దేవీ నవ రాత్రులలో ఈ ఒక్క పని చేశారంటే చాలు.. ఏడాది మొత్తం అమ్మవారి కృప లభిస్తుంది..!

 

 

 దేవీ నవ రాత్రులలో ఈ ఒక్క పని చేశారంటే చాలు.. ఏడాది మొత్తం అమ్మవారి కృప లభిస్తుంది..!

 

 

ఈ సృష్టికి మూలం ఓ శక్తి ఉందని ఆ శక్తి అమ్మవారే అని అంటారు అంతా. అందుకే సకల సృష్టికి అమ్మ ఆవిడే అని అంటారు.  ఈ అమ్మవారు ఎన్నో రూపాలలో ఉన్నా ఆ రూపాలలో దాగిన శక్తి మాత్రం ఒకటే.  దేవీ నవ రాత్రులలో  అమ్మవారిని 9 రూపాలలో ఎంతో భక్తితో పూజిస్తారు.  అదే విధంగా అమ్మవారి కరుణ,  కృప, కటాక్షం కొరకు ఎన్నో ఆచరిస్తారు. అయితే ఈ దేవీ నవ రాత్రులలో ఒక్క పని చేయడం వల్ల ఏడాది మొత్తం అమ్మవారి కృప లభిస్తుంది.  ఇందుకోసం చెయ్యాల్సిందేమిటంటే..

కుంకుమ అర్చన..

అమ్మవారికి  కుంకుమ అర్చన అంటే చాలా ప్రీతి.  సాధారణంగా అమ్మవారి పూజల్లోనూ అమ్మవారికి చేసే ప్రత్యేక ఉత్సవాలలోనూ అమ్మవారికి ప్రీతికరమైన రోజుల్లోనూ కుంకుమ అర్చన చేయడం పరిపాటి. అయితే ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఇంట్లోనే కుంకుమ అర్చన చేసుకోవడం ఎంతో మంచిది.

ఎలా చేయాలి?

అమ్మవారికి కుంకుమ అర్చన అంటే చాలా ప్రీతి.  మరీ ముఖ్యంగా దేవీ నవ రాత్రులలో అమ్మవారికి కుంకుమ అర్చన చేయడం వల్ల అమ్మవారు సంతోషిస్తారు. నవ రాత్రులలో ప్రతి రోజూ సాయంత్రం అమ్మవారి ముందు దీపం వెలిగించి, ధూపం వేసి,  నైవేద్యం పెట్టి.. అమ్మవారి ముందు కాసింత పచ్చ కర్పూరం ఉంచాలి.  అమ్మవారికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. ఒక చిన్న అమ్మవారి విగ్రహం తీసుకుని(బంగారం, వెండి లేదా పంచలోహ విగ్రహం అయినా పర్వాలేదు) ఒక తమలపాకు మీద ఉంచాలి.   ఇలా అన్నీ సమకూర్చాక.. అమ్మవారి ముందు కూర్చుని అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారిని చూస్తూ లలిత సహస్ర నామ పారాయణ మొదలుపెట్టాలి.  ఇలా లలిత సహస్రనామ పారాయణ చేస్తూ అమ్మవారి విగ్రహానికి కుంకుమ అర్చన చెయ్యాలి. దేవీ నవరాత్రులు ఉన్న ప్రతి రోజూ ఇలా కుంకుమ అర్చన చేసుకుని,  అమ్మవారి ముందు ఉంచిన పచ్చ కర్పూరం కూడా కొద్దిగా కుంకుమలో  కలుపుకోవాలి.  ఈ కుంకుమను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.  ఎక్కువగా ఉందనిపిస్తే ఎవరైనా ముత్తైదువులకు ఇవ్వచ్చు.

అమ్మవారికి అర్చన చేసిన కుంకుమను ప్రతిరోజూ స్నానం అనంతరం పెట్టుకోవాలి.  ఇది అర్చన కుంకుమ కాబట్టి నియమాలు పాటించాలి.  ఆడవారు బహిష్టు సమయాల్లోనూ,  మాంసాహారం తీసుకున్న సమయాల్లోనూ పెట్టుకోకపోవడమే మంచిది.  ఇక మిగిలిన అన్ని రోజులలో  కుంకుమ పెట్టుకోవచ్చు.  ఇది  అమ్మవారి రక్షలాగా పనిచేస్తుంది. తొమ్మిది రోజులు ఇలా కుంకుమ అర్చన చేసుకోలేక పోయిన వారు కనీసం సప్తమి, అష్టమి, నవమి రోజులలో అయినా కుంకుమ అర్చన చేసుకోవచ్చు. ఈ కుంకుమను స్నానం అనంతరం పిల్లలు,  మగవారు కూడా పెట్టుకోవచ్చు.  ఇందులో పచ్చకర్పూరం కూడా కలిపి ఉంటుంది కాబట్టి ఇది ఏడాది మొత్తం పాడవకుండా ఉంటుంది.  మళ్లీ దేవీ నవరాత్రులు వచ్చే వరకు ఈ అర్చన కుంకుమను రోజూ పెట్టుకోవచ్చు.  

                                                               *రూపశ్రీ.