Read more!

శివుడి పంచ బ్రహ్మా అవతారములు

 

శివుడి పంచ బ్రహ్మా అవతారములు

 

సాదారణంగా అందరి దేవుళ్ళకు ఎన్నో అవతారాలు ఉంటాయి. విష్ణువు దశావతారాలు ఎత్తినట్టు శివుడు కూడా పంచ బ్రహ్మావతారాలు ఎత్తాడు. అయితే వాటి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఆ అవతాలు ఏమిటంటే...

 శివుని యొక్క మొట్టమొదటి అవతారం పందొమ్మిదవ శ్వేత లోహిత కల్పంలో జరిగింది. అప్పట్లో బ్రహ్మ ధ్యానంలో వుండగా ఎరుపు- తెలుపు -నలుపు రంగులతో కలిసి ప్రకాశిస్తున్న కుమారుడుగా ఆవిర్భవించాడు శివుడు. ధ్యాన ఫలంగా అప్పటికప్పుడు పుట్టడం వల్ల ఆ అవతారాన్నే సద్యోజాత బ్రహ్మావతారం అన్నారు. ఆయన నుంచి - నందనోపనంద సునంద విశ్వనందులనే నలుగురు శ్వేతవర్ణులు శిష్యులుగా ఉదయించారు. సద్యోజాతుడు బ్రహ్మకు సృష్టి గురించి తెలివికలిగేలా  చెప్పి శివజ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేసేందుకు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.  

ఆ తర్వాత యిరవయ్యవ రక్తకల్పంలో ఎర్రరంగుతో కూడిన బ్రహ్మ, శివుణ్ణి ప్రార్ధిస్తూండగా  కలిగినది వామదేవావతారం. ఈ వామదేవుడితో పాటు విరజ, వివాహ, విశోద, విశ్వభావనులు అనే నలుగురు శిష్యులు కూడా కలిగారు. ఆ వామ దేవుడే బ్రహ్మకు ప్రపంచాన్ని పుట్టించే శక్తిని ప్రసాదించి ఆ తరువాత మాయమైపోయాడు..

పీతవాసం అనే యిరవయ్యొకటో కల్పంలో శివుడు తత్పురుష బ్రహ్మగా పీతాంబరధారియై అవతరించాడు. ఆ అవతారంలో బ్రహ్మకు సృష్టిలో సామర్థ్యాన్ని కలిగేలా అనుగ్రహం కలిగించి ఆ తయువత మాయమైపోయాడు.  అప్పుడు అతనికి పీత వస్త్రధారులైన దివ్య కుమారులు అనేకమంది యోగమార్గాన్ని ప్రచారం చేసే వారు జన్మించినారు. 

ఆ తర్వాత శివకల్పంలో నల్లరంగు శరీరంలో నల్లబట్టలూ నల్ల పూలమాలికలూ, నల్లటి జందెమూ, నల్లకిరీటం ధరించి అఘోర బ్రహ్మగా ఆవిర్భవించాడు శివుడు. కృష్ణ, కృష్ణాస్య, కృష్ణశిఖ, కృష్ణ కంఠధరులు నలుగురూ ఆ అవతారంలో ఆయన శిష్యులు, అప్పటికి బ్రహ్మకు పరిపూర్ణ సృష్టి సామర్థ్యాలను సమకూర్చారు. ఆ తరువాత వెళ్లిపోయారు.  

అయిదవది ఈశానావతారం, విశ్వరూపకల్పంలో బ్రహ్మ సృష్టికారక పురుషుణ్ణి పొందగోరి శివధ్యానం చేస్తుండగా ఒక మహానాదం ఆవిర్భవించింది. ఆ నాదంలోంచే శుద్ధ స్ఫటిక వర్ణాస్యుడు - సర్వభూషణ భూషితుడు అయిన ఒక పురుషుడు పుట్టాడు. ఆయనే ఈశానుడు. ఈ యీశానుడే బ్రహ్మకు సృష్టియొక్క క్రమాన్ని ప్రసాదించాడు. జటి, ముండి, శిఖండి, అర్ధముండి ఈశానుడి శిష్యులు. 

ఇలా శివుడి అయిదు అవతారాలు బ్రహ్మకు ఈ సృష్టి ఆవిర్భవానికి, దానికి కావలసిన శక్తిని, యుక్తిని, మార్గాలను అన్నిటినీ భోదించాయి. 

ఈ పై అయిదు అవతారాలే పంచబ్రహ్మావతారాలు, వీరిలో ఈశానుడు ముఖ్యుడు. జీవుణ్ణి అధిష్ఠించి వుండే వాడు ఈయనే. ఈయన తత్పురుషుడు. సత్త్వ, రజో, తమో గుణాలను ఆధీనంలో ఉంచుకుని వాటిలో నివసించేవాడు.  అఘోరుడు బుద్ధి తత్వవాసి. వామదేవుడు అహంకారాన్ని, సద్యోజాతుడు మనస్సునీ ఆవహించి వుంటారు. 

◆ వెంకటేష్ పువ్వాడ