శనివార పరిహారం.. ఈ చిన్న పూజ ఏడాది మొత్తం ఇబ్బందులను దూరం చేస్తుంది!

 

శనివార పరిహారం.. ఈ రోజు చేసే ఈ చిన్న పూజ.. ఏడాది మొత్తం ఇబ్బందులను దూరం చేస్తుంది..!

హిందూ మతం ఎంతో ధర్మ బద్దమైనది. ఇందులో పేర్కొన్న విధంగా జీవితాన్ని ఆచరిస్తే ఎంతో ధర్మబద్దంగా ఉండగలుగుతారు.  హిందూ క్యాలెండర్ ప్రకారం వారంలో ఒక్కొక్క రోజు ఒకో దేవుడికి ప్రత్యేకం అని చెబుతారు. శనివారం రోజు హనుమంతుడిని, విష్ణువు అవతారాలను,   మరీ ముఖ్యంగా శనీశ్వరుడిని పూజిస్తారు.  శనీశ్వురుడు ప్రతి వ్యక్తి జీవితంలో చేసిన కర్మల ఆధారంగా వారికి ఫలాలను ఇస్తుంటాడు.  శని గ్రహం అనుకూలంగా లేకపోతే జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటే ఎంతటి కష్టాలు అయినా సరే.. చాలా సులువుగా దాటగలిగేలా చేస్తాడు.  శనివారం రోజు శనీశ్వరుడిని పూజించడం వల్ల  ఏడాది పొడవునా జీవితంలో ఇబ్బందులు దూరంగా ఉంటాయని చెబుతారు.  

శనివారం పరిహారాలు..

రావిచెట్టు దీపం..

శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం చాలా ప్రభావవంతమైన పరిహారమని పెద్దలు చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం  అందరు దేవుళ్ళు,  దేవతలు రావి చెట్టులో నివసిస్తారు.  శనివారం రోజు అక్కడ దీపం వెలిగించడం వల్ల శని దోషం,  ఏలినాటి శని,  అర్థాష్టమ శని వంటి ప్రభావాలు తగ్గుతాయి. దీపం వెలిగిస్తూ "ఓం శం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని జపించడం మరింత మంచి ఫలితాలు ఇస్తుంది.

ఆవనూనె దానం..

ఆవ నూనె శని దేవుడికి ఇష్టమైనది. ఈ రోజున ఆవ నూనెను దానం చేయడం వల్ల శని దేవుడిని సంతృప్తి పరచవచ్చు.  ఆవ నూనెను దానం చేసే సంప్రదాయాన్ని "ఛాయ దానం" అని పిలుస్తారు.   నూనె గిన్నెలో  ముఖాన్ని చూసి దానిని దానం చేస్తారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ ఆచారం  ఆరోగ్యానికి,  మానసిక ప్రశాంతతకు ప్రయోజనకరంగా ఉంటుంది.


నల్ల రంగు జంతువులకు, పక్షులను ఆదరించడం..

శని దేవుని వాహనం కాకి,  అలాగే శనిదేవుడికి నలుపు రంగు చాలా ఇష్టం. నల్ల ఆవుకు రొట్టెలు లేదా ఆహారం తినిపించడం లేదా నల్ల కుక్కలకు నూనె పూసిన రొట్టెను, లేదా నల్ల మినుములతో చేసిన వడలను తినిపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ పరిహారం జాతక దోషాలను శాంతింపజేయడమే కాకుండా  కెరీర్‌లో అడ్డంకులను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

శని చాలీసా, హనుమాన్ చాలీసా..

హనుమంతుడిని పూజించేవారికి శని దేవుడు ఎప్పుడూ ఇబ్బంది కలిగించడని శాస్త్రాలలో పేర్కొనబడింది. శనివారాల్లో హనుమాన్ చాలీసాతో పాటు శని చాలీసాను పఠించడం రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఈ పరిహారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది,  ప్రమాదాల నుండి రక్షిస్తుంది.

పేదలకు..

శని దేవుడు "కర్మ ప్రసాదించేవాడు." ఈ రోజున పేద లేదా అవసరంలో ఉన్న వ్యక్తికి నల్ల మినుములు, నల్ల దుప్పటి లేదా బూట్లు దానం చేయాలి. మానసిక,  ఆధ్యాత్మిక  కోణాలలో  నిస్వార్థ సేవ మనశ్శాంతిని తెస్తుందని,  సానుకూల శక్తిని  చేకూర్చుతుందని చెబుతున్నాయి.

ఈ పనులు చేయకూడదు..

శనివారం నాడు ఇనుము, నూనె లేదా ఉప్పు కొనడం మానుకోవాలి.

ఏ అమాయక వ్యక్తికి లేదా జంతువుకు హాని చేయకూడదు. ఎందుకంటే శని దేవుడు అన్యాయం చేసే వారిపై కోపంగా ఉంటాడు.

                            *రూపశ్రీ.