మహా పరాక్రమశాలి హనుమంతుడు

 

మహా పరాక్రమశాలి హనుమంతుడు

లంక రాజభవనంలో మహా పరాక్రమశాలి, రామబంటు అయిన హనుమంతుని అవమానపరిచాడు మకరధ్వజుడు. రాజు గురించి ఆచూకీ అడిగినప్పుడు, "ఈరోజు ఎవరినో బలిచేయదలచాడు, ఎవరినీ లోనికి రానీయవద్దని చెప్పి నన్ను కాపలాగా ఉంచాడు" అన్నాడు మకరధ్వజుడు దురుసుగా. మకరధ్వజుని నిర్లక్ష్య వైఖరి, మాటతీరు నచ్చకపోవడంతో హనుమంతుడు కోపోద్రిక్తుడయ్యాడు. దాంతో హనుమంతునికి, మకరధ్వజునికి యుద్ధము జరిగింది.

హనుమంతుడు, మకరధ్వజుడు ఇద్దరికిద్దరూ ఘనులే, మహా బలసంపన్నులే. అయితేనేం, హనుమంతుని శక్తి ముందు ఎంతటివారైనా పరాజితులు కావలసిందే. హనుమంతుడు ఒక్క దెబ్బతో మకరధ్వజుని పడగొట్టి, తన వాలముతోనే బంధించి భవనములో ప్రవేశించాడు. హనుమంతుని పాద స్పర్శతో దేవీ విగ్రహము భూమిలోనికి దిగబడి పోయింది. ఆ విగ్రహ స్థానములో హనుమంతుడు నోరు విశాలముగా తెరిచి నిలబడ్డాడు.

దేవి ప్రసన్నరూపం దాల్చి, సాక్షాత్కరించింది. రాక్షసులు గొప్ప ఆరాధనాభావంతో చక్కగా పూజలు చేశారు. అన్న, వస్త్ర, ఫల పుష్పాదులు ఎన్ని సమర్పించినా కూడా, దేవి వాటిని అన్నిటినీ ఆరగించి వేస్తున్నది. ఇక బలి సమయం ఆసన్నమైంది. ఆసరికి రాక్షసులు, రామలక్ష్మణులను తీసుకొచ్చారు.

రాక్షసులు రామలక్ష్మణులను ఆటబొమ్మలుగా చూస్తూ వినోదంగా భావించారు. రామలక్ష్మణులను హింసిస్తూ తీసుకుని వస్తున్నారు.

''ఇక మీరు మీ ఇష్ట దేవతను స్మరించుకోండి”- అని అహిరావణుడు వ్యంగ్యంగా అన్నపుడు, రాముడు - “ముందు నీ సంగతి నువ్వు చూసుకో... దేవి నిన్ను భక్షించకుండా ప్రార్థించుకో'' అన్నాడు.

దాంతో అహిరావణుడు క్రోధతామ్రాక్షుడై వారిని వధించ కరవాలాన్ని ఎత్తేసరికి భూనభోంతరములు దద్దరిల్లేటట్లు గర్జించి, హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజస్కందములపై ఎక్కించుకుని, ఆ రాక్షసుని చేతిలోని కరవాలాన్ని లాక్కున్నాడు.

అహిరావణుని అనుచరులతో సహా అంతమొందించి సురక్షితముగా లంకలోని వానర శిబిరాన్ని చేరుకున్నాడు. రామలక్ష్మణ సహితముగా మరలి వచ్చిన హనుమంతుని చూసి ఆనందోత్సాహం కట్టలు తెంచుకుంది. జయ జయధ్వనులు దశదిశలా ప్రతిధ్వనించాయి.

హనుమంతుడు నిరంతరము రామకార్యమందే నిమగ్నుడై ఉండసాగాడు. రాత్రీపగలు తేడా లేకుండా ఎల్లవేళలా రాముని ధ్యాసలోనే ఉండేవాడు. ఏ పని చేస్తున్నా రాముని ధ్యానం మాత్రం మరచేవాడు కాదు. దూరముగా నిలబడి ఉన్నా, యుద్ధము చేస్తూ ఉన్నా మరేం చేస్తున్నా నిత్యము శ్రీరామ సందర్శనముతో ఆనందాన్ని సొంతం చేసుకుంటూ ఉండేవాడు.

హనుమంతుడు రాత్రులందు శ్రీరామ చరణారవిందములను శ్రద్ధాభక్తులతో ఒత్తుతుండేవాడు. దానితో అతను పడిన శ్రమ అంతా మటుమాయమయ్యేది. రామచంద్రుడు నిదురించేటప్పుడు ఆంజనేయుడు తన వాలమును పెంచి ఉన్నతాసనమును తయారుచేసుకుని సింహద్వారము దగ్గర కూర్చునేవాడు.

రాత్రి మొత్తం రామునికి కాపలాగా ఉండటం, తూర్పున వెలుగురేఖలు విచ్చుకోవడం ఆరంభించగానే రణరంగమునకు పోవడం హనుమంతుని దినచర్యగా మారింది. విపత్కరకార్యం ఏది వచ్చినా సుగ్రీవాంగద జాంబవంతాదులు హనుమంతునే శరణు వేడుకునేవారు. అదీ హనుమంతుని పరాక్రమం.