మహాశివుడికి ఇల్లూవాకిలీ లేదట...(Mahashiva Illuvakili..)

 

మహాశివుడికి ఇల్లూవాకిలీ లేదట...

(Mahasiva Illuvakili..)

బోళా శంకరుడైన మహాశివునిమీద ఎన్నో వ్యంగ్యాస్త్రాలు ఉన్నాయి. క్షుప మహారాజు మొదలు శ్రీనాథుడు లాంటి కవీశ్వరుల వరకూ ఏదో సందర్భంలో శివుని అపహాస్యం చేశారు. శివుడు ల్లూవాకిలీ లేని నిరుపేదవాడని, భిక్షాటన చేస్తాడని, ఒంటికి జంతుచర్మం మాత్రం చుట్టుకుంటాడని, ఒకచోట స్థిరంగా ఉండకుండా బికారిగా స్మశానంలో సంచారం చేస్తుంటాడని, బూడిద రాసుకుంటాడని, తిరిపెమునకు ఇద్దరు భార్యలా అని - ఈ వరసన ఎన్నో నిందలు, అవహేళనలు ఉన్నాయి. కానీ, మహాశివుని రూపం, చేష్టల వెనుక మర్మం ఉంది. ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందాం.

 

భిక్షాటన సన్యాసి లక్షణం. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఏమీ లేకపోవడం లేమికి నిదర్శనం కానేకాదు. లోకంలో ఉన్న బంధాలు, అనుబంధాలు, మోహాలు, వ్యామోహాలు అన్నీ కూడా మిధ్య. నాది, నేను అనే అహంకారం మనిషిని ఎదగనీయదు. ఈ భవబంధాల్లో పడితే, కుడితిలో పడ్డ ఎలుక చందమే అవుతుంది. బంధాలు, వ్యామోహాలలో చిక్కుకుంటే ఇక పారమార్థిక చింతన ఉండదు. ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే మహాశివుడు బిక్షాటన చేశాడు.

 

మహాశివునికి లేమి అనుకుంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదు. కుబేరునికి అష్ట సిద్ధులు, నవ నిధులు ఇచ్చింది శంకరుడే. ఆదిశంకరునికి వస్తువులమీద, సంపదల మీద ఎలాంటి భ్రాంతి, వ్యామోహం లేదు.

 

శివునికి ఇల్లు లేకపోవడం ఏమిటి? విశ్వమంతా ఆయన ఇల్లే. ఇంకా చెప్పాలంటే, భక్తుల హృదయాల్లో ఆయన నివాసం ఉంటాడు.

 

మహాశివుడు అనామకుడు అనుకునేవాళ్ళు అజ్ఞానులు. లయకారుడు అయిన శివుడు లేకపోతే సృష్టి అనేది లేదు. శివునికి ఆద్యంతాలు లేవు. శివుడు నిర్గుణుడు, నిరాకారుడు. మహాశివుని అఖండ శక్తిని అర్ధం చేసుకోవడం దేవతలకే సాధ్యం కాదు, ఇక తక్కినవారికి ఏం సాధ్యమౌతుంది?

 

ముల్లోకాలను కనిపెట్టుకుని ఉండాల్సిన మహాశివునికి ఒకచోట స్థిరంగా కూర్చోడానికి ఎలా వీలవుతుంది? నిరంతరం సంచరిస్తూనే ఉండాలి. ఒక మహా బాధ్యతను పనిలేనితనంగా చిత్రించుకోవడం అవివేకం.

 

మహాశివుడు భక్త సులభుడు. పిలిస్తే చాలు పలుకుతాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు. మహాశివుడు ఏకంగా హాలాహలాన్ని గరళంలో దాచుకున్నాడు. అదీ ఆయన గొప్పతనం.

 

మహాశివుడు తలచుకుంటే సర్వ సంపదలూ ప్రసాదించగలడు. ఆగ్రహం వస్తే, అమాంతం అన్నిటికీ భస్మం చేయగలడు. త్రిమూర్తుల్లో ఒకడైన మహాశివుని అపహాస్యం చేయడం అంటే, అంతకంటే అపహాస్యం మరేదీ లేదు.

 

Lord Mahashiva, Shiva Stotras, MahashivaArticles, Srinatha Chatuvulu Mahashiva, Mahashiva and Kubera, Mahashiva Bikshatana