ఇవాళ నరనారాయణ జయంతి!

 

ఇవాళ నరనారాయణ జయంతి!

 

 

ఈ లోకంలో బ్రహ్మ చేస్తున్న సృష్టికి సహకరించేందుకు కొందరు ప్రజాపతులు తోడ్పడ్డారు. వీరిలో ఒకరు ధర్మ ప్రజాపతి. ఆ ధర్మ ప్రజాపతి తన సోదరుడు దక్ష ప్రజాపతి కుమార్తెనే వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకి నరుడు, నారాయణుడు అనే కవల పిల్లలు జన్మించారు.

నరుడు, నారాయణుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమే అని పురాణాలు పేర్కొంటున్నాయి. విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించేందుకు నరసింహునిగా అవతరించిన విషయం తెలిసిందే! సగం నరుడిగానూ, సగం సింహరూపంలోనూ ఉన్న ఈ అవతారంలో నరరూపం నరునిగానూ, సింహరూపం నారాయణునిగానూ ఉండిపోయారని కూడా చెబుతారు.

మానవజన్మకు లభించే ఒక అదృష్టం... సృష్టికర్త మీద మనసుని లగ్నం చేసి తపస్సులో మునిగిపోవడం. ఆ అదృష్టాన్ని తాము కూడా అనుభవించాలని అనుకున్నారో, మానవులకు ఆదర్శంగా నిలవాలనే అనుకున్నారో... నరనారాయణులు తపస్సులో మునిగిపోయారు. అలా హిమాలయాల సమీపంలోని ఒక వనంలో వీరిరువురూ తపస్సు సాగించారు. ఆ వనమంతా రేగుచెట్లతో నిండిపోయి ఉంది. ఆ రేగుపళ్లనే ఆహారంగా తీసుకుంటూ వారు తమ తపస్సుని సాగించారట. రేగుపండుకి బదరీఫలం అన్న పేరు ఉంది కాబట్టి, ఇక్కడ తపస్సు ఆచరించిన నరనారాయణులకి బదరీనాథుడన్న పేరు స్థిరపడింది.

 


నరనారాయణుల ఘోరతపస్సు గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. వారి తపస్సు తీవ్రతను లోకానికి తెలియచేయడానికి ఒకసారి ఆ పరమేశ్వరుడు తన పాశుపతాస్త్రాన్ని వారి మీదకు సంధించాడట. కానీ నిర్వకల్ప సమాధిలో మునిగిపోయిన నరనారాయణులు ముందు ఆ అస్త్రం సైతం తలవంచక తప్పలేదు. మరోమారు వారి తపస్సుని భగ్నం చేసేందుకు ఇంద్రుడు తన అప్సరసలను వారివద్దకు పంపాడు. కానీ ఆశ్చర్యం! నారాయణుడు తన తొడను తాకగానే వారిని మించిన అప్సరస, ఆయన నుంచి వెలువడింది. నారాయణుడి ఊరువు (తొడ) నుంచి వెలువడింది కాబట్టి ఆమెకు ఊర్వశి అన్న పేరు వచ్చింది. మరో సందర్భంలో నరనారాయణులు సహస్రకచుడు అనే రాక్షసునితో యుద్ధం చేయవలసి వచ్చింది. అయినా కూడా వారు ఒకరు తపస్సు చేస్తుండగా మరొకరు వంతులవారిగా అతనితో యుద్ధాన్ని సాగించారు.

 

నరనారాయణులని కొలుచుకుంటూ మన దేశంలో అనేక క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో బదరీక్షేత్రం ప్రముఖమైంది. ఈ క్షేత్రంలోనే నరనారాయణులు తపస్సు సాగించారనీ, ఇప్పటికీ నర, నారాయణ అనే పర్వతాల రూపంలో తపస్సు చేసుకుంటున్నారనీ చెబుతారు. ఈ రెండు పర్వతాల నడుమ నుంచి అలకనంద నది ప్రవహిస్తూ ఉంటుంది. గంగానది భూమిమీదకు అవతరించినప్పుడు, ఈ భూమి ఆ గంగ తీవ్రతను తట్టుకోలేకపోయిందట. అందుకని గంగానదిలోని ఒక పాయ అలకనందగా మారిందని చెబుతారు.

నరనారాయణ క్షేత్రాలు కొన్నింటిలో వీరిరువురూ ఒకే రూపంలో ఉంటే, మరికొన్ని క్షేత్రాలలో వేర్వేరుగా దర్శనమిస్తారు. తర్వాతకాలంలో ఈ నరనారాయణులే కృష్ణార్జునులుగా జన్మించినట్లు భాగవత పురాణం పేర్కొంటోంది. మహాభారతంలో శ్రీకృష్ణుడే స్వయంగా తాను నారాయణుడిననీ, అర్జునుడే నరుడనీ చెబుతాడు. ఇక ఉత్తరభారతంలో ‘స్వామినారాయణ’ పేరుతో మరో మహాపురుషుని కొలుస్తారు. పూర్వం దుర్వాసముని శాపం చేత నారాయణుడు, 18వ శతాబ్దంలో ఉత్తర్ప్రదేశ్లో స్వామినారాయణుడిగా జన్మించారని వీరు నమ్ముతారు.

ఇంతటి ప్రశస్తి కలిగిన నరనారాయణలు, కర్క సంక్రమణం తర్వాత వచ్చే హస్తానక్షత్రం రోజున జన్మించారని చెబుతారు. అది ఈ రోజే! ఈ పుణ్యదినాన నరనారాయణులని కొలుచుకుంటే మంచిదని చెబుతారు. నరనారాయణుల ప్రతిమలు లేని పక్షంలో కృష్ణుడే, బదరీనాథుడు, విష్ణుమూర్తి, నరసింహస్వామి... వీరిలో ఎవరిని ఆర్తితో పూజించినా ఆయన అనుగ్రహం లభించి తీరుతుంది.

- నిర్జర.