మన్మథుని ఆశీస్సులు లభించాలంటే... (వాలెంటైన్స్ డే స్పెషల్)

 

 

 

మన్మథుని ఆశీస్సులు లభించాలంటే...

(వాలెంటైన్స్ డే స్పెషల్)

 

 

ఇతర జీవులతో పోలిస్తే మనుషులకు మాత్రమే మంచి, చెడుల విచక్షణ ఉంటుంది. ఆ విచక్షణ కారణంగానే మోహం కాస్తా బంధానికి దారితీస్తుంది. ఓ శారీరిక చర్యగా మిగిలిపోవాల్సిన ఆకర్షణ, జీవితాంతం తోడుండే ప్రేమగా పరిణమిస్తుంది. అందుకే మనిషి ప్రేమను కూడా ఓ దైవంగా భావించాడు. రోమన్లు క్యూపిడ్ అని పేరు పెట్టినా, గ్రీకులు ఎరోస్ అని పిల్చుకున్నా... వారంతా ప్రేమకు అధిదేవతలే! ఇక భారతీయ పురాణాలలో అయితే కామదేవునిగా కొలవబడే మన్మథుడు కలిగించే ఆసక్తి అంతా ఇంతా కాదు.

 

మన్మథుడు సాక్షాత్తూ ఆ బ్రహ్మకుమారుడు. మనుషుల మనసులో మోహాన్ని రేకెత్తించగల వరాన్ని జన్మతః కలిగినవాడు. తనకు కలిగిన వరం ఎంతమేరకు ఫలిస్తుందో పరీక్షించేందుకు ఆ మన్మథుడు స్వయంగా తన తండ్రి మీదే బాణాలను సంధించాడట. దాంతో కోపగించుకున్న బ్రహ్మదేవుడు మున్ముందు శివుని మూడోకంటిని భస్మం అయిపోతావంటూ శపించాడు. అయితే ఆ శాపం లోక కళ్యాణానికే ఉపయోగపడింది. దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి భస్మం అయిపోయిన తరువాత శివుడు విరాగిగా మారిపోయాడు. సుదీర్ఘమైన ధ్యానంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తారకాసురుడు అనే రాక్షసుడు, ఆ శివునికి కలిగే సంతానం వల్లే తనకు మృత్యువు ఉండాలన్న వరాన్ని కోరుకున్నాడు. వైరాగ్యంలో కూరుకుపోయిన శివునికి సంతానం కలుగదన్నది అతని ధీమా!

 

శివుని మనసుని ఎలాగైనా మరలుగొల్పి, పార్వతీదేవిగా అవతరించిన సతీదేవి మీద అతని మనసుని లగ్నం చేయాలని భావించారు దేవతలు. ఆ కార్యాన్ని సాధించేందుకు వారికి మన్మథుడే కీలకంగా తోచాడు. పార్వతీదేవి, శివుడు ధ్యానం చేసుకునే వనంలోకి ప్రవేశించే సమయంలో అతని మీదకు తన పూలబాణాలను సంధించాడు. దాంతో ధ్యానం చెదిరిన శివుడు కోపంతో తన మూడో కంటిని తెరిచి ఆ మన్మథుని భస్మం చేశాడు. అయితేనేం! అప్పటికే ఆయన హృదయానికి మన్మథశరాలు గుచ్చుకునిపోయాయి. తన కంటి ఎదురుగా ఉన్న పార్వతీదేవి మీదకి దృష్టి మరలింది. మన్మథుని భార్య రతీదేవి వేడుకోళ్లతో ఆయన మనసు కరిగింది. మన్మథుని మళ్లీ జీవింపచేశాడు. కానీ చేసిన తప్పుకి శిక్షగా ఇక మీదట మన్మథుడు ఎలాంటి శరీరమూ లేకుండా ఉండిపోతాడని శపించాడు. అప్పటి నుంచీ మన్మథునికి ‘అనంగుడు’ అన్న పేరు స్థిరపడిపోయింది. ఇలా మన్మథడు శివుని తపస్సుని భగ్నం చేసిన చోటు తమిళనాడులోని అరగళూరు అని అంటారు. ఈ సంఘటనను పురస్కరించుకుని అక్కడ ‘కామేశ్వరుడు’ అన్న పేరుతో శివునికి గొప్ప ఆలయం కనిపిస్తుంది.

 

మన్మథుడు అనంగుడే కావచ్చు. కానీ అవసరం అయినప్పుడు ప్రేమికులను కలిపేందుకు సర్వసన్నద్ధంగా బయల్దేరతాడు. ప్రేమ రాయబారాలు నడిపే చిలుకే అతని వాహనం, తియ్యటి చెరుకుగడే అతని విల్లంబు, మల్లె వంటి అయిదు రకాల పుష్పాలే అతని బాణాలు... వాటితో అతను మనసులకి మధించి వేయగలడు. అలా మనసుని మథించేవాడు కాబట్టి మన్మథుడు అని అంటారట. ఇక కోరికలను రగిలించేవాడు కాబట్టి కామదేవుడు అన్న పేరూ కనిపిస్తుంది. రుగ్వేదకాలం మొదలుకొని పురాణేతిహాసాల వరకూ హైందవుల ప్రతి పుణ్యగ్రంథంలోనూ అతని పేరు వినిపిస్తుంది.

 

మన్మథునికి ప్రత్యేకించి ఆలయాలేవీ లేకపోవచ్చు. కానీ అనేక ఆలయాల మీద ఉన్న శిల్పాలలో ఆయన దర్శనమివ్వక మానడు. తన భార్య రతీదేవితో కలిసి మన్మథుడు చేసే ప్రేమప్రయాణం అనేక ప్రాచీన ఆలయాల మీద కుడ్యచిత్రాల రూపంలో కనిపిస్తుంది. ఇక మన్మథుని పేరుతో అనేక పర్వదినాలు కూడా మన గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. ఫాల్గుణ కృష్ణ తదియ రోజున కామమహోత్సవం అనీ, చైత్ర శుద్ధ త్రయోదశి మదన త్రయోదశి అనీ మన్మథుని కొలుచుకునేందుకు నియమించారు. ఇక ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున వచ్చే హోళీ (కాముని పున్నిమ) గురించి చెప్పేదేముంది! ఈ రోజునే మన్మథుని శివుడు దహించివేశాడని ప్రతీతి. అందుకు సూచనగా కొన్ని ప్రాంతాలలో మంటలు వేయడం కనిపిస్తుంది. మన్మథుని తలచుకునేందుకు, అతని పేరుతో ప్రేమని కొలుచుకునేందుకు ఈ రోజున యువతీయువకులు రంగులు చల్లుకునే సంప్రదాయం ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వస్తోంది.

 

ప్రేమను రగిలించే దేవునిగా మన్మథుని గురించి ఇంతసేపూ చెప్పుకొన్నాము. మరి ఆ దేవుని ప్రసన్నం చేసుకునే ఉపాయమూ లేకపోలేదు. కామగాయత్రి పేరుతో మన్మథుని పేరిట ఉన్న గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఆ మన్మథుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. తోడు దొరికేందుకు, బంధం నిలిచి ఉండేందుకు, ఆకర్షణ పెరిగేందుకూ... ఈ కామగాయత్రిని జపించమని సూచిస్తుంటారు. ఆ మంత్రం ఇదే...

ఓం కామ దేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్!

- నిర్జర.