హయగ్రీవ జయంతి విశిష్టత

 

హయగ్రీవ జయంతి విశిష్టత

 

 

శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. భారతీయులంతా ఆ రోజు రాఖీని ఘనంగా జరుపుకొంటారు. కానీ రాఖీ రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే హయగ్రీవ జయంతి. ఆ హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో, ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందామా!

హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి... వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడు జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. ఆయనకు ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది. పూర్వం గుర్రపుతల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే, తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి, హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు. అంటే హయగ్రీవుడు శత్రునాశకుడు కూడా అన్నమాట! ఆ హయగ్రీవుని ఆరాధించడం వల్ల అటు జ్ఞానమూ ఇటు విజయమూ రెండూ లభిస్తాయన్నది పెద్దల మాట.

హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా... ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా!

హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తారు. అత్యంత నిష్టతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి... కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలి. హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజగదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని కానీ పఠించాలి. ఏదీ కుదరకపోతే కనీసం-


జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్|
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||


... అనే మంత్రాన్ని పఠించాలి. హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే కాబ్టటి, వాటిని ఆయనకు అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి.


ఇంతకుముందు చెప్పుకొన్నట్లుగా హయగ్రీవుడు జ్ఞానప్రదాత. అందుకనే చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి, ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు. ఈ రోజు ఆయనను ఆరాధించినవారికి సకల విద్యలూ అబ్బుతాయనీ, అన్ని ఆటంకాలూ తొలగిపోతాయనీ చెబుతారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి, ఆయన ఆరాధన వల్ల సిరిసంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది. మరెందుకాలస్యం! ఈ హయగ్రీవ జయంతి రోజున ఆయనను ఆరాధించి మీ మనోభీష్టాలన్నింటినీ నెరవేర్చుకోండి.

- నిర్జర.