Read more!

మహిషుని మదన మంత్రాలోచన

 

 

 

మహిషాసురుడు మహామంత్రి రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఉరుకులు, పరుగులమీద ఒగర్చుకుంటూ వచ్చి భయంతో వెర్రి చూపులు చూస్తూ మహిషుని ముందు నిలబడ్డాడు రాక్షసమంత్రి. ఆశ్చర్యంగా రాక్షసమంత్రి వంకచూస్తూ ‘ఏం జరిగింది’ అని అడిగాడు మహిషుడు. ‘అసురేశ్వరా.. మీ ఆఙ్ఞాబద్ధుడనై ఆ సుందరి దగ్గరకు వెళ్లాను. ఆమె అసమాన సౌందర్యరాశి. అష్టాదశభుజ. సింహవాహనం మీద చిరునవ్వులు చిందిస్తూ కూర్చుని ఎంతో అహంకారంగా మాట్లాడింది. మీరొక పశువట. మీవంటి పశువును వివాహం చేసుకోవడానికి తను పశువుకాదట. మిమ్మల్ని మర్యాదగా పాతాళానికి పోయి ప్రాణాలు కాపాడుకొమ్మని హెచ్చరించింది. లేకపోతే మీ ప్రాణాలు తీస్తానని తన మాటగా చెప్పమని నాతో మీకు వర్తమానం పంపింది’ అని పలికి మౌనం వహించాడు రాక్షసమంత్రి. వెంటనే మహిషుడు తన మంత్రులందరినీ సమావేశపరిచి, జరిగినదంతా వివరంగా వారికి చెప్పి, వారి అభిప్రాయాలు చెప్పమన్నాడు. అప్పుడు విరూపాక్షుడు లేచి ‘రాక్షసేశ్వరా..,  మదమెక్కిన ఓ ఆడది అహంకారంతో ఏదో మాట్లాడిందని నీవంటి వీరుడు భీరువు కారాదు. ఇన్ని మాటలెందుకు? నేననిప్పుడే వెళ్లి ఆ మోహనాంగిని సర్పపాశాలతో బంధించి తెచ్చి నీ పాదాలముందు పడేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో’ అన్నాడు.

అనంతరం దుర్ధరుడు లేచి ‘ప్రభూ..,ఆ సుందరి కామశాస్త్ర ప్రవీణ అనిపిస్తోంది. ఆ మదవతి క్రీగంటి చూపులే నిశితశరాలు. ఆ శరాలతో నీ ప్రాణాలు తీస్తానంటోంది. అంటే పరుషునకు వీర్యమే కదా ప్రాణం. అర్ధం చేసుకో. కనుక ఆమెతో యుద్ధం అనవసరం. నన్ను ఆమె దగ్గరకు  పంపు. నా మాటలతో ఆమె మనస్సును నీపై లగ్నమయ్యేలా చేసి నీ దగ్గరకు తీసుకొస్తాను’ అన్నాడు. అప్పుడు తామ్రుడు ఆవేశంగా పైకిలేచి ‘దేవరా., వీరంతా నీ మనసుకు నచ్చేలా మట్లాడుతూ సత్యాన్ని దాస్తున్నారు. పదునెనిమిది చేతులుగల స్త్రీని ఈ సృష్టిలో ఎక్కడైనా చూసామా? విన్నామా? నీ అంతం కోసం దేవతలందరూ ఏకమై సృష్టించిన మాయామోహిని ఆమె. ఇందులో ఏమాత్రం సందేహంలేదు. అలాని ఆమెకు భయపడి పాతాళానికి పారిపొమ్మని నేను చెప్పను. యుద్ధంచేసి ఆమెను సాధించుకో. అప్పుడు ఆమె నీకు బానిస అవుతుంది. ఇది నా ఆలోచన’ అన్నాడు. మహిషునికి, తామ్రుని యోచన బాగా నచ్చింది. ‘తామ్రా..,సమయోచిత వీరుడిలా పలికావు. నీవు ససైన్యంగా వెళ్లి, నీ మాటలతో రసభంగం కాకుండా ఆమెతో సంభాషించి, నా పట్టపురాణిగా ఆమెను సగౌరవంగా నా దగ్గరకు తీసుకుని రా. అది సాధ్యంకాని పరిస్థితిలో నిర్దాక్షిణ్యంగా ఆమెను సంహరించి రా ’ అని పలికి తామ్రుని పంపాడు మహిషుడు. తామ్రుడు పరిసరాలను శ్రద్ధగా గమనిస్తూ,  హవా హనారూఢయైన మహాదేవిని సమీపించి, వినయంగా, సహనంగా, మృదుమథురంగా ‘కోమలాంగీ..మా మహిషాసుర ప్రభువు నీయందు ఎంత అనురక్తుడైయున్నాడో తెలుసా..నీవెంత కఠినంగా, పరుషంగా, అవమానకరంగా మాట్లాడి బదులు పంపినా., ఇంకా నీ ప్రేమనే వాంఛిస్తున్నాడు. నీ సహచర్యమే జీవిత పరమావధిగా భావిస్తున్నాడు.

నీ హితవు కోరిచెప్పే నా మాటలు విని నీవయసుకు, సొగసుకు, సౌందర్యానికి సార్ధకత కలిగేలా ఆలోచించి నిర్ణయం తీసుకో. సరసాలాడవలసిన నీ చేతులకు శర,చాపాలు అలంకారాలు కావు. నా మాటవిని ఇంద్ర చాపాల్లాంటి నీ కనుబొమల కదలికలతో మా ప్రభువును శాసించు. అలాకాదు..యుద్ధమే నీ వాంఛితమైతే. మా సార్వభౌమునితో కలిసి నిర్విరామ శృంగార సంగ్రామాన్ని యధేచ్ఛగా కొనసాగించు. మా అసురేశ్వరుని చేబట్టిన మరుక్షణం నీవు త్రిలోక సామ్రాఙ్ఞివౌతావు’ అని మౌనం వహించాడు.తామ్రుడి మాటలు విన్న జగన్మాత కన్నులు కోపంతో రక్తలోచనాలయ్యాయి.‘మూర్ఖుడా., నీ ప్రభువు కామాంథకారంలోబడి ఙ్ఞానం కోల్పోయినట్టున్నాడు. నేను అవివాహితను అనుకుంటున్నాడేమో. నాకు భర్త ఉన్నాడు. ఆయన నిరాకార, నిర్గుణ, నిరాశ్రయుడు. సర్వఙ్ఞుడు, శాంతుడు,పూర్ణుడు,శుభప్రదుడు అయిన నా భర్తను వదిలి ఒక పశువును వరిస్తానా? కడసారిగా నా మాటను ఆ పశువుకు చెప్పు. ధైర్యముంటే నాఎదుట నిలబడి యుద్ధం చేయమను. లేదా.. పాతాళానికి పారిపోయి ప్రాణాలు కాపాడుకోమను. వెళ్ళు’ అని గర్జించింది. ఆ గర్జనకు దానవ లోకమంతా భయంతో గడగడలాడింది. అంతవరకూ బింకంగా మాట్లాడిన తామ్రుడు జవజీవాలు కోల్పోయి పలాయనం చిత్తగించాడు.

-మహిషుని తుది నిర్ణయం ఏమిటి? ప్రచండయుద్ధమా? పలాయన వాదమా? తెలుసుకోవాలని ఉంది కదూ. అయితే, రేపు ఇదే‘వెబ్ సైట్’కి.. ‘లాగిన్’ అవ్వండి., చదివి ఆనందించండి.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం

 

More Articles

జగజ్జనని ఆవిర్భావం....జగజ్జనని ఆవిర్భావం....

జగజ్జనని ఆవిర్భావం....


మహిషాసురుని విజయ విహారం ....


మహిషాసురుని జన్మవృత్తాంతం ....