కాలభైరవుడు ఎవరు?? అతని వృత్తాంతమేమి??

 

కాలభైరవుడు ఎవరు?? అతని వృత్తాంతమేమి??


సృష్టి ప్రారంభంలో ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులనిద్దరినీ చూసి "నేను పరబ్రహ్మ స్వరూపుడిని. నేనే సృష్టికర్తను. మీరిద్దరూ నా ఆజ్ఞానుసారము నడుచుకోవాలి" అన్నాడు. దానికి శివుడు "బ్రహ్మదేవా! నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో, తెలియకుండా మాట్లాడుతున్నావో నాకర్ధం కావటం లేదు. విష్ణుమూర్తిని సృష్టించింది నేను ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మము నుంచి నువ్వు పుట్టావు. సృష్టి కార్యక్రమములో నీకు తోడుగా ఉండటానికి సరస్వతిని సృష్టించి నీకు ఇచ్చాను. నీ మాటలు అహంకార పూరితముగా ఉన్నాయి. తమోగుణాన్ని ప్రకటిస్తున్నాయి. వేదాలన్నీ నేను సర్వేశ్వరుడను అని చెబుతుంటే నీవు ఇలా మాట్లాడటం బాగాలేదు" అన్నాడు. ఆ మాటలు బ్రహ్మ దేవుని తలకు ఎక్కలేదు. అప్పుడు శివుడు వేదాలను పిలిచి "ఓ వేదములారా! త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా గుర్తించి స్తుతిచేస్తున్నారో వివరించండి" అన్నాడు.


అప్పుడు వేదములు "సర్వజగత్తుకూ ఆధారమైనవాడు, పరమేశ్వరుడు. పరబ్రహ్మ ఆ శంకరుడు తప్ప వేరెవరూ కాదు " అన్నది ఋగ్వేదము.


"యజ్ఞయాగాదులు, ధ్యానము, యోగము అన్నీ ఈశ్వరుడే" అని చెప్పింది యజుర్వేదము.


"అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు. కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చేది. శివుడు. శివుడు కానిది ఏదీ చతుర్దశ భువనాలలోనూ లేదు". "అన్నది సామవేదము.


"దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు, సర్వదుఃఖాలను పోగొట్టేవాడు శివుడు, తరింపచేసేవాడు శివుడు. అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతున్నాయి. శివ నామము, శివస్వరూపము మంగళ ప్రదమైనవి. మంగళ రూపిణి అయిన పార్వతీదేవికి అర్ధశరీరమిచ్చినవాడు శివుడు. అటువంటి శివుని స్మరించటము శుభప్రదము" అని అధర్వణ వేదము అన్నది.


"ఓంకార రూపము శివుడు, నాలుగు వేదాలకూ మూలపురుషుడు. పరాపశ్యంతీ మధ్యమ వైఖరి అనే వాగ్రూపము శివుడు. ఈ జగత్తంతా అతని సంకల్పానుసారమే పుట్టి పెరుగుతున్నది. శివనామమే జీవనాధారము. ముక్తికి మార్గము. చతుర్విధ పురుషార్థ ప్రదాత ఈశ్వరుడు తప్ప వేరు కాదు" అని చెప్పాయి వేదాలు.


వేదాలు ఎన్ని విధాల చెప్పినా బ్రహ్మ వినలేదు. "నేనే పరబ్రహ్మను" అని మొండిగా చెప్పాడు. దాంతో శివుడికి కోపము వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారి.. హూంకరించాడు. ఆ హూంకారము నుంచి భయంకరమైన రూపము కలిగిన మహాకాయము ఒకటి శివుని ఎదుట నిలిచింది. అది ఆకాశమంత ఎత్తున్నది. నాలుగు చేతులున్నాయి. మూడు కనులున్నాయి. చేతులలో శూలము, గద, ఢమరుకము ఉన్నాయి. అతడు ఢమరుకము మ్రోగించాడు. భూమ్యాకాశాలు, అష్టదిక్కులు దద్దరిల్లినాయి. ఆ శబ్దానికి అతడు చిందులు త్రొక్కాడు. భూమి కంపించింది. అతడి శరీరము పచ్చ కర్పూరములాగా వెలుగుతోంది. ఆ భయంకరాకారుడు శివునకు నమస్కరించి "స్వామీ! ఏమాజ్ఞ" అన్నాడు.


అప్పుడు శివుడు అతడితో "బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వల్ల వేదాలను ధిక్కరిస్తున్నాడు, అతణ్ణి శిక్షించు" అన్నాడు.


ఆ భయంకరాకారుడు తన చిటికిన వ్రేలి గోటితో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి త్రుంచి వేశాడు. ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిశగా పడింది. అదే బ్రహ్మ కపాలము. శివుని హూంకారము నుండి పుట్టినవాని ఆకారము చాలా భయంకరముగా ఉంది కాబట్టి అతనికి కాలభైరవుడు అని పేరు పెట్టాడు ఈశ్వరుడు.


బ్రహ్మదేవుని గర్వము అణిగిపోయింది. అప్పుడు శివుడు కాలభైరవుని చూసి "కుమారా! బ్రహ్మ శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మ హత్యా దోషము అంటింది. ఆ పాతకము నీ వెన్నంటే ఉంటుంది. నీవు కాపాలికా వ్రతము అవలంభించి క్షేత్రాలన్నీ సందర్శిస్తూ చివరకు కాశీ పట్టణం చేరు. కాశీ పట్టణం చేరగానే బ్రహ్మహత్యా పాతకము నీ కనులముందే భస్మమైపోతుంది. నువ్విక కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవించు" అన్నాడు.


బ్రహ్మహత్యా పాతకము, వికృత రూపముతో, ఎర్రని బట్టలు ధరించి, ఎర్రని కనులతో, నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని సమీపించింది. భైరవుడు వేగంగా కదిలిపోయాడు. బ్రహ్మహత్యా పాతకము అతని వెనుకే వెళ్ళింది. ఈ రకంగా క్షేత్రాలన్నీ తిరిగి తిరిగి చివరకు కాశీ పట్టణం చేరాడు భైరవుడు. భైరవుడు కాశీ చేరగానే బ్రహ్మహత్యా పాతకము భగ్గున మండిపోయింది. భైరవుడు గంగాస్నానం చేశాడు. అతని శరీరము ధవళ కాంతులతో మిలమిలా మెరిసిపోయింది. ఆ తరువాత శివుని ఆజ్ఞ ప్రకారము కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడుగా ఉంటూ, భక్తులచేత పూజలందుకుంటున్నాడు భైరవుడు.

◆నిశ్శబ్ద