దుర్గమ్మ వారిద్దరినీ ఎలా సంహరించింది
మంత్రుల మంత్రాంగంతో సమాలోచన చేస్తున్న మహిషాసురుడు.., జగజ్జనని చేసిన వికటాట్టహాసానికి మరొక్కమారు ఉలిక్కి పడ్డాడు. పరిస్థితి అతనికి బాగా అర్థమైంది. తన మంత్రుల వంకచూసి ‘వింటున్నారుకదా ఆ సుందరి చేస్తున్న వికటాట్టహాసం. మన తామ్రుని ప్రయత్నం కూడా విఫలమైనట్టు తోస్తోంది’ అని అంటూండగా తామ్రుడు పరుగు పరుగున వచ్చి ‘దానవేశ్వరా..ఆ సుందరి’ అంటూ ఏదో చెప్పబోతూంటే, మహిషుడు వారించి ‘నీ రాయబార ప్రయత్నం విఫలమైందని మాకు తెలుసు’ అని మంత్రులవైపు తిరిగి ‘వచ్చిన ఆ సుందరి సాధారణ స్త్రీ కాదు. అబల అంతకన్నాకాదు.., ప్రబల. బాల అయ్యుండి కూడా నీవంటి వీరునితో యుద్ధానికి సిద్ధపడుతోందంటే..ఆమె శక్తి యుక్తులను తక్కువగా అంచనా వేయకూడదు. అనంతర కర్తవ్యాన్ని గురించి ఆలోచించండి’ అని అన్నాడు. అప్పుడు ‘బిడాలుడు’ లేచి ‘దనుజేశ్వరా.., స్త్రీ చేతిలోనే నీ మరణం నిశ్చయమని తెలిసి దేవతలందరూ తమతమ శక్తులతో ఈ మృత్యుసుందరిని నీ కోసం సృష్టించి ఉంటారు. నీ మరణానికి వాళ్ళు పన్నిన ప్రతివ్యూహం ఇది. ఒక స్త్రీ అహంకార చిత్తంతో ఆహవానికి ఆహ్వనిస్తూంటే నీవంటి వీరుడు వెనుకడుగు వేయరాదు. ఆమెను జయిస్తావా..సుఖాలు అనుభవిస్తావు. మరణిస్తే మహోజ్వలకీర్తి దక్కుతుంది.
అపకీర్తితో జీవించడంకన్నా.,మరణించడమే మేలు. కనుక యుద్ధమే చేద్దాం..., పద’ అన్నాడు. అప్పుడు దుర్ముఖుడు లేచి ‘ప్రభూ., యుద్ధమే అనివార్యమే అయితే ఒక అబలను చంపడానికి నీవే యుద్ధరంగానికి పోనక్కరలేదు. నేను, బాష్కలుడు వెళ్ళి ఆ మదనాక్షిని మట్టుబెట్టి వస్తాం. మాకు అనుఙ్ఞనివ్వు’ అన్నాడు. బాష్కలుడు అతని వాదనను బలపరిచాడు. మహిషాసురుడు వారిని ఆశీర్వదించి పంపాడు. బాష్కలుడు, దుర్ముఖుడు యుద్ధభూమికి వచ్చి జగజ్జననిని చూసారు. ఆమె సుందర రూపం వారి మనసులను హరించినా., ఆమె అష్టాదశ హస్తాలలోని వివిధాయుధాలు చూసేసరికి వారికి మరణాంతకంగా తోచింది. భయంతో వారి నాలుకలు పిడచకట్టుకు పోయాయి. అయినా బాష్కలుడు ధైర్యం చిక్కబట్టుకుని ‘సుందరీ., చివరిసారిగా అడుగు తున్నాం. మా ప్రభువుతో వివాహమా? లేక మా చేతిలో మరణమా? తొందరగా నిర్ణయించు’ అన్నాడు. అప్పుడా జగజ్జనని ‘మూర్ఖులారా.., మీ మహిషుడికి మరణంతోనే మనువు కానీ.., నా వంటి మానవతి ఆ నీచునితో వివాహానికి ఏనాడూ సమ్మతించదు. ఆ యుద్ధరంగానికి తొలి నివేదనగా మీ ఇద్దరినీ సమర్పించి, అనంతరం ఆ మహిషుని అంతు చూస్తాను’ అంది.
బాష్కల, దుర్ముఖులు యుద్ధసన్నద్ధులయ్యారు. పోరు మొదలైంది. బాష్కల, దుర్ముఖులు ధనుస్సులు ఎక్కుబెట్టి జగన్మాతపై శరవర్షం కురిపించారు. వాటికి జవాబుగా మహాదేవి తొలిశరాన్ని సంధించి విడిచింది. ఇరుపక్షాల వంక శరయుద్ధం కొన సాగుతోంది. జగజ్జనని చిద్విలాసంగా యుద్దం చేస్తూంటే.. ‘ఆమె శక్తి ఇంతేనా’ అని భావించి బాష్కలుడు అహంకారంతో ముందుకు ఉరికి., వివిధాయుధాలు పుంఖాను పుంఖాలుగా ప్రయోగించాడు. మహాదేవి వాడి యుద్ధతీవ్రతను గ్రహించి క్రుద్ధురాలై, ఐదు నిశితశరాలు సంధించి వదిలింది. బాష్కలుడు పది బాణాలతో ఆ శరాలను ఖండించి మరో పది బాణాలను ఆమెపై ప్రయోగించాడు. జగదంబ వాటిని ఖండించి,అర్ధచంద్రాకార బాణంతో వాడి ధనుస్సును విరిచివేసింది. వెంటనే బాష్కలుడు గదను గిరగిర తిప్పుతూ అమ్మవారిపైకి లంఘించాడు. మహాదేవి ఒక గదను వాడిపైకి విసిరింది. ఆ గద మహా వేగంగా వచ్చి బాష్కలుని శిరస్సును తాకింది. ఆ దెబ్బకు వాడు మూర్ఛబోయి. అంతలోనే తేరుకుని తన చేతిలోని గదను ఆమెపైకి విసిరాడు. జగన్మాత ఆ గదను మార్గమద్యంలోనే తుత్తునియలు చేసి తన త్రిశూలంతో వాడి గుండెల్లో బలంగా పొడిచింది.
బాష్కలుడు గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. అది చూసి రాక్షససేన భయంతో పారిపోతూంటే సకల దేవతలు జయజయధ్వానాలు చేసారు. బాష్కలుని మరణం దుర్ముఖునిలో పౌరుషాన్ని రగుల్కొలిపింది. వాడు మహాదేవి ముందుకు ఉరికాడు. వాడిని చూస్తూనే మహాదేవి శంఖనాదం చేసి శరప్రయోగం చేసింది. దుర్ముఖుడు తన శక్తివంచన లేకుండా వివిధాయుధాలు ప్రయోగిస్తూ యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం తీవ్రరూపం దాల్చింది. రాక్షసవీరుల శిరస్సులు రక్తప్రవాహంలో బంతుల్లా తేలి ఆడుతున్నాయి. ఒక్కసారి రణరంగం భీభత్సంగా మారిపోయింది. దుర్ముఖుడు కత్తిదూసి జగజ్జనని ముందుకు ఉరికాడు. మహాదేవి వాడికి ఖడ్గం విసిరే అవకాశం ఇవ్వకుండా తన ఖడ్గంతో వాడి శిరస్సు ఖండించింది.రాక్షసుల హాహాకారాలతో, దేవతల జయజయధ్వానాలతో ఆనాటి యుద్ధం ముగిసింది. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. సకల ఋషులూ మహాదేవిని ప్రస్తుతించారు.
- మహిషుని మనస్సు మారిందా?
- జగజ్జననితో తామ్ర, చిక్షురుల యుద్దం ఎలా జరిగింది.. తెలుసుకోవాలని ఉంది కదూ. అయితే, రేపు ఇదే‘వెబ్ సైట్’కి.. ‘లాగిన్’ అవ్వండి., చదివి ఆనందించండి.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం
More Articles
మహిషాసురుని జన్మవృత్తాంతం ....