Read more!

34 వేళ్ళ బరేలీ బాలుడు (Bareilly baby boy with 34 fingers)

 

 34 వేళ్ళ బరేలీ బాలుడు

(Bareilly baby boy with 34 fingers)

 

బ్రహ్మంగారు చెప్పినట్లు ఎన్నో చిత్ర విచిత్రాలు మన చుట్టూ జరుగుతున్నాయి. నిన్న గాక మొన్న (July 20) అక్షత్ అనే ఏడాది బాలుడి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరింది. ఎందుకంటే ఆ పసివాడికి కాళ్ళకు, చేతులకు కలిపి ఏకంగా 34 వేళ్ళు ఉన్నాయి. అక్షత్ ఉత్తర ప్రదేశ్ బరేలీకి చెందినవాడు.

అక్షత్ తండ్రి, తమ కొడుకు పేరు నమోదు చేయగా, గిన్నీస్ బుక్ అధికారులు సంబంధిత చర్యలన్నీ ముగించి, అక్షత్ పేరును పుస్తకంలో చేర్చినట్లుగా ప్రకటించారు. బరేలీ బాలుడు మునుపటి రికార్డులను బద్దలుకొట్టాడు.

అక్షత్ తల్లి అమృతా సక్సేనా, 'తన కొడుకు పేరు గిన్నీస్ బుక్ లోకి చేరిందంటే నమ్మలేకపోతున్నాను' - అంటూ ఎంతో భావోద్వేగానికి గురైంది. ఆమె కొంచెం తేరుకుని, "మా బంధువు ఒకరు చైనాలో ఓ బాబుకి 31 వేళ్ళు ఉన్నాయని, అది ప్రపంచ రికార్డుగా నమోదయ్యింద"ని చెప్పి, “మన అక్షత్ కి 34 వేళ్ళు ఉన్నాయి కనుక ఆ రికార్డును బ్రేక్ చేస్తుంది" అని చెప్పడమే కాకుండా, గిన్నీస్ వారికి వివరాలు పంపమని ప్రోత్సహించారు. మేం ముందు వద్దన్నాం కానీ, ఆయన నన్ను, నా భర్తని ఒప్పించారు. మొత్తానికి నా భర్త, మా చెల్లెలు కలిసి, ఇంటర్నెట్ లో బాబు వివరాలను డాక్యుమెంట్లతో సహా పంపారు.

ఆ వివరాలు చూసి, డాక్టర్లు ప్రతిస్పందించారు. మీడియాకూ సమాచారం అందింది. ఇది చాలా చిత్రమైన కేసని వివరించి, దీన్ని "పోలిడాక్టిలీ" గా తేల్చారు. గర్భాశయంలో శిశువు పెరుగుతుండగా ఎముకల ఎదుగుదలలో ఉండే లోపాలవల్ల ఇలా జరుగుతుందని చెప్పారు.

అక్షత్ కు ఉన్న అధిక వేళ్ళను మామూలు చికిత్సతోనే తీసివేయవచ్చని, ఇలాంటి కేసుల్లో కొన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీ అవసరమౌతుందని డాక్టర్లు చెప్పారు...” అంటూ అమృతా సక్సేనా వివరంగా చెప్పుకొచ్చింది.

లోకంలో కొందరికి కాళ్ళకు లేదా చేతులకు ఒకటి రెండు ఎక్కువ వేళ్ళు ఉండటం వరకూ సహజమే. కానీ 14 ఎక్కువ వేళ్ళు ఉండటం అంటే మాటలా?! కేవలం ఏడాది వయసున్న తన కొడుకు ఏదో నెపాన ప్రపంచానికి తెలిశాడు అంటే తల్లిగా అమృతా సక్సేనాకి మహా ఆనందంగా ఉంది. కానీ, అదే సమయంలో, తన కొడుకు ఈ లోపం నుండి బయటపడాలని, జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటోంది. తమ చిన్నారికి చికిత్స చేయించే సన్నాహాల్లో ఉన్నారు భార్యాభర్తలు.