సిల్లీ ఫెలో - 77

 

 

సిల్లీఫెలో - 77

- మల్లిక్

 

"అలాగా... సరే! రేపటి నుండి సీత నా భార్యకాదని సిల్లీగా చాటింపు వేస్తాను" అన్నాడు ఆవేశంగా.

"వెరీగుడ్! దటీజ్ బుష్షీబాబు!" సంతోషంగా బుచ్చిబాబు భుజం తట్టాడు సుందర్. "ఇప్పుడు ఈ షుందర్ కి అసలైన స్నేహితుడివి."

"అయినా నాకు తెలియకడుగుతానూ. మీ చెల్లెలికి కూడా ఇలాగే సలహా ఇస్తారా... పెళ్ళి చేస్కోకుండా కాపురం చెయ్యమని?" అడిగింది రాధ.

తన స్నేహితుడిని అటువంటి ప్రశ్న వేసేసరికి బుచ్చిబాబుకి రాధ మీద మరీ కోపం వచ్చేసింది.

కానీ సుందర్ కి ఏమాత్రం కోపం రాలేదు. అతను చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు.

"నాకు షెల్లెలు లేదు. ఉన్నషో అటులనే సలహా ఇష్షెదను."

"ఒరేయ్ సుందర్... వీళ్ళతో మనకేంట్రా... పద! మనం అలా బయటికెళ్ళొద్దాం" అంటూ సుందర్ ని బయటకి లాకెళ్ళిపోయాడు బుచ్చిబాబు.

సీత దీనంగా రాధవంక చూసింది.

"నువ్వేం దిగులు పడకు. అనుభవం మీద బుచ్చిబాబుకే తెలుస్తుంది! అంతా నే చెప్తాగా!"

సీతం భుజం మీద తట్టింది రాధ.

రెండు రోజులు గడిచిపోయాయి.

ఈ రెండు రోజులూ సీతా, రాధా ఆ ప్రసక్తి తీసుకురాలేదు. బుచ్చిబాబూ, సుందర్లు అంతకంటే ఆ ప్రసక్తి తీసుకురారు.

ఏం జరగనట్టు ఆ నలుగురూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, పేకాడుతూ కాలక్షేపం చేసేశారు.

నలుగురూ కలిసి "చుపుక్ చుపుక్ ముద్దుల బుల్లోడు" అనే సినిమాకి వెళ్ళారు.

"నేను అమెరికాలో డబుల్ యాక్స్ సినిమా షూసినప్పుడు కూడా ఇంట సిగ్గుపడలేదు.... ఓ..." అన్నాడు సుందర్ ఇంటికొచ్చిన తర్వాత "చుపుక్ చుపుక్ ముద్దుల బుల్లోడు" గురించి కామెంట్ చేస్తూ.

బుచ్చిబాబుకి మాత్రం గుండెల మీద నుండి ఎంతో భారం దించినట్టయింది. ఆ రెండు రోజులూ ఎంతో కష్టంతో గడుస్తాయని అనుకున్నాడు గానీ అంత సరదాగా తేలికగా గడిచిపోతాయని అతను అనుకోలేదు.

కానీ మధ్య మధ్యలో రాధ, సుందర్ లు ఒకరిమీద ఒకరు విసుర్లు విసురుకోవడం మాత్రం మానలేదు. ముందుగా ఊరికి రాధ బయలుదేరింది. నలుగురు బస్ స్టాండుకి వెళ్ళి రాధను దింపారు.

"నువ్వేం దిగులు పడకు... ఈ విషయంలో గుణపాఠాలు నేర్చుకోవలసిన అందరూ నేర్చుకుంటారు.

బుచ్చిబాబు, సుందర్ వినేలా అంటూ సీత వీపుతట్టి రాధ హైదరాబాద్ బస్సెక్కింది. అక్కడినుండి ముగ్గురూ రైల్వేస్టేషన్ కి వెళ్ళారు.

"అన్నీ ఆడవారు షెప్పిన విధముగా సేయరాదు. మగాడివల్లె బ్రతుకుము..... ఫోర్స్ ఉపయోగింపుము" రైలు కదిలేముందు సుందర్ బుచ్చిబాబుతో అన్నాడు.

సీత మూతిని ముప్పై మూడు వంకర్లు తిప్పింది.


*             *             *