నవరాత్రులు ఆఖరి రోజు: గోల్డెన్ టెంపుల్, వెల్లూరు

 

 

నవరాత్రులు ఆఖరి రోజు: గోల్డెన్ టెంపుల్, వెల్లూరు

 

 

గోల్డెన్ టెంపుల్ అంటే, ఇదివరకు అమృత్ సర్ లోని సిక్కుల పరమ పవిత్ర మందిరం గురించే చెప్పుకునేవారు.  కానీ ఇప్పుడు దక్షిణాదిన తమిళనాడులోని వెల్లూరు దగ్గర   శ్రీ  నారాయణీ గోల్డెన్ టెంపుల్ గురించి చెబుతారు.    ఈ  ఆలయం ప్రపంచంలోనే పెద్ద గోల్డెన్ టెంపుల్ అంటారు.  అనేక ప్రాంతాలనుంచి భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న  ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక ప్రపంచం.

నిర్మించినవారు: ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని తలపెట్టినవారు  దక్షిణ భారత దేశంలో, తమిళనాడులోని వెల్లూరు దగ్గర తిరుమలైకొడి అనే వూర్లో 3-1-1976న జన్మించిన శ్రీ శక్తి అమ్మ అనే బాలుడు, 1992లో, తన 16వ ఏటనే స్ధాపించిన పీఠం పేరు శ్రీ నారాయణి పీఠం.  ఈయనలో అనేక అద్భుత దైవ శక్తులు వున్నాయని ఇక్కడివారి నమ్మకం.  జనాకర్షణ కోసం మొదట్లో ఈయన తన శక్తులను ప్రదర్శించేవారు.

 

ఉద్దేశ్యం: సమాజంలో శాంతి స్ధాపనకోసం, పేద ప్రజల జీవన సరళి మెరుగు దిద్దే వుద్దేశ్యంతో శ్రీనారాయణి పీఠం తరఫున అనేక రంగాలలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.   విద్య, ఆరోగ్యం, ప్రకృతి పరిరక్షణ, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పన, వేస్ట్ మేనేజ్మెంట్, ఇలా ఎన్నో రంగాలలో, ముఖ్యంగా గ్రామీణ ప్రజల అభివృధ్ధికోసం ఎన్నో కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహిస్తున్నారు.

 

 

నేడు ప్రపంచం అనేక సవాళ్ళనెదుర్కుంటోంది.  దానికి ముఖ్య కారణం మనిషిలోని స్వార్ధ చింతన.  ఎంతసేపూ మనిషి తను, తన కుటుంబం అనే ఆలోచిస్తున్నాడు కానీ తోటివారి గురించి ఆలోచన తక్కువైంది.  కానీ మనిషి తన తోటివారికి సహాయపడటం ద్వారా సంతోషాన్ని,  శాంతిని పెంచగలడు.  తన స్వార్ధాన్ని అధిగమించి ఈ ప్రపంచాన్ని అత్యుత్తమమైన ప్రదేశంగా తీర్చిదిద్దే శక్తి మనిషికి వుంది.  కానీ మనిషి సాధారణంగా మానవ జీవిత విలువల్ని గ్రహించక స్వార్ధ చింతనలో పడిపోతున్నాడు.  ఈ స్వార్ధ చింతనను దూరం చేసుకుని, మనిషి తనలోని దైవత్వాన్ని గుర్తించటానికి ప్రేరణ కావాలనే వుద్దేశ్యంతోనే శ్రీ శక్తి అమ్మచే శ్రీపురంలోని శ్రీ  నారాయణి బంగారు దేవాలయం నెలకొల్పబడింది.

ఆలయ పరిసరాలు: 100 ఎకరాల సువిశాలమైన ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం.  ప్రకృతినుంచి అపార శక్తిని విలీనం చేసుకునేందుకు వీలుగా ఈ ఆలయం చేరుకోవటానికి మార్గం నక్షత్రం ఆకారంలో నిర్మించబడింది.  ఈ మార్గంగుండా వెళ్తే శ్రీ  నారాయణి బంగారు దేవాలయానికి చేరవచ్చు.  వివరాలు తెలియకుండా వెళ్ళిన వాళ్ళకి మనం నక్షత్ర ఆకార మార్గంలో వెళ్తున్నామని తెలియదు.  అసలు ఎంత దూరం నడిచామోకూడా తెలియదు.  ఎండాకాలం, వానాకాలం, ఏ కాలంలోనైనా ఆ మార్గం యాత్రీకుల సేద తీరుస్తూనే వుంటుంది. చక్కటి గాలి, కనుల విందు చేసే ప్రకృతి సౌందర్యమే కాకుండా, హిందీ, తెలుగు, తమిళ. ఇంగ్లీషు భాషల్లో చక్కని సూక్తులు రాసిన బోర్డులను కూడా దోవకిరువైపులా చూడవచ్చు. ఈ బోర్డులమీద సందేశాలలో మనిషి జన్మ, జీవితం, జీవితంలో మనం చెయ్యవలసినవి, చెయ్యకూడనివి, ఆధ్యాత్మిక చింతన ఆవశ్యకత ..  ఒకటేమిటి .. ఎన్నో విషయాలమీద చక్కని సూక్తులు రాసి వున్నాయి.

 

 

ఏదో గోల్డెన్ టెంపుల్ చూడటానికొచ్చామని హడావిడిగా పరిగెత్తి, ఆ ఆలయం ఒకటీ రెండు నిముషాలు చూసి వచ్యెయ్యకండి.  ఈ ఆలయ దర్శనానికి తగిన సమయం కేటాయించుకుని వెళ్ళండి.  ఎందుకంటే లోపల దాదాపు 1.5 కి.మీ. లు నడవాలి.  కానీ మీరు అంత దూరం నడిచినట్లు మీకు తెలియదు. నెమ్మదిగా నడుస్తూ, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, సూక్తులను చదువుతూ, అవసరమైతే మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకుంటూ వెళ్ళండి.  (అన్ని అవసరాలకీ లోపల అన్ని హంగులూ వున్నాయి.  మీరు దేనికీ ఇబ్బంది పడక్కరలేదు).  గేటు దగ్గరనుంచీ, ఆలయం చేరేలోపల మీ మనసులోని మార్పు గమనించండి.  కొంత దూరం వెళ్ళిన తర్వాత కనుల విందు చేసే బంగారు ఆలయ దృశ్యం, అందమైన అనుభవం.  దోవ పొడుగూతా పూజా ద్రవ్యాలు, కేసెట్స్, పుస్తకాలు వగైరా విక్రయించే దుకాణాలు – సంస్ధవారివే – యాత్రీకులకు సకల సౌకర్యాలు – అన్నీ పరి శుభ్రంగా, అందుబాటులో వున్నాయి. అంత విశాలమైన ప్రదేశంలో ఎటు వెళ్ళాలా అని ఎవర్నీ అడగక్కరలేదు.  మనం ప్రవేశించిన మార్గాన్ననుసరిస్తే చాలు...దేవాలయంలో కనీసం మూడు గంటలన్నా గడప గలిగితేనే బయల్దేరండి.  ఆ మార్గంగుండా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటానికి పట్టే కనీస సమయం అది.  అన్నట్లు దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఉచిత దర్శనం క్యూ ముందు బోర్డు పెడతారు.

 

 

దేవాలయం: ఈ ఆలయం నిర్మాణం 2001 లో మొదలుపెట్టి 6 ఏళ్ళ పైన నిర్మాణం సాగి,  24-8-2007న కుంభాభిషేకం జరిగింది. ఆలయం చుట్టూ  కోనేరు నిర్మించబడింది.  దీని పేరు సర్వ తీర్ధం.  భారత దేశంలోని అనేక ప్రసిధ్ధ  నదుల పవిత్ర జలాలు ఈ కొలనులో కలిపారు.  అందుకే దానికాపేరు. ఈ ఆలయానికి బంగారు రేకు తాపడం చెయ్యటానికి 1.5 టన్నుల పైన బంగారాన్ని వినియోగించారు.  400మంది నిపుణులు బంగారాన్ని రేకులుగా తయారు చేసి ఆలయం గోడలమీద తాపడం చేశారు.  బంగారం రేకుకన్నా ముందు ఈ గోడలమీద రాగి రేకు తాపడం చేశారు.  ఈ పని మొత్తం, బంగారాన్ని రేకుగా తయారు చెయ్యటంతో సహా,  ఏ యంత్రం సహాయం లేకుండా జరిగింది.  గోడలమీద కళాకృతులు చూపర్లను ముగ్ధులను చేస్తాయి.

 

ఈ ఆలయ నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఆలయం మొత్తం బంగారం రేకు కప్పబడిందిగనుక విద్యుద్దీపాల కాంతిలో అత్యద్భుతంగా కనబడుతుంది.  మేము మధ్యాహ్నంపూట వెళ్ళాం.  సూర్యకాంతి బంగారు ఆలయం మీదపడి అందంగా మెరిసింది. శ్రీ నారాయణి అమ్మవారు: నల్లటి గ్రానైట్ రాతితో మలచబడ్డ శ్రీ నారాయణి చతుర్భుజి.  కుడి చేత్తో చక్రాన్ని, ఎడమ చేతితో శంఖుని, ఒక చేతిలో తామర పువ్వుని పట్టుకుని వున్న తల్లి నాలుగో చేతితో భక్తులకు అభయ ప్రదానం చేస్తూ వుంటుంది. అమ్మవారి ప్రతిష్ట సమయంలో 9 రోజుల్లో 750 మంది పండితులు అమ్మవారి నామాన్ని ఒక బిలియన్ సార్లు జపించారు.

 

 

 

ఆలయంలో సౌకర్యాలు: ప్రవేశద్వారంలో ఎడమవైపు ఉచిత దర్శనానికి క్యూ, టికెట్ కౌంటర్లు, వీల్ ఛైర్ కావల్సినవారికి కౌంటర్లు వున్నాయి.  నడవలేనివారు వీల్ ఛైర్ ఉపయోగించుకోండి అవస్త పడకుండా.  కుడివైపు ఎలక్ట్రానిక్ వస్తువులు, చెప్పులు వగైరా పెట్టే కౌంటర్లు.  ఇవ్వికూడా ఎందుకు చెబుతున్నానంటే దర్శనం సమయం అయిపోయే సమయంలో వచ్చేవాళ్ళు, ఎటుపోవాలో ఏమిటో తెలియక తికమక పడేవాళ్ళని కొందరిని మేము గైడ్ చేశాం.  లోపల మరి చాలా దూరం నడవాలి.  సమయం కాస్తా బయటే అయిపోతే ఎట్లా? ఈ సౌకర్యాలు వాడుకున్నందుకు కొంత రుసుము చెల్లించాల్సి వుంటుంది.  అది చెల్లించటం ఇష్టం లేనివారు ఆలయానికి వెళ్ళేటప్పుడు అటువంటి వస్తువులు .. అంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, కెమేరాలు తీసుకు వెళ్ళద్దు.    సెల్ ఫోన్స్, కెమేరాలు తీసుకెళ్తే అన్నీ అక్కడ వున్న కౌంటర్లో డిపాజిట్ చెయ్యవలసిందే.  ఎవరి వస్తువులు వారికి విడివిడిగా ప్లాస్టిక్ కవర్లల్లో పెట్టి భద్రంగా తిరిగి అందజేస్తారు.    అంత అందమైన ప్రదేశాల్ని ఫోటోలు తీసుకోలేక పోయామనే బాధ అందరికీ వుండి వుంటుంది.   చెప్పులుకూడా ప్లాస్టిక్ కవర్లో పెట్టి కొంటర్ లో ఇవ్వాలి.  రెండు సైజుల కవర్లు అక్కడే అమ్ముతారు.  మీ దగ్గర పెద్ద కవర్లున్నా తీసుకుంటారనుకుంటా.

 

ఉచిత దర్శనానికి క్యూ అంటే మీరు క్యూలోనే నడవక్కరలేదు.  వెడల్పయిన దోవ వుంటుంది.  ముందు వాళ్లు నెమ్మదిగా నడుస్తుంటే మీకు సమయం లేకపోతే మీరు తప్పుకుని ముందుకు వెళ్ళచ్చు. ఉచిత దర్శనంతోపాటు రూ 250, ఇంకా ఇతర టికెట్లు కూడా వున్నాయి దర్శనానికి.  వారికీ వీరికీ క్యూలు  వేరే వుంటాయి.  టికెట్ కొన్న వారు ఉచిత దర్శనానికి నడిచినంత దూరం నడవక్కరలేదు.  ఉచిత దర్శనంవాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి.  అదే టికెట్ కొన్నవారిని అమ్మవారిముంది కూర్చోపెట్టి హారతి ఇస్తారు.  ఇందులోకూడా ఎక్కువ ధరతో టికెట్ కొన్నవాళ్ళుముందు, మిగతావారు వారి వెనక తప్పితే వేరే తేడాలు లేవు.  మిగతా అన్నిచోట్లా అందరూ ఒకటే.  (వీటిలో ఈ మధ్య మార్పులు జరిగాయని విన్నాను).

ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఆలయ కౌంటర్స్ లో వుండేవారు డొనేషన్స్ గురించి ఎక్కువగా చెబుతారనే వ్యాఖ్య ఒకటుంది.  అయితే మనకిష్టంలేని పని మనచేత బలవంతంగా  చేయించలేరుకదా ఎవరూ. ఈ ఆలయానికి ఎదురుగా (కొంచెం పక్కకి) ఇంకొక ఆలయం వున్నది.  అక్కడ శివుడు స్వయంభూ అంటారు.  అమ్మవారు, పుట్ట వుంటాయి.  ఆ ఆలయం దర్శించదగినది.

పూజలు: ప్రతి రోజూ గణపతి, విశ్వరూప, పుట్ట, సూర్యుడు, గోవు మొదలగువారికి పూజలతోబాటు అమ్మవారికి 3 గం. పూజ జరుగుతుంది.  తర్వాత ప్రసాద వితరణ వుంటుంది.  ప్రతి నెలా పౌర్ణమి రోజు సాయంత్రం ప్రత్యేక పూజలు, యాగాలు వుంటాయి.

 

ఆహారం: ఆలయం పక్కనే హోటల్స్ వున్నాయి.

 

వసతి సౌకర్యం: ఇక్కడ గెస్టు హౌస్ లు కూడా వున్నాయి.  అయితే అక్కడ వుండటానికి ముందు రిజర్వు చేసుకోవాలి. అలా ముందు రిజర్వు చేసుకోలేనివాళ్ళు, ఖర్చు భరించలేనివాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడక్కరలేదు.  ఇక్కడున్న పెద్ద పెద్ద హాల్స్ లో రాత్రి 10 గం. ల నుంచి ప్రవేశం వుంటుంది.  అక్కడ పడుకోవచ్చు.  కొంత రుసుము చెల్లిస్తే దుప్పటి, దిండు ఇస్తారు కానీ మేము చూసినప్పుడు అవి సరిగ్గాలేవు.  కనుక మీ దగ్గర పక్క బట్టలుండీ, కింద పడుకోగలిగితే హాయిగా రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుని, అక్కడే వున్న సామూహిక బాత్ రూమ్స్ వగైరాలలో స్నానాలు వగైరాలు కానిచ్చుకుని బయల్దేరవచ్చు.  దీనికి ఏమీ డబ్బు చెల్లించక్కరలేదు.   కానీ మీరు జనంలో అన్ని పనులూ చేసుకోగలగాలి.

 

రవాణా సౌకర్యం: గోల్టెన్ టెంపుల్ కి వెల్లూరు కొత్త బస్టాండునుంచి విరివిగా బస్సులున్నాయి.  ఈ ప్రదేశం చెన్నైనుంచీ 150 కి.మీ., బెంగుళూరునుంచి 200 కి.మీ. దూరంలో వుంది.  అన్ని చోట్లనుంచీ వెల్లూరుకి రైలు, బస్ సౌకర్యాలున్నాయి.

 

దర్శించదగ్గ ఇతర ముఖ్య ప్రదేశాలు: వెల్లూరులో 16 వ శతాబ్దంనాటి కోట, చుట్టూ కందకంతో వున్నది.  పల్లవులు, చోళులు, నాయకులు, మరాఠా రాజులు, ఆర్కాట్ నవాబులు, బీజావూర్ సుల్తానులు వెల్లూరును ముఖ్యపట్టణంగా పరిపాలించారు. ఇక్కడికి 85 కి.మీ. ల దూరంలో సుప్రసిధ్ధ శైవ క్షేత్రం, పంచ భూత లింగాలలో అగ్ని లింగం నెలకొన్న తిరువన్నామలై వున్నది.  ఇక్కడే రమణ మహర్షి ఆశ్రమం వున్నది. చిత్తూరు దగ్గర కాణిపాకం, అర్ధగిరి (అరగొండ)  ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. యాత్రికులను, భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ ఆలయం అందాలను అవకాశం వున్నవారు తప్పక దర్శించాలి.

 


- పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)