దక్షుడు మహాశివుని ఎందుకు శపించాడు ?
అల్లుడైన పరమేశ్వరుడు తనకు కాస్తయినా పెద్దరికం చూపకపోవడం, గౌరవించకపోవడం దక్షునికి కోపం తెప్పించింది. ఆవేశంతో రగిలిపోయాడు. ‘ఎందరో మహానుభావులు తనను గౌరవిస్తారు. అలాంటిది ఈ పేదవాడు, బికారి, స్మశానంలో తిరిగే బైరాగికి ఇంత గర్వమా, పొగరా?’ అంటూ దక్షుడు ఆశర్యపోయాడు. ఆందోళన చెందాడు.
అల్లుడు తనను పట్టించుకోకపోవడంవల్ల అందరిముందూ పరువు పోయినట్లు అయింది. ఇలాంటివాడిని నమ్మి తన కూతురితో పెళ్ళి జరిపించానే అని బాధేసింది. ‘స్వతహాగా తెలివి లేకున్నా ఇతరులను చూసి అయినా నేర్చుకోలేడా’- అని పళ్ళు నూరుకున్నాడు.
‘పశువునెక్కి తిరుగుతూ పశువులానే ప్రవర్తిసున్నాడు’ అని చిరాకు పడ్డాడు. ఇవన్నీ లోపల అనుకుని ఊరుకోలేదు. ఆవేశం అదుపు తప్పి మాటలు తూటాల్లా బయటికొచ్చాయి. మామగారు దక్షుడు కోపావేశాలను వెల్లగక్కుతుంటే నయినా పరమేశ్వరుడు నోరు మెదపలేదు. తన మౌనాన్ని వీడలేదు.
ఈ సన్నివేశాన్ని తిలకిస్తున్న దేవతలు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. పరిణామం ఇంకా ఎంత తీవ్రం కాబోతున్నదో, ఎంత విషమ పరిస్థితికి దారితీస్తుందోనని ఆందోళన చెందారు.
అల్లుడు సమాధానం కూడా చెప్పకపోయేసరికి దక్షునికి ఆవేశం ముంచుకొచ్చింది. కోపంతో దహించుకుపోయాడు. “నన్నే పరాభావిస్తావా? నిన్ను క్షమించను. ఇందుకు ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సిందే.. ఇకపై యజ్ఞయాగాదులలో నీకు హవిస్సులు లేకుండా పోతాయి.. ఇదే నా శాపం” అంటూ పరమేశ్వరుణ్ణి శపించాడు దక్షుడు.