సిల్లీ ఫెలో - 76

 

 

సిల్లీఫెలో - 76

- మల్లిక్

 

"అసలు ప్రేమించిన వాళ్ళు ఎందుకు పెండ్లి షేషుకొనెదరో, ప్రేమను ఎందుకు షంపుకొనెదరో నాకు అర్థము కాదు" అన్నాడు సుందర్ దీర్ఘంగా నిట్టూరుస్తూ.

"మీకు అర్థంకాకపోయినా స్త్రీకి విలువ ఇచ్చేవారికి మాత్రం అర్థం అవుతుంది లెండీ" చటుక్కున అంది రాధ.

"అనగా నేను స్త్రీకి విలువ ఇవ్వనని మీ ఉడ్డేషమా?" రాధ వంక సీరియస్ గా చూస్తూ అన్నాడు సుందర్.

"ఏమో మరి... ఆ విషయం మీకే తెలియాలి" మూతి తిప్పుతూ ఎటో చూస్తూ అంది రాధ.

"అయినా పెళ్ళీ పెటాకులు లేకుండా ఒక ఆడది వేరే మగాడితో కలిసి జీవిస్తే ఆ ఆడడానికి ఈ సంఘంలో ఏమైనా విలువ వుంటుందాండీ?" ఈ సారి సీత సుందర్ ని అడిగింది.

తమ పెళ్ళి క్యాన్సిల్ కావడానికి సుందరే అసలైన కారకుడని సీతకి సుందర్ మీద చాలా గుర్రుగా వుంది. రాధా, సీతా సుందర్ ని ప్రశ్నలతో ఎటాక్ చేయడానికి నిర్ణయించుకున్నారు.

"విలువ ఎందుకు వుండదు? నేనూ, జూలీ అమెరికానందు కలసి జీవించుషున్నాము. మరి జూలీకి అందరూ విలువ ఇష్షుటలేదా? గొంతు పెంచి అన్నాడు సుందర్.

మీరూ ఆ గోలీ కలసి జీవిస్తున్నారంటే అది వేరే విషయం" అంది రాధ.

"గోలీ కాదు జూలీ" సీరియస్ గా చూస్తూ అన్నాడు సుందర్.

"ఏదో ఒకటిలే! అది అమెరికా... ఇది ఇండియా... అక్కడి పరిస్థితి వేరు. ఇక్కడి పరిస్థితి వేరు"

"అషలు ఈ భూమిపుట్టినప్పుడు, మానవుడు పుట్టినప్పుడూ అందరూ ఓకె విధంగా ఉండెను. కాలము గడిచినకొద్దీ ఒక ప్రాంతమునందు నివషింషువారు వారికై వారు కొన్ని పద్దత్హులు, ఆషారములు ఏర్పరషుకొనిరి. వేరే ప్రాంతమువారు వేరే పద్దతులు, ఆషారములు ఏర్పరషుకొనిరి. ఇవ్వన్నియూ మనము ఏర్పరషుకొనినవే. వద్దనుకునినషో పోవును. కావాలని అనుకొనినషో వుండును."

"ఏంటీ మాకిప్పుడు చరిత్ర పాఠాలూ, సోషల్ స్టడీస్ పాఠాలు చెపుతున్నారు?" వ్యంగ్యంగా అంది సీత.

బుచ్చిబాబు సీత వంక సీరియస్ గా చూశాడు. కానీ అతని చూపుల్ని ఆమె కేర్ చేయలేదు.

"మీరు ఎన్నయినా చెప్పండి. ఇండియాలో అలాంటి పరిస్థితి రాదు. మేము కుటుంబ వ్యవస్థకీ, ప్రేమా, ఆప్యాయతలకీ, సెంటిమెంట్స్ కీ చాలా అలవాటు పడినవాళ్ళం" అంది రాధ.



"అటులయిన పెండ్లి షేషుకొనినయడం ప్రేమ వుండుననియా మీ ఉద్దేషము? పెండ్లి షేషుకున్న వెంటనే ప్రేమ నషింపును. షాలామంది ప్రేమికులు పెండ్లి షేషుకున్న పిదప కుక్కలవలె కోట్ట్లాడుకొనుట నేను సూషితిని."

"అంటే మా సీతా బుచ్చిబాబు పెళ్ళీ గిల్లీ లేకుండా కాపురం చెయ్యాలంటారా? దానికి ఈ సంఘం ఒప్పుకోదు" రెచ్చిపోతూ అంది రాధ.

"షంగానికి ముందుగా షెప్పిన ఒప్పుకొనదు. మనము షంగాన్ని ఫాలోకారాదు. షంగం మనలను ఫాలో కావలెను. మనము షంగము కొరకు లేము. షంగమే మన కొరకు కలదు. ఇదివరకు విధవా వివాహములను ఈ షంగము ఒప్పుకొనినదా? లేదు! మనము నమ్మిన దానిని సేసి ఇతరులకు మార్గదర్షకులము కావలెను. ఇతరులు మనము ఆషరింషిన దానిని ఆషరింషిన ఈ షంగము తోక ముడుషును. అప్పుడు మనము ఆదర్శ పురుషుడు అగుదుము" కాలర్ ఎగరేస్తూ అన్నాడు సుందర్.

బుచ్చిబాబు అవునన్నట్లు బుర్రకాయ్ ఊపాడు.

దానికి రాధ తీవ్రస్వరంతో జవాబిచ్చింది. "దానికి దమ్ము కావాలండీ సుందర్ గారూ! మీ బుచ్చిబాబుకి ఆ దమ్ములులేవు. ఉంటే ఇందాక ఆయన వెడ్డింగ్ కార్డు మీద శ్రీమతి అండ్ శ్రీ బుచ్చిబాబు అని రాసి ఇచ్చినప్పుడు "సీత నా శ్రీమతి కాదు ఆమె నా స్నేహితురాలు. నేనూ ఆమె కలసి జీవిస్తున్నాం" అని ధైర్యంగా అతనితో చెప్పి ఉండేవారు. బుచ్చిబాబుగారు అలా చెప్పలేదంటే ఆయనకి ధైర్యం అయినా లేకపోయి ఉండాలి లేదా తను చేస్తున్నది తప్పని గిల్టీగా అయినా ఫీలయి ఉండాలి.

రాధ మాటలకు బుచ్చిబాబుకి చాలా కోపం వచ్చింది.