మూల గౌరీ నోము (Moola Gouree Nomu)
మూల గౌరీ నోము
(Moola Gouree Nomu)
కథ
ఒకానొక మహారాణి అన శ్రేయస్సు, తనయుల శ్రేయస్సు, రాజ్యం శ్రేయస్సు, కోరి మూల గౌరీ నోము పట్టి ఉద్యాపనం చేసుకుంది. అంతలోనే శత్రురాజులు దండెత్తి వచ్చి, రాజునూ, సైనికులనూ, బంధువులనూ, అందరినీ చంపేశారు. అప్పుడా రాణీ యుద్ధ భూమిలో నిలిచి, తనవారి ప్రాణాలను తీసుకుని పోయేందుకు వచ్చిన యమకింకరులను ఉద్దేశించి ఇలా అన్నది.
పాట
చంపుటకు వచ్చిన శత్రు సైన్యములారా
ప్రాణాలు తీసేటి యమదూతలారా
మూల గౌరీ భక్తి ముత్తయిదువ నేను
మా తావులను వీడి మరలి వెళ్ళిపొండి
పతి సౌఖ్యము నిలుపుకొనుటకు పసుపు వాయనమిచ్చేను
సౌభాగ్యాలు నిలుపుకొనుటకు సువర్ణ వాయనమిచ్చేను.
ఇల్లు వాకిలి నిలుపుకొనుటకు భూములు వాయనమిచ్చేను.
తోటలు నిలుపుకొనుటకు తోవు చీర వాయనమిచ్చేను.
బిడ్డల సంతతి కోసం - బీరకాయల వాయనమిచ్చేను.
చిన్నిమనుమల సౌఖ్యం కోసం - చెరకుగడలు వాయనమిచ్చేను.
అల్లుళ్ళ సంతోషం కొరకు - అరిసెలు వాయనమిచ్చేను.
కూతుళ్ళ సౌభాగ్యాలకి - కుడుములు వాయనమిచ్చేను.
ప్రజల మేలును కోరి - పగడాల వాయనమిచ్చేను.
బంధువుల బాగును కోరి - బంతిపూలు వాయనమిచ్చేను.
రాజ్య క్షేమాన్ని కోరి - రత్నాలూ వాయనమిచ్చేను.
పాడిపంటల అభివృద్ధి కోసం - పాయసం వాయనమిచ్చేను.
అందరికన్నా గొప్పతనానికి - అద్దాలు వాయనమిచ్చేను.
పేరు ప్రతిష్టా కోసం - పెరుగన్నం వాయనమిచ్చేను.
ప్రాణభయాలు రాకుండా - పరమాన్నం వాయనమిచ్చేను.
కోరీకలన్నీ తీరేందుకు - కొబ్బరి కాయ వాయనమిచ్చేను.
అకాలమరణాలు లేకుండా - అరటి పండ్లు వాయనమిచ్చేను.
ఇరుగువారి మేలు కోరి - యిప్పపూలు వాయనమిచ్చేను.
పొరుగు వారి మేలు కోరి - పొగడపూలు వాయనమిచ్చేను.
పడుచు పిల్లల మేలు కోరి - పావడాలు వాయనమిచ్చేను.
ఆనారోగ్యాలు కలక్కుండా - అప్పాలు వాయనమిచ్చేను.
శాంతీ సౌఖ్యాల కోసం - చలిమిడి వాయనమిచ్చేను.
అందరి మేలూ కోరి - అడిగిన వల్లా వాయనమిచ్చేను.
ఆదినారాయణుడి దయ కోసం అడగనివి కూడా వాయనమిచ్చేను.
చంపుటకు వచ్చిన శత్రువులారా
ప్రాణాలు తీసేటి యమదూతలారా
మూల గౌరీ నోము ముత్తయిదువ నేను
మా జీవముల వదలి మరలి వెళ్ళండి.
అని పాడగానే,
మూల గౌరీ దేవి...తన భర్తయైన పరమేశ్వరునితో సహా ప్రత్యక్షమైంది.
శివ పార్వతులక్కడే పడివున్న రాణీ వర్గము వారందరినీ పునర్జీవులను చేసి
మరునాడు యుద్ధంలో విజయం కలిగేలా ఆశీర్వదించగా...
ఆ విధంగానే జరిగి ఆ రాణీ, రాజూ సుఖంగా వున్నారు. ఇది తెలిసినది మొదలు ధనిక పేద బేధాలు లేకుండా అందరు స్త్రీలూ ఈ నోము పట్టి తరించసాగారు.
విధానం
ప్రతి రోజూ మూల గౌరీని పూజించి కథ చెప్పుకుని, అక్షతలు వేసుకోవాలి. వీలు కలిగినప్పుడల్లా, మనసులో వున్న కోరిక చెప్పుకుని... అనువైన వస్తువును అయిదుగురు ముత్తయిదువులకు (ఉదాహారణకు పనసకాయ ఇవ్వదలచుకుంటే, ఐదు పనస తొనల చొప్పున) వాయనమివ్వాలి. అలా అనుకున్న వస్తువులూ, కోరికలూ అయ్యాక ఉద్యాపన చేసుకోవాలి.
ఉద్యాపనం
కడగా అయిదుగురు ముత్తయిదువుల్ని పిలిచి, బొట్లు కాటుక పెట్టి, భోజనం పెట్టి, అంతకుముందు యిచ్చిన అన్నిరకాల వాయనాలనూ రకానికి అయిదు చొప్పున దక్షిణ తాంబూలాలతో వాయన దానమివ్వాలి.