వినాయకుడి ఆకారంలో ఆంతర్యం ఇదే!
వినాయకుడి ఆకారంలో ఆంతర్యం ఇదే!
శ్రావణమాసం పెళ్లిళ్ల సందడితో ముగిశాక వచ్చేది భాద్రపద మాసం. భాద్రపద మాసమంటే అందరికీ చాలా ఇష్టం. పిల్లలకు పెద్దలకు, అందరికీ ఎంతో ఇష్టమైన గణపతి అందరి ఇళ్లలోకి విచ్చేసి కొలువయ్యే మాసం భాద్రపద మాసం. ఊరూరా, వీధి వీధి వినాయక విగ్రహాల పతిష్టాపన, పూజలు, వినాయకుని జయజయద్వానాలు మిన్నంటుతాయి.
వినాయకచవితి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ వినాయకుడు కడుపు నిండుగా కుడుములు తిని నడుస్తూ కిందపడిపోతే చంద్రుడు నవ్వడం అనే కథ తెలిసే ఉంటుంది. ఆ చంద్రునికి పార్వతీదేవి శాపం ఇవ్వడం, ప్రాయశ్చిత్తంగా వినాయకచవితి రోజు మాత్రమే శాపాన్ని పరిమితం చేయడం కూడా తెలిసే ఉంటుంది. పండుగ, పండుగ వెనుక కథ విషయం పక్కన పెడితే వినాయకుడి రూపం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఎంతోమంది చెబుతూ ఉంటారు.
వినాయక స్వరూపాన్ని అందరికీ తెలిపే తాత్విక వివరణ ఇదీ...
వినాయకుని ఆకారం గురించి ఎన్నో చెబుతారు. ఆయన బొజ్జ, ఆయన తల, ఆయన తొండం, ఆయన దంతం, ఆయన వాహనం, ఆయన చేతిలో ఉండే ఆయుధాలు. వీటన్నింటిలో కూడా ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు.
వినాయకుని ఆకారం గురించి చెప్పుకుంటే దేవనాగరి లిపిలో "ఓం" ను పోలి ఉన్నట్టుగా చెబుతారు. "ఓం" ను అందరూ ప్రణవం అని పిలుస్తారు. ఇది చిత్రకారులను సంతోషపెట్టేవిషయం కావచ్చు. ఎందుకంటే చిత్రాకారులు తమ చిత్రకళలో ఓంకారంలో వినాయకుడిని చూపిస్తూ బోలెడు బొమ్మలు గీస్తారు. వాటికి లెక్కలేదని చెప్పవచ్చు. చాలామంది చిత్రాకారులు వినాయకుని బొమ్మలు గీయడంలో విశేషమైన ప్రతిభను ప్రదర్శిస్తారు.
ఇక వినాయకుని విశిష్టతను ఒకసారి పరిశీలిస్తే ఆయన తొండము "ఓం"కారానికి సంకేతమని చెబుతారు. ఓంకారమే అన్నిటికీ మూలం.
వినాయకుని తల మొదట అందరిలాగే ఉండేది. కానీ శివుడు ఆయన తలను ఖండించాక ఏనుగు తలను తెచ్చి పెట్టారు. ఈయన ఏనుగు తల జ్ఞానానికీ, యోగానికీ చిహ్నమట.
తల ఏనుగుదే కానీ శరీరం మాత్రం మానవులదే. ఈ మనిషి శరీరం మాయను సూచిస్తుంది. ఈ శరీరం ప్రకృతికి నిలయం. మనిషిలో ప్రకృతి, ప్రకృతిలో మనిషి అంతర్భాగం. అదే వినాయకుని శరీరంలో అంతరార్థం.
వినాయకుని చేతిలో పరశువు ఉంటుంది. ఇది మనిషిలో ఉన్న అజ్ఞానమును ఖండించడానికి సంకేతం.
వినాయకుని చేతిలో ఉండే పాశము వలనే అందరికీ అన్ని పనులలో విఘ్నాలు తొలగుతున్నాయి. ఎందుకంటే సకల విఘ్నాలను కట్టిపడేసే సాధనమే ఈ పాశము.
ఏకదంతం అని అందరూ ప్రార్థన చేసే వినాయకునికి మొదట ఉన్నది రెండు దంతములు. అయితే ఒక దంతం విరిగిపోవడం అందరికీ తెలిసినదే. ఈ విరిగిన దంతము త్యాగానికి చిహ్నము.
వినాయకుని దగ్గరుండే మాల జ్ఞాన సముపార్జనకు మూలం.
ఈయన చెవులు చాలా పెద్దవి. ఈ పెద్ద చెవుల వెనుక కూడా ఎంతో గొప్ప అంతరార్థం ఉంది. అదే మ్రొక్కులు వినే కరుణామయుడుగా వినాయకుడిని నిలబెట్టింది.
వినాయకుని పొట్టపై నాగ బంధము ఉంటుంది. ఈ నాగబంధం శక్తికి, కుండలినికి సంకేతము. దైవ ఉపాసనలో ఇది చాలా శక్తివంతమైనది.
ప్రతి ఒక దేవుడికి ఏదో ఒక జంతువు వాహనంగా ఉంటుంది. అలాగే వినాయకుడి వాహనం ఎలుక. అంత పెద్ద బొజ్జ గణపయ్యకు ఇంత చిన్న ఎలుక వాహనం చాలా వింతగా అనిపించినా దాని వెనుక ఉన్న అంతరార్థం చాలా గొప్పది. జ్ఞానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి అనే విషయాన్ని ఈ ఎలుక వాహనం నుండి తెలుసుకోవాలి.
ఇవీ వినాయకుని రూపంలో అందరూ తెలుసుకోవలసిన గొప్ప విషయాలు.
◆నిశ్శబ్ద.