తన విష్ణు చక్రంతో ముక్కలు చెయ్యటం, అవి 18 ముక్కలుగా దేశంలో వివిధ ప్రదేశాల్లో పడి శక్తి పీఠాలుగా ఖ్యాతి చెందటం మీకు తెలుసుకదా.  ఇక్కడ అమ్మవారి ముంజేయి పడ్డది.  ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు.  ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది.  దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసి నట్లుంటుంది.  దానికింద ఒక ఉయ్యాల.  భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో వుంచి మొక్కుకోవాలి.

 

 

అమ్మవారి విగ్రహం లేకపోవటంతో మన దేవాలయాలు సందర్శించిన తృప్తి వుండకపోయినా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠాన్ని దర్శించామని సంతోషించాము.

 

-- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)