Physical Exercises in Hindu Epics

 

పురాణాల్లో వ్యాయామం గురించి ఏం చెప్పారు?

Physical Exercises in Hindu Epics

శారీరక వ్యాయామం నేర్పేందుకు ఎందరో నిపుణులు ఎన్నో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అనేక జిమ్ములు వెలుస్తున్నాయి. యోగా సెంటర్లు సరేసరి. ఆరోగ్యం గురించి ఈ తరం వారికే శ్రద్ధ పెరిగిందని, జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుకుంటే పొరపాటు. అతి ప్రాచీనకాలంలోనే వ్యాయామం గురించిన అవగాహన ఉండేది. మన పురాణ, ఇతిహాసాల్లో యోగాసనాలు, వ్యాయామం ప్రస్తావన అనేకసార్లు కనిపిస్తుంది.

శరీరానికి ఆహారం ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే అవసరం. తీసుకున్న ఆహారం సవ్యంగా జీర్ణం కావడానికి, రక్త ప్రసరణ సాఫీగా ఉండడానికి వ్యాయామం చాలా అవసరం. అందుకే అనేక విధాలుగా ఎక్సర్సైజులు చేసేవారు. యోగాసనాలు వేసేవారు. సూర్య నమస్కారాలు చేసేవారు. చాలాదూరంపాటు నడక సాగించేవారు. నడక కూడా ఖచ్చితంగా వ్యాయామంలో భాగమే. పూర్వం రవాణా సౌకర్యం అంతగా లేదు కనుక ఎన్నెన్నో యోజనాల దూరం నడిచేవారు. గుడిలో చేసే ప్రదక్షిణలవల్ల ఇతర ప్రయోజనాల సంగతి అలా ఉంచితే శారీరక వ్యాయామం కూడా ఒకటి.

వ్యాయామం, నడక, యోగాసనాల వల్ల శరీరంలోని బాహ్య, అంతర్భాగాలన్నిటిలో చురుకుదనం వస్తుంది. తీసుకున్న ఆహారం చక్కగా అరుగుతుంది. అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. దృఢపడతాయి. అనారోగ్య సమస్యలు తలెత్తవు.

లాఘవైః కర్మ సామర్ధ్య స్థైర్య క్లేశా సహిష్ణుతా

దోషక్షమో (అ)గ్ని వృద్ధిశ్చ వ్యాయామాదుపజాయతే

వ్యాయామం చేసినప్పుడు చెమట పడుతుంది. ఆ స్వేదంలోంచి శరీరంలో కూడుకున్న మలినాలన్నీ బయటకు వస్తాయి. అలసటను దూరం చేస్తుంది. శరీర భారాన్ని తగ్గిస్తుంది. సోమరితనాన్ని పోగొడుతుంది. పనిచేయాలనే తత్వం వస్తుంది. శరీరంలో హాని చేసే సూక్ష్మ క్రిములు ఏమైనా ఉంటే నశిస్తాయి. మలినాలు గట్రా వెళ్ళిపోవడంతో స్వచ్చత చేకూరుతుంది. జీర్ణ ప్రక్రియ వృద్ధి చెందుతుంది. అటు శరీర అంతర్భాగాలు, ఇటు బాహ్య అవయవాలు కూడా చురుగ్గా పనిచేస్తాయి.

వ్యాయామంలో చేసేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?

వ్యాయామం అంటే ఎప్పుడో ఒకప్పుడు ఎలాగోలా చేయడం సరికాదు. దానికి కొన్ని నియమాలు ఉంటాయి. సరిగా వ్యాయామం చేసే తీరును పెద్దలు ఇలా నిర్వచించారు.

వ్యాయామోపి సదా పథ్యో బలినాం స్నిగ్ధ భోజనాత్

సశీతేచ వసంతే చ తేషాం పథ్యతమో మతః

వ్యాయామం తప్పక చేయాలి. అయితే మరీ అలసట కలిగించేంతగా అంటే శక్తికి మించి చేయకూడదు. వ్యాయామం అందరికీ ఒకలా ఉండదు. ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారు తమకు ఎంతసేపు వ్యాయామం అవసరమో నిర్ణయించుకోవాలి. శరీరం కొంతవరకూ అలసిపోవాలి. అలాగని మరీ ఎక్కువగా ఆయాసం కలిగేవరకూ చేయకూడదు.

చిన్నారులు ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన పనిలేదు. వాళ్ళు ఆడే ఆటలే వారికి వ్యాయామం. వృద్ధులు కూడా వ్యాయామం చేయనవసరం లేదు. ఉదయం, సాయంత్రం ఓ గంటసేపు నడిస్తే చాలు అదే వారికి వ్యాయామం.

వ్యాయామం చేసి అలసిపోయిన తర్వాత కొద్దిసేపు అలా విశ్రాంతిగా కూర్చోవాలి. స్వేదరూపంలో లోపలి మలినాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత హాయిగా స్నానం చేయాలి. పెద్దలు నదీ స్నానాన్ని మించింది లేదని ఉపదేశించారు. ఈరోజుల్లో నదీ స్నానం చాలా కష్టమైన వ్యవహారం కనుక ఇంట్లోనే చేసినా ఎక్కువనీళ్ళతో స్నానం చేయాలి. ఒంటిమీద ధారాళంగా నీళ్ళు పోసుకుంటూ ఆయాసం, బడలిక అంతా తీరిపోయేదాకా స్నానం చేయాలి. ఎక్కువ నీటితో ఎక్కువసేపు స్నానం చేయడం కూడా ఒకవిధమైన వ్యాయామమే. పొదుపుగా కొన్ని నీటితో చేసే స్నానం లేదా హడావిడిగా చేసే స్నానం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇవన్నీ పురాణాల్లో, ఇతిహాసాల్లో మన పెద్దలు చెప్పిన మంచి మాటలు. వ్యాయామం వల్ల శరీరమూ, మనసూ కూడా ఉల్లాసభరితమౌతాయని చెప్పారు.

 

Physical exercise gives health, Physical exercise blood circulation, exercises and bath in hindu epics, Physical exercise mental peace, exercises physical and mental health