Pareekshittu
పరీక్షిత్తు
Pareekshittu
పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్ధామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించినప్పుడు, ఆ అస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తును బాధించింది.
గర్భస్థ శిశువు వల్ల కలిగిన బాధకు తాళలేక ఉత్తర శ్రీ కృష్ణుని ప్రార్థించినప్పుడు, అతడు పరీక్షిత్తును కాపాడాడు. గర్భంలో తనకు కనిపించిన దైవము ( శ్రీకృష్ణుడు) లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఇతనికి పరీక్షిత్తు అని పేరు వచ్చింది.
ఉత్తరుని కుమార్తె ఐరావతిని పరీక్షిత్తు వివాహమాడాడు. ఒకసారి ఇతడు వేటకు వెళ్ళి, ఒక మృగాన్ని వేటాడుతూ ఒక ముని ఆశ్రమానికి చేరతాడు. అక్కడ తపస్సమాధిలో ఉన్న మునిని చూసి, తను వెన్నాడి వచ్చిన మృగమేదని అడుగుతాడు.
తపస్సులో ఉన్న ఆ ముని సమాధానం ఇవ్వకపోవడంతో కోపించిన పరీక్షిత్తు, అక్కడ చచ్చి పడి ఉన్న పాము కళేబరాన్ని ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి ముని కుమారుడు వచ్చి, తన తండ్రి మెడలో పాము కళేబరం ఉండటం చూసి, ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో పామువల్ల మరణిస్తాడు. అని శపిస్తాడు.
చివరకు తపస్సులో ఉన్న ముని జరిగింది తెలుసుకుని, పరీక్షిత్తు వద్దకు వెళ్ళి, తన కుమారుడిచ్చిన శాపం గురించి చెబుతాడు. పాము వల్ల తనకు మరణం సంభవిస్తుందని తెలుసుకున్న పరీక్షిత్తు, ఒక దుర్భేద్యమైన గృహంలో ఉండిపోతాడు.
ఏడవరోజు పాములు మానవరూపంలో వచ్చి, పరీక్షిత్తుకు పండ్లు ఇస్తారు. అందులోని ఒక పండులో ఉన్న తక్షకుడు అనే పాము బయటకు వచ్చి పరీక్షిత్తును కాటు వేయడంతో అతను మరణిస్తాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు.