వినాయకుడికి షోడశోపచార పూజ ఎందుకు?

 

వినాయకుడికి షోడశోపచార పూజ ఎందుకు?

ప్రతి శుభకార్యం లోనూ ప్రతి పండుగలోనూ మొదటగా పూజించే దైవం వినాయకుడు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించువాడు అని అర్థం. గణపతి ప్రార్థన పిల్లలకు పెద్దలకు ఖచ్చితంగా అవసరం కూడా. సర్వకార్యసిద్దుడిగా వినాయకుడు పూజలు అందుకుంటాడు. వినాయకుడిని విఘ్ననాశకుడు అని మాత్రమేకాదు, విఘ్నకారకుడు అని కుడా అంటారు. విఘ్నాలు తొలగించడం సంగతి తెలుసు కానీ విఘ్నకారకుడై విఘ్నాలను కలిగించడం ఏమిటి అనిపిస్తుంది అందరికి. 

మనం ఏదైనా పెద్ద పని ప్రారంబించే ముందు వినాయకుడి గురించి ప్రార్థించే శ్లోకం ఒకటి ఉంటుంది. అది ఏమిటంటే 

"సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః

ధూమకేతుః గణాద్యక్ష ఫాలచంద్రో గజాననః

వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజః

షోడశైతాని నామాని పఠేశ్రుణుయాదపి

విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా

సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే!!"

ఇది శ్లోకం. 

ఈ శ్లోకంలో వినాయకుడి పదహరు పేర్లు  ఉంటాయి. ఈ పదహరు పేర్లను షోడశైతాని నామాని అంటారు. 

విఘ్నేశ్వరుడికి ఎప్పుడు అన్నీ 21 అంకె మీద ఆధారపడి ఉంటాయి. 

వినాయక చవితి రోజు ఏకవిశంతి పత్రాని అని 21 పత్రాలతో పూజ చేస్తారు. దీన్నే మనం పత్రి పూజ అంటాము.

అదే విధంగా 21 రకాల పువ్వులతో పూజ చేస్తారు. 

కొంతమంది 21 రకాల పిండివంటలు చేసి నైవేద్యంగా పెడతారు.

కానీ పైన చెప్పుకున్న శ్లోకంలో 16 సంఖ్య, ఇంకా షోడశైతాని నామాని పఠేశృణుయాదపి అనే పదానికి అర్థం ఏమిటంటే 

విఘ్నేశ్వరుడికి పదహారు రకాల పేర్లు చెబుతున్నాము, ఆ పదహరు పేర్లు అందరూ చెప్పండి అని ఇక్కడ అడగడం లేదు. చెబితే మంచిది అనే ఒక సలహా ఇస్తున్నారు. ఒకవేళ చెప్పలేకపోతే, కనీసం వినాలని చెబుతున్నారు. ఎందుకు ఈ పదహారు పేర్లను చెప్పడం లేదా వినడం?? అనే సందేహం అందరికీ రావచ్చు.

ప్రతి ఇంట్లో వినాయకుని పదహారు నామాలు చెప్పేవారు తప్పనిసరిగా ఉండాలట. కనీసం ఒక్కరు చెప్పినా మిగిలినవారు వినాలట. ప్రతిరోజూ ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు పూజ చేస్తుంటే మిగిలిన అందరూ అక్కడికి వెళ్లి నిలబడటం తప్పనిసరి విధిగా చెయ్యాలి. అప్పుడు ఎవరికి వారు చెప్పకపోయినా కనీసం వింటున్నా మిగిలినవాళ్లకు అర్థమైపోతుంది.

వినాయకునికి 21 సంఖ్య శ్రేష్టం కదా మరి 16 అంటున్నారు ఎందుకు?? ఈ షోడశైతాని నామాని అని 16 కు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేది ఇప్పుడు చెప్పుకోవాలి.

చంద్రుడిని షోడశకళా ప్రపూర్ణుడు అని అంటారు. చంద్రుడికి పదహారు కళలు ఉంటాయి. చంద్రుడికి పదహారు కళలు ఉన్నట్టు మనిషి జీవితం పదహారు సంస్కారాలతో నిండి ఉంటుంది. అంటే మొత్తం పదహారు సంస్కారములు మనిషి జీవితంలో నడుస్తాయి. ఈ పదహరులో చివరి దాన్ని అంత్యేష్టి సంస్కారం అని అంటారు. మనిషి పుట్టకముందే తల్లికడుపులో ఉన్నపుడు శ్రీమంతం పేరిట మొదటి సంస్కారముగా నిర్వహిస్తారు. నిజానికి ఇది ఆడవారికోసం చేసేది కాదు. కడుపులో ఉన్న బిడ్డకోసం చేసేది. దీన్ని సీమంతోన్నయనము అని అంటారు. దీనితో మొదలై, శరీరం ఇక శాశ్వతంగా చలనం లేకుండా పడిపోవడాన్ని అంత్యేష్టి సంస్కారం గా నిర్వహిస్తూ మనిషి పదహారు కళలు పూర్తి చేస్తారు. 

ఎవరైనా ఏదైనా ఒక పూజ చేస్తే అందులో ఏ దేవుడికి పూజ చేస్తారో ఆ దేవుడికి షోడశ పూజ నిర్వహిస్తారు. ఈశ్వరుడికి అయినా వినాయకుడికి అయినా ఇతర దేవుళ్ళకు అయినా ఈ షోడశ పూజ తప్పనిసరి. ఈ షోడశ పూజను పూర్తిచేస్తే వినాయకుడు సంతృప్తి చెందుతాడు. షోడశ నామ స్తోత్రం చెప్పి, షోడశోపచార పూజ చేస్తే చేసే పూజలో సార్థకత కూడా ఉంటుంది.

అందుకే ప్రథమ పూజ్యుడైన వినాయకుడి పూజలో షోడశోపచార పూజ తప్పనిసరిగా చేయాలి. ఇది చేయకుండా ఆయన విఘ్ననాశకుడు కాదని ఎద్దేవా చేసేవారు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. అయితే నైతికత లేని పనులకు వినాయకుడే కాదు ఏ దేవుడు కూడా సహకారం అందించడు అనే విషయం తెలుసుకోవాలి. అందుకే విఘ్ననాశకుడనే కాదు విఘ్నకారకుడు అని కూడా అంటారు.

                                     ◆నిశ్శబ్ద.