Read more!

ప్రత్యేక దినాల్లో - పాదరస శివలింగ పూజ

 

ఈరోజు ఉగాది కదండీ. ఈ ప్రత్యేక పర్వదినాన పాదరస శివలింగ రూపాన్ని ధ్యానించడం వల్ల మరింత పుణ్యం వస్తుంది. పిలిస్తే పలుకుతాడు బోళా శంకరుడు! భక్తుల్ని కనికరించి కష్టాల నుండి విముక్తి కలిగిస్తాడు. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు.

పాదరస శివలింగం మహా దివ్యమైంది, శక్తివంతమైంది. పాదరస సదాశివ వీరాంజనేయ శివ లింగం నెల్లూరు జిల్లా, నరసింహపురంలో ఉంది. ఈ పాదరస సదాశివ వీరాంజనేయ శివ లింగాన్ని దర్శించుకున్నవారికి సర్వ శుభాలూ చేకూరుతాయి.

నెల్లూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాదరస సదాశివ వీరాంజనేయ శివ లింగాన్ని చూసేందుకు బస్ మార్గం ఉంది. పాదరస శివ రూపాన్ని శాస్త్ర యుక్తంగా, మంత్రాలతో ధ్యాన, ఆవాహనాది విధి విధానయుక్తంగా పూజించాలి. అలా పూజించే వారి ఇళ్ళలో దేనికీ లోటు ఉండదు.

పాదరస శివ లింగ రూపాన్నిరోజూ ప్రార్ధించడమే కాకుండా పండుగ దినాల్లో పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. అన్నిరకాలుగా శ్రేయస్సు కలుగుతుంది. ప్రతినెలా ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి రోజుల్లో పాదరస ఈశ్వరుని కొలిచినవారికి మనోభీష్టాలు నెరవేరుతాయి. అక్షయతృతీయ నాడు పాదరస ఈశ్వరుని ఆరాధించినవారికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయి.

కార్తీకమాసం శివుడికి ఇష్టమైన నెల. ఆ నెలరోజులూ పారదర్శక లింగాన్ని అర్చిస్తే, మహద్భాగ్యం కలుగుతుంది. మహాశివరాత్రి నాడు పాదరస శివలింగాన్ని పూజించినట్లయితే ఎంతో పుణ్యం వస్తుంది. పాదరస శివ రూపాన్నినిత్యం పూజిస్తూ విశిష్ట పర్వదినాల్లో ప్రత్యేకంగా కొలిచి సుఖసంతోషాలను, సర్వ సంపదలను సొంతం చేసుకోవచ్చు.