నవరాత్రులు 8వ రోజు: మంగళ గౌరి ఆలయం, గయ, బీహార్
నవరాత్రులు 8వ రోజు: మంగళ గౌరి ఆలయం, గయ, బీహార్
గదాధర సహోదరి గయా గౌరి నమోస్తుతే పితృణాంచ సకర్తృణాం దేవి సద్గతిదాయిని
త్రిశక్తిరూపిణీమాతా సచ్చిదానంద రూపిణీ మహ్యంభవతు సుప్రీతా గయామాంగళ్యగౌరికా.
మంగళ గౌరి మన జీవితాలలో పెనవేసుకుపోయిన అమ్మవారు. స్త్రీలు మాంగళ్య రక్షణ కోసం ప్రార్ధించేది ఈ తల్లినే. కన్యలు వివాహానికి ముందు మంగళ గౌరి పూజ చేయటం ఈ నాడే కాదు, ద్వాపర యుగంలో కూడా వున్నదని రుక్మిణీ కళ్యాణంద్వారా తెలుస్తున్నది. కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు పెళ్ళయిన మొదటి సంవత్సరంనుంచి ఐదు సంవత్సరాలపాటు శ్రావణ మంగళవారం నోము నోచుకుంటారు. దీని ముఖ్యోద్దేశ్యం తమ సంసారం చల్లగా వుండాలని, సకల శుభాలతో వర్ధిల్లాలని, తమ భర్తలు ఆయురారోగ్యాలతో క్షేమంగా వుండాలని. శ్రావణ మాసంలో ప్రతి మంగళ వారం మంగళ గౌరిని పూజించి, ముత్తయిదువలకి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు.
మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇది బీహారు రాష్ట్రంలోని గయలో వున్నది. దక్షయజ్ఞ సమయంలో అసువులుబాసిన పార్వతీ దేవి శరీరాన్ని శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో భిన్నం చేయగా అవి అనేక చోట్ల పడి శక్తి పీఠాలుగా ఆరాధింపబడుతున్నాయి.. అందులో ముఖ్యమైనవి అష్టాదశ శక్తి పీఠాలని తెలుసుకున్నాముకదా. గయలోని మంగళగౌరీ ఆలయం కూడా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారి తొడ భాగం పడ్డది. అమ్మవారి అవయవాలు పడ్డాయని చెప్పబడే ఈ ప్రదేశాలలో కొన్ని చోట్ల అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ట చెయ్యబడ్డాయి. కొన్ని చోట్ల విగ్రహాలేమీ లేకుండానే భక్తి ప్రపత్తులతో పూజలు జరుగుతున్నాయి. మనకు దేవాలయాలలో దేవుళ్ళ విగ్రహాలను చూసి తన్మయత్వంతో నమస్కరించటం అలవాటు. అలాంటివారికి ఈ ఆలయాలు కొంచెం నిరాశ కల్గించవచ్చు. కానీ మీరు దర్శిస్తున్నది శక్తి పీఠాన్నని మర్చిపోవద్దు.
ఈ ఆలయ ప్రసక్తి పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణాలలో చేయబడింది. ప్రస్తుతం వున్న ఆలయం క్రీ.శ. 1459 లో నిర్మింపబడింది. మంగళగౌరి అనే చిన్ని కొండమీద ఇటుకలతో నిర్మింపబడిన చిన్న ఆలయం ఇది. గర్భగుడి చాలా చిన్నది. లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె లాగా వుంటుంది. ఆ దిమ్మె మీద మనం వెలిగించే అఖండ దీపంలాంటిది ఒకటి, ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు ప్రకాశిస్తూ వుంటాయి. గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా వుంది. దానినే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు. ఈ ఆలయం చిన్నది. గర్భగుడి మరీ చిన్నది. ఎలక్ట్రిక్ దీపాలు వుండక పోవటంతో వెలుతురు కొంచెం తక్కువగా వుంటుంది. మనవాళ్ళల్లో కొందరు ఇంత చిన్న ఆలయంలోకి ఎలా వెళ్ళాలి, లోపల ఏమున్నది అని తొంగి చూసే లోపలే అక్కడివారు లోపలకెళ్ళిపోయి, కూర్చుని, దీపారాధన చేసి, పూజ చేసుకుని వచ్చేస్తారు. ఇక్కడ మనం తీసుకు వెళ్ళిన పూజా ద్రవ్యాలను, మనమే అమ్మవారికి సమర్పించవచ్చు. కనుక ధైర్యంగా లోపలకెళ్ళి ఆ పని చెయ్యండి. ఇరుకు ప్రదేశాలలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడేవాళ్ళు మాత్రం గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి.
సాధారణంగా కాశీక్షేత్ర దర్శనానికి వెళ్ళినవారు గయలో పితృ కార్యాలు నిర్వహించి, మంగళగౌరిని దర్శిస్తారు. అలాగే ప్రయాగలో త్రివేణీ సంగమ స్నానం, వేణీ దానం, చేసి అక్కడ వెలిసిన మరో శక్తి పీఠం మాధవేశ్వరిని దర్శించుకుని తరిస్తారు. మేము చూసినప్పుడు ఇక్కడ కొండకింద చిన్న పిల్లలు చాలామంది అడుక్కుంటూ కనిపించారు. వారి దారిద్ర్యావస్త చూసి హృదయం ద్రవించింది. రాజకీయ నాయకులు రాజకీయాలు మాని ఇలాంటివారుకూడా భారత పౌరులే అని గుర్తించేది ఎప్పుడో అనిపించింది.
-- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)