వందేళ్లుగా పూజలందుకుంటున్న పేపరువినాయకుడు
వందేళ్లుగా పూజలందుకుంటున్న పేపరువినాయకుడు
వినాయక చవితి వేడుకలు అనగానే మహారాష్ట్ర తప్పక గుర్తుకు వస్తుంది. ఆ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నా పూనెలో ఉన్న ‘మండై గణపతి’ వేడుకలు మాత్రం చాలా ప్రత్యేకం! ఎందుకంటే… పూనేలో ఉన్న అతిపెద్ద కూరగాయల మార్కెట్ ‘మండై’. ఇక్కడ దాదాపు 500కి పైగా పండ్లు, కూరగాయల దుకాణాలు ఉన్నాయి. 1890లో ఇక్కడ ‘కాచి’ అనే వర్తకుడు ఉండేవాడు. కాచి దంపతులకు ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోయింది. సంతానం కోసం వారు తిరగని గుడి లేదు, మొక్కని క్షేత్రం లేదు. అలా ఓసారి ‘తుల్జాపూర్ భవాని’ని దర్శించుకున్నారు ఆ దంపతులు. ‘మాకు కనుక పుత్రభాగ్యం కలిగితే, వినాయకుని విగ్రహాన్ని నెలకొల్పుతాను’ అని మొక్కుకున్నాడట కాచి. ఇది జరిగిన ఏడాదికే వారికి సంతానం కలిగింది.
తాను మొక్కుకున్న విధంగానే పూనేలోని మండైలో శారదామాతతో పాటు కొలువై ఉన్న గణేశుని విగ్రహాన్ని స్థాపించాడు కాచి. సాక్షాత్తూ బాలగంగాధర తిలక్ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. పూర్తిగా పేపరు గుజ్జుతో రూపొందించడం ఈ విగ్రహంలోని ప్రత్యేకత. అప్పట్లోని పాత వార్తాపత్రికలతో ఈ విగ్రహాన్ని తయారుచేశారు. అంటే ఈ విగ్రహాన్ని తొలినాటి రీసైకిల్డ్ వినాయకునిగా భావించవచ్చన్నమాట! దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శారద, గణపతి ప్రతిమలకు వివాహాన్ని జరిపిస్తారు. శారదాదేవిని, గణేశునికి భార్యగా భావించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే జ్ఞానానికి ప్రతిరూపాలైన వారిరువురినీ ఒకేచోట కొలవడం వల్ల సర్వకార్యాలూ సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.
వినాయకచవితికి జరిగే నవరాత్రులకు చుట్టుపక్కల వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు వస్తారు. ఈ గణేశుని విగ్రహానికి తొండం కుడివైపున ఉండటం మరో ప్రత్యేకత. ఇలాంటి వినాయకులను ‘సిద్ధి వినాయకుడు’ అంటారు. వీరిని పూజిస్తే కోరికలు త్వరగా ఈడేరుతాయట. ‘అఖిల మండై గణపతి ట్రస్టు’ పేరుతో ఉన్న సంస్థ ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. అయితే ఇతర గణపతి ఉత్సవాలలాగా ఇక్కడ ఎవరినీ ప్రత్యేకించి చందాలు అడగరు. ఆ వినాయకుడే తన ఉత్సవాల కోసం కావల్సిన నిధులను రాబట్టుకుంటాడనీ, ఆ నిధుల భారాన్ని కూడా తానే చూసుకుంటాడని నిర్వాహకుల నమ్మకం. ఈ ఏడాది జులైలో ఈ ఆలయంలో ఉన్న 40 లక్షలకు పైగా విలువైన నగలను ఒక దొంగ దోచుకుపోయాడు. కానీ వారం తిరిగేసరికల్లా అతను పట్టుబడక తప్పలేదు. గణేశుని మహాత్మ్యానికి ఇదే నిదర్శనమంటున్నారు భక్తులు.
- నిర్జర.