ఇంట్లో పూజగది ఇలా ఉండేలా చూసుకోవాలి!
ఇంట్లో పూజగది ఇలా ఉండేలా చూసుకోవాలి!
పూజ గది.. భారతీయ హిందువులకు ఇంట్లో చాలా పవిత్రమైన స్థలం. ప్రతి ఊరికి దేవాలయం ఎలాగైతే ఉంటుందో., ప్రతి హిందువు ఇంట్లో కనీసం ఇద్దరు, ముగ్గురు దేవతా మూర్తుల పటాలు లేక విగ్రహాలతో కూడిన పూజ గది తప్పనిసరిగా ఉంటుంది. అయితే పూజ గది విషయంలో చేసే కొన్ని చిన్న మార్పులు చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. ఇంట్లో పూజ గది ఎక్కడ ఉండాలి? దాని ఏర్పాటు ఎలా ఉండాలి? పూజ గది ఉంటే ఎలాంటి జాగ్రత్తలు, నియమాలు పాటించాలి? తెలుసుకుంటే..
ఇంట్లో సూర్య కాంతి పడే ప్రదేశంలో దేవుడి గది ఉండేలా చూసుకోవాలి. సూర్యకాంతి దేవుడి చిత్రపటాల మీద, విగ్రహాల మీద పడుతూ ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది.
ఇంట్లో దేవుడి గది ఏర్పాటు చేసుకుని దేవతామూర్తులను ఏర్పాటు చేసుకోగానే దేవుడు ఇంట్లో వెలసినట్టు కాదు. దేవుడికి నిత్యం దీపారాధన చేస్తుండాలి. అది కూడా ఏ ఇంట్లో అయితే ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారో..ఆ ఇంట్లో దైవిక శక్తి ఉంటుంది. అలాగే పూజలు చేసేటప్పుడు ధూపం, దీపం, నైవేద్యం.. తప్పనిసరిగా ఉంచాలి. కుటుంబ సభ్యులు అందరూ పూజ దగ్గర ఉండేలా చూసుకోవాలి. అదే విదంగా గంట మోగించాలి. ఇలా చేస్తే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు కూడా పదిలంగా ఉంటాయి.
కొందరికి ఇంట్లో చెప్పులు, షూస్ వేసుకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి వారు చెప్పులు, షూస్ వంటివి ధరించి ఇంట్లో దేవుడి పూజ గది దగ్గరకు వెళ్లకూడదు. దీని వల్ల ఇంట్లో దైవ శక్తి సన్నగిల్లే అవకాశం ఉంటుంది. దేవతలను అనుమానించినట్టే.
చాలామందికి పెద్దలంటే భక్తి, గౌరవం ఉంటాయి. అందుకే దేవుడి గదిలో మరణించిన పెద్దల ఫొటోలను ఉంచుతుంటారు. కానీ దేవుడి పటాల మధ్య పెద్దల ఫొటోలను ఉంచుకోవడం మంచిది కాదట. దీనికి బదులు పెద్దల ఫొటోలను ఇంట్లో దక్షిణ దిక్కులో ఉంచుకుంటే అది ఉత్తమం అంటారు.
ఇంట్లో దేవుడి గది దగ్గర ఎట్టి పరిస్థితులలోనూ టాయిలెట్ ఉండకూడదు. కొందరు ఇంటి స్థలం సరిపోలేదనో లేక ఇంటి ప్లానింగ్ కారణంగానో పూజ గది దగ్గర టాయిలెట్ ఏర్పాటు చేయిస్తుంటారు. కానీ ఇది మంచిది కాదు.
*రూపశ్రీ.