నవరాత్రి వ్రతం ఆచరించేవారు ఈ ఐదు విషయాలు అసలు మరవకూడదు..!

 


నవరాత్రి వ్రతం ఆచరించేవారు ఈ ఐదు విషయాలు అసలు మరవకూడదు..!

 


 

దేవీ నవ రాత్రులు భారత దేశం యావత్తు గొప్పగా జరుపుకునే అమ్మవారి పండుగ.  9రోజులు అమ్మవారు వివిధ రూపాలలో దర్మనమిస్తూ భక్తులను కనువిందు చేస్తుంది. ఈ నవ రాత్రుల సందర్భంగా కొందరు నవరాత్రి వ్రతం ఆచరిస్తారు.  తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటూ భక్తిశ్రద్ధలతో అమ్మను ఆరాధిస్తారు. ఈ నవరాత్రి వ్రతంలో భాగంగా ఐదు నియమాలను అస్సలు మరవకూడదు అని పండితులు చెబుతున్నారు. దేవీ నవ రాత్రుల సందర్భంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఐదు విషయాలు ఏంటంటే..


ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే మహాలక్ష్మీ పుట్టింది అని చాలామంది అంటూ ఉంటారు. ఆడపిల్లను శక్తి స్వరూపంగా, అమ్మవారికి ప్రతిరూపంగా భావించే దేశం మనది.  దేవీ నవరాత్రులలో ఆడపిల్లలను కానీ,  మహిళలను కానీ,  స్త్రీ జాతిని కానీ ఎప్పుడూ అవమానించడం, దూషించడం,  వేధించడం వంటివి చేయకూడదు.  ఇలా 9రోజులు పాటిస్తే ఆ 9రోజుల ప్రవర్తన అందరిలో మార్పు తెస్తుందనేది ఈ నియమం వెనుక దాగిన అర్థం.  అంతేకాదు నవ రాత్రులలో స్త్రీలను గౌరవించడం,  వారిని ప్రేమగా చూసుకోవడం చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇంటి ఆడపిల్ల నవ్వుతూ ఉంటే ఏ ఇల్లు అయినా సంతోషంగా ఉంటుంది.


నవరాత్రుల వ్రతం పాటించే వారు మొదటగా ఇంట్లో ఆడవారిని గౌరవించాలి.  ముఖ్యంగా తల్లిని దైవంతో సమానంగా చూడాలి. భార్య,  కూతురు,  చెల్లి ఇలా ఇంటి ఆడవారందరిలో ఆ అమ్మవారిని గుర్తించగలగాలి. ఇలా చేస్తే ఇంటి ఆడపిల్లలు ఎప్పుడూ బాధపడరు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం నవరాత్రులలో అమ్మవారు తనను భక్తిగా పూజించే ఇంటిని స్వయంగా దర్శిస్తుందని చెబుతారు. అయితే ఇల్లు ఎప్పుడూ ధూప దీపంతో.. వెలుగుతో ఉండాలి. అందుకే ఇంట్లో రాత్రి నిద్రించే సమయంలో తప్ప మిగిలిన సమయంలో ఇంటిని చీకటిగా ఉంచకూడదు.


నవరాత్రుల తొమ్మిది రోజులు ఇంట్లో ఉల్లి,  వెల్లుల్లి వాడటం ఆపడం మంచిది.  బయటి ఆహారాలు తెచ్చుకుని తినడమే కాదు.. ఇంట్లో ఎవరూ కూడా తినకూడదు.  ముఖ్యంగా నవరాత్రి వ్రతం చేసేవారు తినకూడదు.  మిగిలిన వారు కూడా ఈ నియమాన్ని పాటించడం వల్ల అమ్మవారి కృప లభిస్తుంది.  ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి తామస గుణం పెంచుతాయి.   ఇవి మనిషి ప్రవర్తనను ప్రేరేపిస్తాయి.


దేవీ నవరాత్రులలో ఎళ్ల వేళలా భక్తితో ఉండటం, అమ్మవారి నామస్మరణ చేయాలి. అమ్మవారి పూజ,  అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం, అమ్మవారి పేరుతో పేదలకు దానం చేయడం, ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం మొదలైనవన్న వీలును బట్టి చేస్తుంటే అమ్మవారి కృప లభిస్తుంది.


                                          *రూపశ్రీ.