లక్ష్మీదేవి దివ్య శక్తులు

 

లక్ష్మీదేవి దివ్య శక్తులు

 

 

లక్ష్మీ దేవి గురించి వివిధ కథలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి  తోడుగానే ఉందని, ఆమె 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెప్పారు. సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవీ భాగవతం లో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి, భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు. కనుక లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు.

 

 

తరువాత ఒకసారి దూర్వాసుని శాపకారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి పాలసముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేసే చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె 'సముద్రరాజ కుమార్తి' అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మీకి సోదరుడయ్యాడు. ధనాధి దేవత అయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు.విష్ణువు శక్తికి, మాయకు కారణం  లక్ష్మీదేవి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మీకి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది.ఆమెను అష్ట భుజ మహాలక్ష్మీగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. రామావతారం లో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలవేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది.

లక్ష్మీదేవికి వివిధ పేర్లు

 

 

 

చాలా మంది దేవతలులాగే లక్ష్మీదేవికి  ఎన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రం , సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కుగా లక్ష్మీదేవిని పలికే  పేర్లలో కొన్ని లక్ష్మీ, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.

లక్ష్మీదేవి రూపధారణ

ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.

రంగాపురం దేవాలయంలోలక్ష్మీదేవి మహిమ

 

 

 

యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మీ అనే ఇద్దరు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహితలలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని మత్స్యపురాణంలో ఇలా చెప్పారు. "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి, ముఖం గుండ్రంగా ఉండి  దివ్యాంబరమాలా కంకణధారియై ఉండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలుఉండి, పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగుతున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ, చక్ర , గదా, పద్మ, ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై ఉండును.

 

 

స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను తెలుపును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పారు. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కాని లక్ష్మీదేవి ఆకృతి గురించి చెప్పలేదు. కారణం తెలియడంలేదు.

అష్ట లక్ష్ములు

 

 

 

లక్ష్మీ దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు  ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మీ. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.