మధువనంలో వానరాల అల్లరి!
మధువనంలో వానరాల అల్లరి!
లంకను కాల్చి సముద్రం దాటి తిరిగి దక్షిణ దిక్కుకు వచ్చిన హనుమంతుడు జరిగింది అందరికీ చెప్పాక, జాంబవంతుడి సలహా మీద అక్కడి నుండి ప్రయాణమయ్యారు. అలా వారు వెళుతుండగా వాళ్ళకి మధువనం కనపడింది. ఆ మధువానాన్ని దదిముఖుడనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ మధువనంలోని చెట్ల నిండా తేనె పట్లు ఉన్నాయి. అక్కడంతా పువ్వుల నుండి తీసిన మధువు, పళ్ళనుండి తీసిన మధువు, రకరకాలైన మధువు పాత్రలలో పెట్టి ఉంది. ఆ వానరములన్నీ అంగదుడి దగ్గరికి వెళ్ళి "ఆ మధువనంలోని మధువుని తాగుదాము" అన్నారు. అంగదుడు సరే అనేసరికి అందరూ లోపలికి వెళ్ళి తెనేపట్లు పిండేసుకుని తేనె తాగేశారు. అక్కడున్న పాత్రలలోని మధువు తాగేశారు, అక్కడున్న చెట్లకి ఉన్న పళ్ళని తినేశారు.
వారందరూ విపరీతంగా తేనె తాగడం వలన మత్తెక్కి, కొంతమంది చెట్లకింద కూర్చుని పాటలు పాడడం మొదలుపెట్టారు, పాటలు పాడుతున్న వారి వీపు మీద కొంతమంది గుద్దుతున్నారు. కొంతమంది నాట్యాలు చేస్తున్నారు. కొంతమంది కనపడ్డవారికి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నారు. కొంతమంది పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారు, కొంతమంది అటూ ఇటూ నడుస్తున్నారు. కొంతమంది చెట్ల మీద నుండి కింద పడిపోతున్నారు. కొంతమంది నిష్కారణంగా ఏడుస్తున్నారు.
ఆ వానరాలు చేస్తున్న అల్లరికి దదిముఖుడి సైన్యం అక్కడికి వచ్చింది, వాళ్ళని చావగొట్టి తమ వెనుక భాగాలు చూపించారు. ఆ తరువాత వచ్చిన దదిముఖుడిని కూడా చావగొట్టారు. అప్పుడాయన ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు. దదిముఖుడు సుగ్రీవుడితో వానర బాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, మధ్య మధ్యలో హనుమ అంటున్నాడు. దదిముఖుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగడం మొదలైంది. (వానరాలు ఏదన్నా సంతోషకరమైన వార్త వింటె తోకలు పెంచుతారు). ఒక పక్క దదిముఖుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచడం గమనించిన లక్ష్మణుడు కంగారుగా "అసలు ఏమయ్యింది" అన్నాడు.
"ఏమిలేదయ్య, దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరాలు మధువానాన్ని నాశనం చేశాయంట. దక్షిణ దిక్కుకి వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసుంటాడు". అని లక్ష్మణుడితో అన్నాడు.
ఆ తరువాత "వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను" అని సుగ్రీవుడు దదిముఖుడితో అన్నాడు. దదిముఖుడు ఆ వానరాలకి "సుగ్రీవుడు రమ్మంటున్నాడు” అని చెప్పగానే అందరూ ఆకాశంలోకి ఎగిరిపోయి కిష్కిందకి చేరిపోయారు. వాళ్ళందరూ రాముడి దగ్గరికి వెళ్ళి "రావణుడు సీతమ్మని లంకలో శింశుపా వృక్షం కింద ఉంచాడు. సీతమ్మ చాలా బాధ పడుతుంది. మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చెయ్యాలి" అన్నారు.
అప్పుడు రాముడు "సీత ఎలా ఉంది? నా గురించి ఏమి చెప్పింది??" అని అడిగాడు.
అప్పటిదాకా రాముడి చుట్టూ ఉన్న వానరాలు, ఈ ప్రశ్నకి హనుమంతుడే సమాధానం చెప్పగలడు అని ఆయనకి దారిచ్చాయి. అప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకి నమస్కరించి "సీతమ్మ తపస్సుని పాటిస్తుంది, నీమీద పరిపూర్ణమైన ప్రేమతో ఉంది" అని, సీతమ్మ చెప్పిన ఆనవాళ్ళన్ని చెప్పి చూడామణిని ఇచ్చి "సీతమ్మ కేవలం ఒక నెల మాత్రమే ప్రాణాలని నిలబెట్టుకుంటానంది, మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుడిని సంహరించి, సీతమ్మని తీసుకురావాలి" అన్నాడు.
◆ వెంకటేష్ పువ్వాడ.