శ్రీ పళ్ళికొండేశ్వరాలయం

 

 

శ్రీ పళ్ళికొండేశ్వరాలయం

 


                                                                                             

శివరాత్రి సందర్భంగా మనం ఒక ప్రత్యేక శివాలయం గురించి చెప్పుకోవాలికదా.  అందుకే ఈ ఆలయం గురించి.  మీరు కొన్ని ఆలయాలలో శ్రీ మహావిష్ణువుని పడుకున్న రూపంలో దర్శించి వుండవచ్చు.  కానీ శివుణ్ణీ ఎప్పుడన్నా అలా చూశారా!?  మహా శివుడి దర్శనం సాధారణంగా లింగ రూపంలోనే అవుతుంది.  కాకపోతే కొన్ని చోట్ల విగ్రహాలు వుండవచ్చు.  కానీ పడుకున్న శివుడు ఎక్కడుంటాడు అంటున్నారు కదూ!!?  ఇలాంటి అపురూప ఆలయం కనుకే మహా శివరాత్రి ప్రత్యేక కానుక. ఈ ఆలయం చిత్తూరు జిల్లా సురుటిపల్లిలో వున్నది.  ఇందులో అనేక విశేషాలున్నాయండీ.  ముందుగా స్ధల పురాణం తెలుసుకోవాలికదా.

 


క్షీర సాగర మధనం కధ మీకు తెలిసినదేకదా.  అందుకని ఆ కధంతా ఇప్పుడు చెప్పనుగానీ, ఆ మధనం సమయంలో హాలాహలం  సముద్రంలోంచి ఉద్భవించిందని చెబుతారుకదా. ఆ  విషానికి హాలాహలం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?  మందర పర్వతానికి తాడులా కట్టిన వాసుకి నొప్పి భరించలేక బాధతో హాలం అనే విషాన్ని కక్కింది.  అప్పుడే సముద్రంలోంచి హలం అనే విషం బయల్దేరింది.  ఇవి రెండూ కలిసి హాలాహలం అయింది.  సరే .. ఆ విషాన్ని చూసి దేవతలు భయపడటం, ఈశ్వరుని ప్రార్ధించటం, ఆ పరమేశ్వరుడు ప్రపంచాన్ని రక్షించటానికి ఆ విషాన్ని స్వీకరించటం, పార్వతీమాత అడ్డుకోవటంవల్ల విషాన్ని కంఠంలోనే నిలిపి గరళకంఠుడవ్వటంకూడా మీకు తెలుసు.     ఆ విధముగా గరళమును స్వీకరించి సకల జగత్తును కాపాడిన రోజు శనివారం, త్రయోదశి ప్రదోష సమయంలో.  ఆ సంతోష (జగత్తుని కాపాడిన సంతోషం) సమయాన శివుడు నందీశ్వరుని రెండు కొమ్ములమధ్య ఆనంద తాండవమాడాడు.  అందుకే ప్రదోష సమయంలో నందీశ్వరునికి నమస్కరిస్తే శివుని దయను పొందవచ్చు.


విషపానం తర్వాత గౌరీదేవితో కలసి కైలాసానికి బయల్దేరాడు పరమశివుడు.  మార్గంలో ఈ సురుటపల్లికి వచ్చేటప్పటికి,  కైలాసనాధుడు విషం వల్ల కొద్దిగా కళ్ళు తిరిగినట్లవటంతో లోక మాత ఒడిలో తలపెట్టుకుని విశ్రాంతి తీసుకున్నాడు.  సకల జీవులకు సర్వ మంగళాలని ప్రసాదించే జగజ్జనని ఇక్కడ సర్వ మంగళగా పిలువబడుతోంది.  పడుకున్న ఈశ్వరుడుగనుక స్వామి పళ్ళికొండేశ్వరుడుగా ప్రసిధ్ధి చెందాడు.


మరి ఈ ఆలయంలో అనేక విశేషాలున్నాయన్నానుకదా.  వాటిని చూద్దామా శివుడు అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని శయనించినట్లు దర్శనమిచ్చేది ప్రపంచంలో బహుశా ఇక్కడ ఒక్క చోటే.  19 అడుగుల పొడుగున, సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని వున్న ఈ శయన శివుడు, అమ్మవారు అత్యద్భుతమైన సౌందర్యంతో విలసిల్లుతుంటారు.  చుట్టూ విష్ణు, బ్రహ్మ, నారదుడు, సూర్య చంద్రులు, ఇంద్రుడు, తుంబురుడు, భృగు మహర్షి, మార్కండేయుడు, కుబేరుడు, అగస్త్యుడు, పులస్త్యుడు, గౌతముడు, వాల్మీకి, విశ్వామిత్రుడు వీరికి నమస్కరిస్తూవున్నారు.  ఈ మూర్తులను వాల్మీకేశ్వరాలయం పక్కనే వున్న ప్రత్యేక ఆలయంలో దర్శించవచ్చు. ఈ ఆలయంలో ముందు మరగతాంబికను, వాల్మీకేశ్వరులను దర్శించాక శయన శివుని దర్శించాలంటారు.

 


ఇక్కడ హాలాహలంనుంచి సకల భువనాలనూ రక్షించాక, శివుడు ప్రదోష  సమయంలో నందీశ్వరుని కొమ్ముల నడుమ ఆనంద తాండవం చేశాడు కనుక ఇక్కడ ప్రదోష పూజకు చాలా విశిష్టత వున్నది. అసలు ప్రదోష సమయంలో పూజలు ముందు ఇక్కడే ప్రారంభం అయి తర్వాత మిగతా శివాలయాలకు విస్తరించాయంటారు.  ఆ సమయంలో నందీశ్వరునికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆయనకీ అభిషేకం జరగటం ఇక్కడి విశేషం. 1971 సంవత్సరం, కార్తీక మాసంలో కంచి మఠాధిపతి, శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఒక్క రోజుకోసం ఈ గుడికి వచ్చి 30 రోజులు వున్నారుట.  ఆ సమయంలో ఈ ఆలయంలో చెల్లా చెదురుగావున్న కొన్ని అపురూప శిల్పాలను ప్రతిష్ట చేయించి  ఆలయ శోభను మరింత పెంచారు.  స్వామివారు వచ్చిన దగ్గరనుంచి ఇక్కడికి భక్తుల రాక ఎక్కువయింది. ఈ ఆలయంలో పలు దేవతా మూర్తులు పత్నీ సమేతంగా వుండటంకూడా విశేషమే.  అందువల్ల ఈ దేవతా మూర్తులను దర్శిస్తే కుటుంబమంతటికీ మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.  

 


ఇక్కడ శయన శివుడేకాక ఇంకా ఆలయాలు, ఉపాలయాలు, అనేక సుందర విగ్రహాలు వున్నాయి.  వాటి విశేషాలు చూద్దాం.... ఆలయానికి ఇరుప్రక్కలా శంఖనిధి, పద్మనిధి తమ భార్యలతో వుంటారు.  ఇది అరుదు.  ఇక్కడ అమ్మవారు మరగతాంబిక.   అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణగా వస్తుంటే  ఆలయం బయట గోడకి .. ద్వారానికి కుడివైపు (మనకి ఎడమవైపు) సాలిగ్రామ గణపతి, ఎడమవైపు శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి  వుంటారు.  లోపలకి వెళ్ళగానే ఎదురుగా శ్రీ మరగదాంబిక అత్యంత సుందర రూపంలో ..   భక్తులనుబ్రోచే ఆ తల్లికి కుడివైపున కల్పవృక్షము, ఎడమవైపు కామధేనువు విలసిల్లుతున్నాయి.


మరగతాంబిక ప్రక్కన వాల్మీకేశ్వరుని ఆలయం వున్నది.  ఇక్కడ వాల్మీక ఋషి రామాయణం రాసేముందు శ్రీ రామలింగేశ్వరుని ప్రతిష్టించాలనుకున్నారు. కానీ  సరిగ్గా కుదరనందువల్ల తపస్సు చేసి ఈశ్వరుని ప్రసన్నం చేసుకున్నారు. ఈశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. వాల్మీకి ఋషి తపస్సు వల్ల వెలిసిన ఈశ్వరుడు వాల్మీకేశ్వరుడయ్యాడు.  ఈ స్వయంభూ లింగం త్రికోణాకార ఫలకం మీద ముందుకు శివ లింగం వున్నట్లు వుంటుంది.  ఈ విశేష లింగాన్ని విశేషంగా ఏం కోరుకున్నా నెరవేరుతుందంటారు.


వాల్మీకేశ్వరాలయం గర్భగుడి గోడకి వెలుపలవైపు వున్న అద్భుత విగ్రహం, మరెక్కడా చూడలేనిది దక్షిణామూర్తి.  ఇక్కడ స్వామి వటవృక్షం కింద వుండడు.  వృషభారూఢుడై వుంటాడు.  జటాజూటం, గంగ, పులి చర్మం, నాగాభరణం కూడా వుంటాయి.  అంతేకాదు అమ్మ గౌరి వెనకనుంచి స్వామిని కౌగలించుకుని వుంటుంది.  ఈ దంపతి సమేత దక్షిణామూర్తిని దర్శించి సేవిస్తే జ్ఞానం, చదువు, పెళ్ళి, పిల్లలు, మాంగల్య భాగ్యం మొదలగు సకల సన్మంగళాలు జరుగుతాయని నమ్మకం.
ఈ ఆలయాల చుట్టూ కనిపించే అద్భుతమైన విగ్రహాలు ఏకపాద మూర్తి ..  ఒక పాదం మీద నుంచున్న త్రిమూర్తుల ఆకారాలు స్పష్టంగా ఒకే రాతిలో చెక్కబడ్డాయి.  వారి రెండో పాదం కింద వారి వారి వాహనాలు వున్నాయి.  మధ్యలో శివుడు, అటూ ఇటూ బ్రహ్మ, విష్ణులు.


జ్వరహర మూర్తి .. దేవతలకు వచ్చిన శూలై అనే జ్వరమును తగ్గించేందుకు శివుడు ఎత్తిన అవతారమే జ్వరహర మూర్తి.  ఈ మూర్తి చేతిలో అగ్ని, మూడు తలలు, మూడు కాళ్ళు, మూడు చేతులతో వుంటుంది.  ఈ జ్వర హర మూర్తికి పాలాభిషేకం చేయిస్తే ఎలాంటి విష జ్వరాలయినా, చిన్న పిల్లలకి వచ్చే ఎలాంటి రుగ్మతలయినా పోతాయంటారు. విష్ణు భైరవుడు ..  కపాలం పట్టుకున్న విష్ణు విగ్రహం అరుదు.  ముందు ఈ విగ్రహం ఇక్కడ లేదు.  శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఇక్కడ వున్నప్పుడు ఈ మూర్తిని గుర్తించి, భక్తుల సందర్శనంకోసం ఇక్కడ ప్రతిష్టింపచేశారు. మణికంఠుడుకి పెళ్ళి కాలేదని చాలామంది అభిప్రాయం.  ఇక్కడ ఈ స్వామి తన భార్యలు పూర్ణ, పుష్కలలతో దర్శనమిస్తారు.  అలాగే ఇంకొక విగ్రహం గజవాహనం పై అయ్యప్ప.

 


వల్లీ దేవసేనా సమేతుడై దక్షిణ ముఖంగా వున్న సుబ్రహ్మణ్యస్వామిని కూడా ఇక్కడ దర్శించవచ్చు.  దక్షిణ ముఖంగా వున్న సుబ్రహ్మణ్యస్వామి తిరు చందూరులో మాత్రమే దర్శనమిస్తాడంటారు.  యమగండం, రాహు దోష సమస్యలు, ఋణ బాధలు వున్నవారు ఈ స్వామిని సేవిస్తే వారి బాధలు తొలగి పోతాయంటారు. అలాగే లవ కుశుల పాదాలు, రాజమాతంగి, చేతిలో చిలుకతో విష్ణు దుర్గ, వాహనాలతో సహా సప్త మాతృకలు, భూ వరాహ స్వామి,  వగైరా అనేక శిల్పాలను చూడవచ్చు.


ఇన్ని అద్భుతాలున్న ఈ ఆలయ సందర్శన వేళలు ఉదయం 6 గం. లనుంచి మధ్యాహ్నం 1 గం. వరకు, తిరిగి సాయంత్రం 3-30 గం. లనుంచి రాత్రి 8 గం.ల వరకు.  ప్రతిరోజూ ప్రదోష సమయం సాయంత్రం 4 గం. ల నుంచి 6-30 గం. ల వరకు.  త్రయోదశి రోజుల్లో  ప్రదోష వేళల్లో విశేష పూజలు జరుగుతాయి.


ఇన్ని విశేషాలు చదివేసరికి ప్రయాణానికి సిధ్ధమయ్యారు కదూ... ఇదిగో మార్గం…


తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులో చిత్తూరు జిల్లాలో వున్న సురుటిపల్లి అనే చిన్న గ్రామంలో వున్నది శ్రీ పళ్ళికొండేశ్వరాలయం.  పుత్తూరునుంచి చెన్నై వెళ్ళే బస్సులన్నీ సురుటిపల్లిలో ఆగుతాయి.  చిన్న గ్రామం కావటంవల్ల ఇక్కడ సదుపాయాలుండవు.  


అక్కడదాకా వెళ్ళినవారు అక్కడికి 12 కి.మీ. ల దూరంలో వున్న నాగలాపురంలోని వేదనారాయణస్వామి   ఆలయం తప్పక చూడండి.

 

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)