వినాయక పత్రి పేర్లు వాటి వివరణ!

 

వినాయక పత్రి పేర్లు వాటి వివరణ!

వినాయకచవితి పండుగ మిగతా పండుగలకంటే చాలా ప్రత్యేకమైనది. విఘ్నాలు తొలగించే వినాయకుడు ఎప్పుడూ ప్రథమ పూజ అందుకుంటాడు. అలాంటి వినాయకుడిని ప్రతిష్టించి ప్రత్ర్యకంగా పూజ చేయడం అంటే ఎంతో పెద్ద సంబరం. వినాయకచవితిలో భాగంగా వినాయకుడిని విభిన్నంగా అందరూ పత్రితో పూజ చేస్తారు. ఈ పత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొందరు దొరికినవి ఏవో తెచ్చి సంప్రదాయం కోసం పూజను ఏదోలా కానిచ్చేస్తుంటారు. అయితే వినాయకచవితి పూజకు ఉపయోగించే పత్రి 21 రకాల మొక్కల నుండి సేకరించబడుతుంది. ఆ మొక్కలు ఏవి?? వాటి పేర్లు, వాటిని గుర్తుపట్టడం ఎలా అనే విషయాలు అందరికోసం.

వినాయ‌కుడిని వినాయక చవితి రోజు  ప‌త్రి పెట్టి పూజిస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల నమ్మకం ఆయనకు సమర్పించే 21 రకాల మొక్కల పేర్లు ఇవే……..

 మాచీ ప‌త్రం :-  మాచ ప‌త్రి అనేది తెలుగు పేరు. దీని ఆకులు చామంతి పువ్వు ఆకుల్లా ఉంటాయి. కానీ సువాస‌న వ‌స్తాయి. వీటిని వినాయకచవితి పూజలో తప్పనిసరిగా భాగం చేస్తారు. 

దూర్వా పత్రం:-  దుర్వా పత్రం అనగానే చాలామంది గుర్తుపట్టలేరు కానీ గరిక అనగానే గుర్తుపడతారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒక‌టి తెల్ల గరిక, మ‌రొక‌టి నల్ల గరిక. ఇవి గడ్డిజాతికి చెందిన‌ మొక్కలు. వినాయకుడికి గ‌రిక అంటే ఎంతో ఇష్టం.

ఆపామార్గ ప‌త్రం :-  దీన్ని కూడా ఇలా పిలవగానే గుర్తుపట్టలేరు. కానీ ఉత్త‌రేణి అని అంటే ఆయుర్వేదం పరిచయం ఉన్నవారు గుర్తుపడతారు. దీనిఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజ‌లు ముళ్ల‌ను క‌లిగి ఉంటాయి. ఆయుర్వేదంలో ఉత్తరేణికి చాలా ప్రాధాన్యత ఉంది.

బృహ‌తీ ప‌త్రం :-  ఈ పత్రాన్ని ముల‌క అని పిలుస్తారు.  ఇందులో రెండు ర‌కాలుంటాయి. ఒక‌టి చిన్న ముల‌క, రెండోది పెద్ద ముల‌క‌. ఈ ఆకులు వంకాయ ఆకుల త‌ర‌హాలో తెల్ల‌ని చార‌ల‌తో గుండ్ర‌ని పండ్ల‌తో కనిపిస్తాయి.

దుత్తూర పత్రం:-  ఉమ్మెత్త‌నే దుత్తూర ప‌త్రం అంటారు. ఇది వంకాయ జాతికి చెందిన మొక్క‌. ముళ్లు ఉంటాయి. వంకాయ రంగు పూలు పూస్తాయి. అందరికీ ఉమ్మెత్త పువ్వు గురించి సైన్స్ పాఠంలో పరిచయం ఉండనే ఉంటుంది.

తుల‌సి :- దీని గురించి తెలియనిది ఎవరికి. సాక్షాత్తు విష్ణుమూర్తి భార్యనే తులసిగా భావిస్తారు, మహాలక్ష్మి తుల‌సిలో కొలువై ఉంటుందని నమ్మకం కూడా.  మ‌హిళ‌లు నిత్యం తుల‌సి మొక్క‌కు పూజ‌లు చేస్తారు. ఇవే మొక్క ఆకులను వినాయ‌కుడి ప‌త్రిలోనూ వాడుతారు.

బిల్వ ప‌త్రం :- శివ నామ స్మరణ చేసే ప్రతి ఒక్కరికీ బిల్వపత్రం గురించి తెలిసి ఉంటుంది.  మారేడు ఆకునే బిల్వ ప‌త్రం అంటారు. ఇవి మూడు ఆకులు ఒక ఆకుగానే ఉంటాయి. శివుడికి బిల్వ పత్రాలు చాలా ఇష్టం. వినాయకుడి తండ్రి అయిన పరమేశ్వరుడి ఇష్టమైన ఈ ఆకులను  వినాయకుడి పూజ‌లో వాడుతారు.

బ‌ద‌రీ ప‌త్రం :- అందరికీ వెంటనే గుర్తురాకపోవచ్చు కానీ రేగు చెట్టు అనగానే అందరికీ గుర్తొస్తుంది. రేగు చెట్టు ఆకులు పత్రిలో భాగం. 

చూత ప‌త్రం :-  మామిడి చెట్టు ఆకును చూత ప‌త్రం అంటారు. ఈ మామిడాకులు ప్రతి శుభకార్యంలో ఇండ్ల‌కు తోర‌ణాలు క‌ట్టడం కోసం ఉపయోగిస్తారు. అయితే వినాయకచవితి పూజలో భాగం చేస్తారు ఇక్కడ. 

కరవీర పత్రం :-  ప్రతి ఇంటి పెరటిలో పెంచుకునే గన్నేరు చెట్టు గురించి అందరికీ తెలిసినదే. గ‌న్నేరు ఆకుల‌నే క‌ర‌వీర ప‌త్రాలు అంటారు. ఇవి తెలుపు, ఎరుపు, ప‌సుపు రంగు పూల‌ను పూస్తాయి.

మ‌రువ‌క ప‌త్రం :- దీన్ని ధ‌వ‌నం, మ‌రువం అని పిలుస్తారు.  పూలను దండగే కట్టేటప్పుడు మధ్యలో ఈ ఆకులను చేర్చి కడితే మరింత అందంగా, మరెంతో సువాసనను వెదజల్లుతాయి. మరువక పత్రాలు ఎంతో మంచి సువాసనను  క‌లిగి ఉంటాయి.

శ‌మీ ప‌త్రం :- ప్రతి గుడిలో జమ్మివృక్షం ఉంటుంది. జ‌మ్మి చెట్టు ఆకును శ‌మీ ప‌త్రం అంటారు. ద‌స‌రా స‌మ‌యంలో ఈ చెట్టుకు ప్రత్యేకపూజలు చేస్తారు.  ఈ మొక్క ఆకుల‌ను వినాయ‌కుడి ప‌త్రిలోనూ ఉంచుతారు.

విష్ణుక్రాంత పత్రం :- ఈ మొక్క‌కు నీలం, తెలుపు రంగు పూలు పూస్తాయి. కొందరు దీన్ని ఆయుర్వేద ఔషధం తయారుచేయడానికి వాడతారు. 

సింధువార పత్రం :- దీన్ని వావిలి ఆకు అని కూడా పిలుస్తారు.  వాత రోగాలను తగ్గించే అద్భుత ఔషధం ఇది. వినాయకపూజలో వావిలికి స్థానం ఉంది. 

అశ్వత్థ పత్రం :- రావి ఆకుల‌ను అశ్వ‌త్థ ప‌త్రం అని అంటారు. సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పిలుస్తారు భగవద్గీతలో కృష్ణుడు.  రావి చెట్టుకు పూజ‌లు చేసిన‌ట్లుగానే దాని ఆకుల‌ను గ‌ణేషుడి పూజ కోసం ఉప‌యోగిస్తారు.

 దాడిమీ పత్రం  :-  ఎన్నో ఆరోగ్యాలు చేకూర్చే దానిమ్మ అందరికీ తెలుసు. దానిమ్మ చెట్టు ఆకును దాడిమీ ప‌త్రం అంటారు. 

 జాజి పత్రం :- మ‌ల్లె పువ్వు జాతికి చెందిన‌ మొక్క స‌న్న‌జాజి. ఈ జాజి  మొక్క ఆకుల‌ను వినాయకుడి పూజ‌కు వాడుతారు.

 అర్జున పత్రం :- మ‌ద్ది చెట్టు ఆకుల‌ను అర్జున ప‌త్రం అని పిలుస్తారు. ఇవి మ‌ర్రి ఆకుల మాదిరిగా ఉంటాయి. ఈ వృక్షాలు ఎక్కువ‌గా అడ‌వుల్లో పెరుగుతాయి. 

దేవదారు పత్రం :- దేవ‌దారు చెట్ల గురించి ప్రాచీన కవులు ఎంతో గొప్ప వర్ణనలు చేస్తూ ఎన్నో గొప్ప కావ్యాలు రచించారు. ఎస్ దేవదారు చెట్లు ఎత్తుగా పెరుగుతాయి. ఈ చెట్టు దేవ‌త‌ల‌కు ఎంతో ఇష్టం. ఆ చెట్టు ఆకుల‌ను వినాయ‌కుడి ప‌త్రిలో ఉప‌యోగిస్తారు.

గండకీ పత్రం :- ఈ మొక్క తీగ జాతికి చెందిన‌ది. గ‌డ్డిలా ఉంటుంది. దీన్ని ల‌తాదూర్వా మొక్క అని కూడా అంటారు. ఈ ఆకుల‌ను వినాయ‌కుడి పూజ‌లో వాడుతారు.

అర్క పత్రం :- జిల్లేడు మొక్క ఆకుల‌ను అర్క ప‌త్రాలు అంటారు. వినాయకుడు జిల్లేడు చెట్టులో కొలువై ఉంటాడని చెబుతారు. అటువంటి తెల్లజిల్లేడు మొక్క ఆకుల‌ను వినాయ‌కుడి ప‌త్రిలో ఉంచుతారు. 

భాద్రపదమాసంలో వానలు పడుతూ, ఎక్కడికక్కడ చిత్తడిగా, బురదగా ఉంటుంది. జ్వరాలు వ్యాపించి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వినాయక పత్రి వల్ల ఎన్నో ఔషధ మొక్కలు ఇంట్లోకి వచ్చినట్టు అవుతాయి. వినాయక విగ్రహాన్ని తొమ్మిది రోజులు ఉంచకపోయినా పూజచేసిన పత్రిని మాత్రం తొమ్మిదిరోజులు ఉంచుకోవాలి. దానివల్ల మనం పీల్చే గాలి ఔషద గుణాలు నిండి ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. 

                                       ◆నిశ్శబ్ద.