మాఘపూర్ణిమ రోజు గంగాస్నానం చేస్తే ఎంత పుణ్యమూ తెలుసా...

 

మాఘపూర్ణిమ రోజు గంగాస్నానం చేస్తే ఎంత పుణ్యమూ తెలుసా...

 


ప్రతి నెలలో ఒక పూర్ణిమ వస్తుంది.  మాసాన్ని బట్టి ఆ పూర్ణిమకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. శ్రావణపూర్ణిమ,  కార్తీక పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ..  ఇలా చాలా ప్రత్యేకమైన పూర్ణిమలు ఉన్నాయి.  ఈ కోవకు చెందినదే మాఘ పూర్ణిమ. మాఘ పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కుంభమేళా జరుగుతున్న ఈ రోజుల్లో మాఘ పూర్ణిమ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మాఘ పూర్ణిమ రోజు ప్రయాగ క్షేత్రంలో గంగా స్నానం చేస్తే చాలా మంచిదని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..

పవిత్ర ప్రయాగ నది సంగమం వద్ద  గంగానదిలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం,  విష్ణువు,  లక్ష్మీ దేవిని పూజించడం మొదలైన విషయాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం మహా కుంభమేళాను 144 సంవత్సరాల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్నారు.దీని కారణంగా పూర్ణిమ తిథి ప్రాముఖ్యత గణనీయంగా పెరిగింది.

 మాఘ పూర్ణిమ రోజున గంగానదిలో స్నానం చేసి దానం చేయడం వల్ల అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుందట. స్కంద పురాణం ప్రకారం మాఘ పూర్ణిమ నాడు స్నానం చేయడం వల్ల  వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు.  మాఘ పూర్ణిమ నాడు ప్రయాగ సంగమ స్నానం చేసిన వ్యక్తి  జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుందట. ఈ నెలలో ప్రయాగ్‌రాజ్‌లో 'మాఘమేళా' నిర్వహిస్తారు. ఇది కుంభమేళా మాదిరిగానే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మత గ్రంథాల ప్రకారం ఈ నెలలో ఆవు, నువ్వులు, బెల్లం,  దుప్పటి దానం చేయడం వల్ల ప్రత్యేక పుణ్య ఫలితాలు లభిస్తాయి.

జ్యోతిష ప్రాముఖ్యత..

ఈ నెలలో వచ్చే పూర్ణిమ తిథి గొప్ప జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం మాఘ పూర్ణిమ రోజున మనస్సుకు కారకమైన చంద్రుడు కర్కాటక రాశిలోకి,  ఆత్మకు కారకమైన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారట. ఈ సందర్భంగా  మాఘ పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు. ఈ రెండు మార్పులు జరుగుతున్న సమయంలో గంగానదిలో స్నానం చేయడం,  దానాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.  ఇవి చాలా గొప్ప పుణ్య ఫలాన్ని ఇస్తాయి.  మత విశ్వాసాల ప్రకారం, విష్ణువు మాఘ పూర్ణిమ రోజున మత్స్య అవతారం తీసుకున్నాడట. కాబట్టి గంగానదిలో స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని పురాణ పండితుల అభిప్రాయం.


                                              *రూపశ్రీ.