శివరాత్రికి ఉపవాసం ఉండే ఆలోచన ఉందా... ఈ విషయాలు మరచిపోకండి..!
శివరాత్రికి ఉపవాసం ఉండే ఆలోచన ఉందా... ఈ విషయాలు మరచిపోకండి..!
మహాశివరాత్రి హిందూ మతంలో ప్రసిద్ధ పర్వదినం. ఈ రోజున చాలామంది ఆ పరమశివుడుని ఆరాధిస్తూ ఉపవాసం పాటిస్తారు. మహాశివరాత్రినాడు ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం సంకల్పించుకుంటారు. తరువాత మరుసటి రోజు సూర్యోదయం తరువాత ఉపవాసం విరమిస్తారు. ఇలా ఉపవాసం ఉండటం వల్ల కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని, తమ కుటుంబానికి ఏ సమస్య వచ్చినా ఆ పరమేశ్వరుడు అండగా ఉంటాడని అంటారు. అయితే శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలని అనుకునే వారు కొన్ని విషయాలు తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి.
మహాశివరాత్రి అంటే చాలామందికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషంగా విషాన్ని కూడా ఆనందంగా తాగిన విషయమే గుర్తుకు వస్తుంది. దీనికి తగినట్టు శివరాత్రి రోజు శివుడికి అభిషేకాలు జరుగుతాయి. శివుడు సేవించిన విషం నుండి ఆయన శరీరానికి ఓదార్పు లభించడానికే ఆయనకు అభికేకాలు చేస్తుంటారు. ఇకపోతే ఈ రోజు ఉపవాసం ఉండటం చాలా మంది చేస్తారు.
మహాశివరాత్రి ఉపవాసం నియమాలు..
మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటే ఆ రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఉపవాసం ఉన్న రోజు స్వామిని ఆరాధిస్తూ, స్మరిస్తూ ఉండాలి.
మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా శివలింగానికి సమర్పించిన నైవేద్యాలను స్వీకరించకూడదట.
మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు అలసత్వం చూపకూడదు. పేరుకు ఉపవాసం అని చెప్పి ఇతర ఆహారాలను తీసుకోకూడదు. కేవలం పండ్లు, పాలు తప్ప వేరే ఏ ఆహారాలు ఉపవాసంలో తీసుకోకూడదు.
మహాశివరాత్రి ఉపవాసం ఉండేవారు తప్పనిసరిగా శివుడికి రుద్రాభిషేకం లేదా జలాభిషేకం చేయాలి. దీనివల్ల ఉపవాస ఫలితం పెరుగుతుంది.
శివరాత్రి రోజు శివనామ జపం, శివ ఆరాధన తప్పనిసరిగా చేస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు అయినా తొలగుతాయి.
ఉపవాస సమయంలో తృణధాన్యాలు, ఉప్పు, తరిగిన కూరలు, నూనె.. మొదలైన వాటిని నిషేధించడం మంచిది.
శివరాత్రి రోజు పొరపాటున కూడా ఇంట్లోకి మాంసం లేదా మద్యం తీసుకురాకూడదు. ఇంట్లో ఎవరైనా నాస్తికులు ఉండి ఇవన్నీ కావాలని అనుకుంటే వారిని బయటకు వెళ్లి వారికి ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్పాలి.
సంపూర్ణ ఉపవాసం కాకుండా ఒక్కపొద్దు ఉండేవారు ఆహారంలో ఉల్లి, వెల్లుల్లిని నిషేధించాలి. పూర్తీగా సాత్వికాహారం తీసుకోవాలి.
అన్నింటికంటే ముఖ్యంగా ఇతరులను దూషించడం, నిందించడం, ఇతరులతో కఠినంగా మాట్లాడటం, అబద్దాలు చెప్పడం వంటివి చేయకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసును దేవుడి మీదనే లగ్నం చేయాలి.
పై నియమాలు అన్నీ పాటిస్తే ఉపవాస ఫలితం దక్కుతుంది.
*రూపశ్రీ.