సిల్లీ ఫెలో - 78

 

 

సిల్లీఫెలో - 78

- మల్లిక్

 

ఆరోజు రాత్రి....

భోజనాలయిన కాస్సేపు తర్వాత బుచ్చిబాబు మంచం మీద నడుం వాల్చాడు.

"నీ చాప కోసం వెతుక్కుంటావేమో.. అదిగో ఆ మూల పెట్టాను" అన్నాడు బుచ్చిబాబు నిద్రకళ్ళతో ఆవులిస్తున్న సీతతో.

"అక్కర్లేదు!... నీ ప్రక్కనే పడుకుంటా" అంది సీత.

బుచ్చిబాబు తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. "అసలు నేను సరిగ్గా విన్నానా?" అనుకున్నాడు. అతను తేరుకునేలోగానే సీత లైటార్పి బుచ్చిబాబు ప్రక్క పడుకుంది.

"ఏంటీ! నీ ప్రవర్తన చాలా సిల్లీగా ఉందే.... హఠాత్తుగా ఇలా ప్రక్కకొచ్చి పడుకున్నావు?" అన్నాడు.

"సిల్లీగా ఉన్నది నా ప్రవర్తనా, నీ ప్రవర్తనా?" అంటూ అటు తిరిగి పడుకుంది సీత.

కొంపదీసి రాధకూడా ఇంక లాభం లేదని సీతకి లెసన్ తీసుకోలేదు కదా తను చెప్పినట్టు నడుచుకోమని?....


థాంక్యూ రాధా... థాంక్యూ!

మనసులో అనుకున్నాడు బుచ్చిబాబు.

"అటు తిరిగి పడుకున్నావేం... ఇటు తిరిగి పడుకో..." అన్నాడు బుచ్చిబాబు మనసులోని ఆనందాన్ని అదుపులో పెట్టుకుంటూ.

"ఊహు..... నేనిటే తిరిగి పడుకుంటా" అంది సీత.

"కాస్సేపు కబుర్లు చెప్పచ్చుగా?"

"ఈ రెండు రోజులు అర్థరాత్రి దాకా చెప్పుకున్న కబుర్లు చాలవా?"

"అందరం కలిసి చెప్పుకున్నాంగానీ ఇద్దరం ఏకాంతంగా కబుర్లు చెప్పుకోలేదుగా... అసలు హైదరాబాదు నుండి ఇక్కడికొచ్చాక నువ్వు కబుర్లు చెప్పడమే మానేశావ్... ఇదివరకే నయం! పార్కుల్లో, రెస్టారెంట్లలో మనం మనసు విప్పుకొని బోల్డన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం... అవునా?..."


"ఏమోలే.... నాకు బాగా అలసటగా ఉంది... నేనిక పడుకుంటా... నువ్వూ పడుకో. గుడ్ నైట్!" అంది సీత.

"గుడ్ నైట్!" అన్నాడు బుచ్చిబాబు బలవంతంగా.

ఒక అయిదు నిముషాల్లోనే సీత గాఢమయిన నిద్రలోకి వెళ్ళిపోయింది.

"సీత నా ప్రక్కన పడుకున్నందుకు నాకు నిద్రపట్టడం లేదు... అదే నా ప్రక్కన పడుకున్న సీతకి ఇంత హాయిగా నిద్రలా పట్టిందబ్బా" అనుకున్నాడు బుచ్చిబాబు.

అరగంట సేపు అవస్థలు పడిన తర్వాత బుచ్చిబాబు నిద్రలోకి ఒరిగాడు. మళ్ళీ రాత్రి రెండుగంటలకు అతనికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. కారణం బుచ్చిబాబుకి మళ్ళీ నిద్రలోకి ఒరగాలంటే చాలా కష్టమయ్యింది. ప్రక్కన అమాయకంగా ముద్దయిన మొహంతో నిద్రపోతున్న సీత!

లోపల ఎన్నెన్నో మధురమైన ఊహలు.

సీతని గట్టిగా దగ్గరకు లాక్కుంటేనో?" అనుకున్నాడు.

అమ్మో?... మళ్ళీ నడ్డి విరిగేలా క్రిందికి తోసేస్తుందేమో?

భయంతో మనసులోని కోరికలు చంపుకున్నాడు బుచ్చిబాబు.

మళ్ళీ అతను నిద్రలోకి ఎప్పుడు ఒరిగాడో అతనికే తెలీదు.


*         *              *