Read more!

ఆంజనేయుడు వివాహితుడా?

 

ఆంజనేయుడు వివాహితుడా?

 

 

ఆంజనేయుడు... బ్రహ్మచారులకు ఆరాధ్య దైవం.. ఎందుకంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి.. బ్రహ్మచారులకు ఆదర్శం హనుమంతుడు..
మామూలుగా హనుమంతుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మొదటగా చెప్పేది ఆయన బ్రహ్మచర్యం గురించే..కానీ ఇప్పుడా బ్రహ్మచర్యానికే ముప్పు వచ్చిపడింది.. భావి బ్రహ్మ అయిన ఆంజనేయుడి బ్రహ్మచర్య దీక్షను సువర్చలా దేవి అనే సూర్యుని కుమార్తె భగ్నం చేసిందిట... అంతటి కఠోర దీక్షలో ఉన్న హనుమంతుడు సువర్చలాదేవిని వివాహం చేసుకోవటం నిజమేనా అన్న ఆశ్చర్యం కలగకపోదు.. నిజానికి ఆంజనేయుడి పాత్ర ప్రధానంగా మనకు కనిపించే రామాయణంలో ఈ పెళ్లి తంతు లేదు.. మరి ఆ రామాయణాన్ని రాసిన వాల్మీకికి హనుమంతుడికి పెళ్లయిన సంగతి తెలుసో లేదో తెలియదు కానీ, అందులో పవనసుతుడి పాత్ర అంతా రాముడికి సేవ చేయటంతోనే సరిపోయింది..

 

 

రామాయణంలో తీవ్రమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించిన మన ఆంజనేయుడికి పరాశర సంహిత వంటి కొన్ని పురాణాలు హనుమంతుడిపై ప్రేమ పడి పెళ్లి చేసేశాయి. అలా పెళ్లి చేస్తే వచ్చిన భార్యే సువర్చలా దేవి... సువర్చలాదేవి.. సూర్యుని కూతురు..ఆమెను ఆంజనేయుడు పెళ్లి చేసుకున్నాడట.. హనుమజ్జయంతి రోజునే ఆయన పెళ్లి వేడుకలనూ దేశంలోని అనేక ఆలయాల్లో జరపటం ఆనవాయితీగా కూడా మారిపోయింది...హనుమంతుడు పసివాడిగా ఉన్నప్పుడే సూర్యుణ్ణి పండుగా భావించి ఎగిరి అందుకోబోయాడట.. అలా సూర్యుణ్ణి చేరిన హనుమంతుడు ఆయన దగ్గరే సకల విద్యలనూ అభ్యసించాడు.. విద్యలన్నీ పూర్తయిన తరువాత సూర్యుడు హనుమంతుడిని కోరిక కోరాడట.. తన కుమార్తె సువర్చలా దేవిని వివాహం చేసుకోవాలన్నది ఆ కోరికట...  గురువుగారి కోరిక విని హనుమంతుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. తానేమో ఘోటక బ్రహ్మచారి.. తానెలా పెళ్లి చేసుకోవటం.. అదే గురువుగారికి చెప్పుకున్నాడు.. కానీ, సూర్యభగవానుడు ఒత్తిడి చేయటంతో సంసార బాధ్యతలతో నిమిత్తం లేకుండా నామమాత్రంగా వివాహం చేసుకునేందుకు ఆంజనేయస్వామి అంగీకరించాడట.. అలా సువర్చలాదేవితో హనుమంతుడికి వివాహం అయిందని పురాణాల్లో చెప్పారు..

 

 

శ్రీరామ నవమినాడు సీతారామ కల్యాణాన్ని ఎలాగైతే జరుపుకుంటామో... అలాగే హనుమత్‌ జయంతి రోజున సువర్చలాంజనేయుల వివాహాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు... అయినా చాలామందిలో మాత్రం హనుమంతుడికి వివాహం చేయటం అనేది వింతగా కనిపిస్తోంది... మరి కొందరిలో ఆగ్రహాన్నీ తెప్పిస్తోంది. ఏవో పురాణాల్లో ఏవేవో కథలు ఉన్నాయని చూపించి బ్రహ్మచర్యానికి ఆదర్శపురుషుడైన ఆంజనేయుడికి వివాహం చేయటం సబబు కాదని ఇంకొందరి వాదన... హనుమంతుడి వివాహంపై చాలా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన పెళ్లి కథ ఒకటైతే... సంతానం కథ ఇంకోటి... ఆ సంతానంతో ఫైట్‌ చేసిన కథ మరోటి... ప్రతి కథా తెగ ఇంటరెస్ట్ కలిగిస్తుంది... ఒక్కో పురాణం ఒక్కో సందర్భంలో ఒక్కో కథనాన్ని వినిపిస్తుంది... ఆ కథనాలు ప్రజల్లోకి ప్రచారంలోకి వచ్చేసరికి అబ్బో బోలెడు రూపాంతరాలు చెందుతాయి.పరాశర సంహిత చెప్పిన కథనం ప్రకారం సూర్యుడి కోరికతో సువర్చలా దేవిని ఆంజనేయుడు వివాహం చేసుకున్నాడు.. ఆమెను వివాహం చేసుకున్నా.. ఆంజనేయుడు బ్రహ్మచర్య దీక్షను విడిచిపెట్టలేదట... అందుకే ఆయనకు వివాహం చేయటమూ తప్పుకాదు... ఆయన పేరుతో బ్రహ్మచర్య దీక్షలు చేపట్టడమూ తప్పు కాదంటారు ఆధ్యాత్మిక వేత్తలు.

 

 

లంకానగరంలో సీతాదేవిని అన్వేషించటానికి హనుమంతుడు వెళ్లినప్పుడు రావణుడు ఆయన తోకకు నిప్పంటించాడు... ఆ నిప్పుతో లంకను ఆంజనేయుడు కాల్చేశాడు... ఆ తరువాత ఆంజనేయుడు సముద్రంలో తోకకు అంటిన అగ్గిని ఆర్చుకుని తిరిగి వెళుతున్నప్పుడు ఆయన చెమట బిందువు సముద్రంలో ఒక చేప మింగిందిట... తద్వారా ఆ చేప పుత్ర సంతానాన్ని పొందింది... ఆ కుమారుడి పేరు మకరధ్వజుడు... ఈ మకరధ్వజుడు పెరిగి పెద్దవాడై, మైరావణుడి ప్రాణాలకు కాపలా ఉన్నాడట... మైరావణుడి ప్రాణాలను హరించటానికి వచ్చిన ఆంజనేయుడు కుమారుడితో యుద్ధం చేయాల్సి వచ్చిందిట... యుద్ధం తరువాత వాస్తవం తెలుసుకుని కుమారుణ్ణి ఆశీర్వదించి వెళ్లాడట ఆంజనేయుడు...

 

 

హనుమంతుడి గురించి ఇలా ఎన్ని కథనాలైనా ప్రచారంలో ఉండి ఉండవచ్చు. కానీ, ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఎంతమాత్రం కనిపించదు... హనుమత్‌ దీక్షలు స్వీకరించేవారు కొల్లలుగా ఉన్నారు... ఆయనను ఆజన్మ బ్రహ్మచారిగానే విశ్వసించేవారు ఎక్కువమంది ఉన్నారు. సువర్చలా దేవితో వివాహం సంగతి... దీని వెనుక కూడా లాజిక్‌ లేకపోలేదు... ప్రపంచంలో విద్యలన్నింటికీ సింబల్‌ వెలుగు... వర్చస్సు అన్నా వెలుగే... సు.... వర్చస్సు అంటే మంచి వెలుగు అని అర్థం... ప్రపంచంలోని ఉన్నతమైన, ఉత్తమమైన విద్యలన్నింటినీ హనుమంతుడు సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు. సూర్యుడి నుంచి పుట్టిన వెలుగే ఈ విద్యలు... ఆ వెలుగే సువర్చల... ఆ సువర్చలనే హనుమంతుడికి సూర్యుడు అందించాడు... సువర్చలా వివాహం అనేది సామాన్యులకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పింది...