మహా బలసంపన్నులు మధుకైటభులు (MadhuKaitabhulu)

 

మహా బలసంపన్నులు మధుకైటభులు

MadhuKaitabha

 

సృష్టికి పూర్వం విష్ణుమూర్తి క్షీరసాగరంలో నిద్రిస్తున్న సమయంలో ఆయన చెవుల నుండి ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు. వారే మధుకైటభులు. అప్పుడు ఇంకా భూమి లేదు. చుట్టూ సముద్రమే.

పుట్టిన వెంటనే మధుకైటభులు తమ పుట్టుకకు కారణమేమి? ఈ స్థితిని శాసిస్తున్న శక్తి ఎవరు అని ఆలోచిస్తూ, ఆ శక్తిని ఉద్దేశించి వేయి సంవత్సరాలపాటు తపస్సు చేశారు.

వారి తపస్సుకు ఆదిశక్తి ప్రత్యక్షం కాగా స్వచ్ఛంద మరణాన్ని వరంగా కోరుకున్నారు.

ఆదిశక్తి ఆ వరాన్ని ప్రసాదించి అదృశ్యం కాగా, మధుకైటభులు బ్రహ్మాది దేవతలను పీడించసాగారు.

అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా, విష్ణుమూర్తి వారితో ఎంతకాలం యుద్ధం చేసినా, జయాపజయాలు తేలకపోవడంతో, చివరకు విష్ణుమూర్తి ఆదిశక్తిని ప్రార్థించి, ఆమె సూచన ప్రకారం, మధుకైటభులను పొగడ్తలతో ముంచెత్తాడు.

‘ఏదైనా వరం కోరుకొండ’ని అడగగా, ‘మేమే నీకు వరమిస్తాము’ అన్నారు రాక్షసులు.

అప్పుడు విష్ణుమూర్తి “మీరిద్దరు నా చేతిలో మరణించాలి’ అన్నాడు.

అందుకు బదులుగా మధుకైటభులు ‘నీరు లేని ప్రదేశంలో మమ్ము సంహరించ” మని కోరారు.

మధుకైటభుల కోరిక మేరకు విష్ణుమూర్తి తన తొడలను విశాలంగా పెంచి, ఆ తొడలపై రాక్షసులను సంహరించాడు.

అధర్మవర్తన ఉన్న కారణంగా మధుకైటభులను రాక్షసులుగా పరిగణించారు.